‘వాయులీనం’ అనగానే ద్వారం వెంకటస్వామినాయుడు గుర్తుకొస్తారు... అనితరసాధ్యమైన బాణీ ఆయనది... చూపు లేకపోయినా సంగీత సాగరంలో లోలోతుల్ని దర్శించిన మహామహుడు...ఆయనకు వాయులీన విద్యలో వారసురాలు... ఆయన కుమార్తె మంగతాయారు... ఆమె తండ్రి తర్ఫీదులో పెరిగారు. తండ్రికే కాదు, అనేకమంది ప్రసిద్ధ విద్వాంసులకు పక్కవాద్యం అందించారు. ఐదేళ్ల క్రితం వరకు కూడా కచ్చేరీలలో పాల్గొంటూనే ఉన్నారు. ఎనభై అయిదేళ్ళ వయసులో ఆమె పంచుకుంటున్న నాన్న జ్ఞాపకాలివి..

 
‘‘నేను మా నాన్న గారికి రెండో సంతానం. మా ఇల్లు సంగీత సభలా ఉండేది. చిన్నప్పటి నుంచీ నాన్నగారి చెయ్యి పట్టుకొని తిరిగేదాన్ని. అందుకే నాకోసం మా నాన్నగారు ప్రత్యేకంగా శిక్షణ మొదలుపెట్టకుండానే సంగీతం నాలో భాగం అయిపోయింది. మా నాన్నగారు బెంగళూరులో పుట్టారు. అక్కడ మా తాతగారు మిలటరీలో సుబేదార్‌ పదవిలో ఉండేవారు. ఆయనకు బదిలీ అవడంతో అక్కణ్ణించీ విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి దగ్గరలోని కశింకోటకు వచ్చారు. తరువాత విజయనగరం చేరుకున్నారు. మా పెద్దలు అందరిదీ మిలటరీలో పనే. అక్కడ విధులు పూర్తి చేసుకున్నాక, విసుగెత్తిపోయినవారు రిలాక్స్‌ కావడం కోసం వయొలిన్‌ వాయించేవారు.
 
నాన్నగారికి వయొలిన్‌ అంటే ఎంతో ఇష్టం. కానీ ఇంట్లో ఉన్న వయొలిన్‌ తీస్తే పెద్దవాళ్ళు దెబ్బలాడతారని ఆయనకు భయం. అందుకే దొంగతనంగా తీసి వాయించేవారట! ఆ ఆసక్తిని గమనించి మా తాతగారితో మా పెదనాన్న వెంకటకృష్ణయ్యగారు ఈ సంగతి చెప్పారు. ‘‘వాడికి ఎలా రాసిపెట్టి ఉందో! అలాగే కానివ్వండి’’ అని తాతగారు అనుమతి ఇచ్చారు. ఒకసారి మా నాన్నగారు విజయనగరం మహారాజావారి కోటలో వయొలిన్‌ వాయించారు. ‘ఇతన్ని సంగీత పాఠశాలలో ప్రవేశపెట్టండి’ అని రాజావారు సూచించారు. అలా విజయనగరం సంగీత కళాశాలలో వయొలిన్‌ ప్రొఫెసర్‌గా నాన్నగారు చేరారు. హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసుగారు మా నాన్నగారిని ఎంతో ఆదరించారు.
 
ఒక్క వేలితోనే జాలువారు గమకాలు
సంగీతంలో నాన్నగారిది ప్రత్యేకమైన బాణీ. ఒక వేలితో స్వరం చెప్పేవారు. వయొలిన్‌లో ‘జారు గమకా’న్ని ఎక్కువగా ఒక వేలితో వాయించేవారు. సాధారణంగా చూపుడు వేలితోనో, మధ్య వేలితోనో వాయిస్తారు. నాన్న గారు ఏ వేలితోనైనా... నాలుగు తీగల మీద ఏ స్థానంలోనైనా వాయించగలిగేవారు. ‘కన్నుగల డరచేతియందు’అని చెళ్ళపిళ్ళవారూ, ‘సరస్వతి అతని వేళ్ళమీద నాట్యంచేస్తుంద’ని రాజగోపాలాచారిగారు మెచ్చుకున్నారు. ‘‘ఒక తీగమీంచి ఇంకొక తీగమీదకు కమాను వెంట్రుకలు మారినట్టు తెలీకుండా నాయుడుగారు వాయించగలరు’’ అని మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రశంసించారు. అలాగే ‘వేయి సాధకం’లో కూడా తనదైన శైలి చూపించేవారు. నాన్నగారు చేసినట్లు మూడు స్థాయిల్లో వేయి సాధకాన్ని ఎవరూ ఉండరు.