ఉత్తరాంధ్ర కథా రచయిత కాండ్రేగుల శ్రీనివాసరావు. ఆన్‌లైన్‌ పత్రికల్లో కూడా ఆయన ఎంతో పాపులర్‌. పాఠకుడితో ఆసక్తిగా చదివించడమే కథకుడి మొదటి లక్షణం అంటారాయన.పాతతరం రచయితల్లో సుప్రసిద్ధ రచనల్ని యువ రచయితలు అభ్యాసపూర్వకంగా చదివి ఆకళించుకోవాలంటున్న శ్రీనివాసరావు ఇంటర్వ్యూ..

హైస్కూల్లో ఉన్నప్పుడే శ్రీనివాసరావు రచనావ్యాసంగానికి బీజం పడింది.ఆయన తండ్రి కాండ్రేగుల సత్యారావు. తల్లి నూకాలమ్మ. తండ్రి రైల్వే ఉద్యోగి. ప్రవృత్తిరీత్యా రంగస్థల దర్శకుడు. నాటక పరిషత్‌లలో ఎన్నో బహుమతులు అందుకున్న దిట్ట. సినీనటులు పావలాశ్యామల, లీలారాణి, కె.విజయలక్ష్మి ఆయన నాటకాల్లో నటించినవారే. సొంతూరు విజయనగరం వదిలి విశాఖపట్నంలో స్థిరపడ్డారు.హైస్కూల్లో తెలుగు ఉపాధ్యాయులు మోహన్‌శాస్త్రి సాహిత్య పాఠాల ప్రభావం, తన ముగ్గురు అక్కయ్యలకు పుస్తకాలకోసం రోజూ లైబ్రరీకి వెళ్ళడంవల్ల ఆయనకు పుస్తకపఠనం అలవడింది. సోవియట్‌ భూమిలో బాలల కథలు, చందమామ, బాలమిత్రసహా వారపత్రికలన్నీ చదివేవారు. ఏడెనిమిది తరగతుల్లో ఉండగానే, తన చుట్టుపక్కల జరిగే అన్యాయాన్నిచూసి ‘జరుగుతున్న అన్యాయం’, ‘ఇదెక్కడిన్యాయం’, ‘తప్పు ఎవరిది’ అనే కథలు రాశారు.

పత్రికలో అచ్చైన ఆయన మొదటి కథ ‘స్వార్థం’. విచిత్రం ఏమిటంటే, 1986లో ఒకేసారి రెండు వారపత్రికల్లో శ్రీనివాసరావు కథలు ప్రచురితమయ్యాయి. అలా పాఠకులకు చేరువైన శ్రీనివాసరావు తన ముఫ్ఫైఏళ్ళ ప్రస్థానంలో నేటివరకు 350కిపైగా కథలు రాశారు.ఒక దినపత్రికలో కాళీపట్నం రామారావు (కారా) గారు నిర్వహించే ‘నేటికథ’ శీర్షికలో ‘స్వార్థం’ కథ, ఆంధ్రజ్యోతి వారపత్రిక ‘కాలం దాటని కథ శీర్షికలో ‘ఖళ్‌...ఖళ్‌’ అనే కథ ఒకేవారంలో వచ్చాయి.కా.రా దగ్గర కథామెళకువలుశైశవదశలో ఉన్న శ్రీనివాసరావు రచనలు చూసి ముచ్చటపడిన కా.రా ఆయన్ను పిలిచి సలహాలు, సూచనలు ఇచ్చి మంచి కథకుడిగా తీర్చిదిద్దారు. వంగపండు, చలసాని ప్రసాదరావు, వివిన మూర్తి, కవనశర్మ లాంటి ఎంతోమంది ప్రసిద్ధ ఉత్తరాంధ్ర రచయితల పరిచయభాగ్యం కారా ఇంటివద్దే ఆయనకు కలిగింది.

ఒక మంచి కథావస్తువును ఎన్నుకున్నప్పుడు, రచనాశైలి, శిల్పం, కొసమెరుపులతో కథను ఎలా తీర్చిదిద్దాలో తొలి పరిచయంలోనే ఆయన కారా దగ్గర నేర్చుకున్నారు.‘‘జోకులు సాగదీస్తే, అది కథ అవదు, నిరాశావాదం సాహిత్యానికి పనికిరాదు, సంభాషణలు రాసినంతమాత్రాన అది కథ అయిపోదు, కథావస్తువు మంచిదైనా కథ చెప్పే విధానం కూడా బాగుండాలి, కథ నిడివి ఎక్కువ ఉండకూడదు....’’ అంటూ తన కథలపై కారా చేసిన విశ్లేషణాత్మకమైన సూచనలన్నింటినీ గుణపాఠాలుగా స్వీకరించి, మెరుగులు దిద్దుకుంటూ క్రమంగా మంచి కథారచయితగా ఎదిగారు శ్రీనివాసరావు.పలు భాష‌ల్లోకి అనువాదం‘భోజ్యేషుమాత’, ‘స్మృతి’, ‘హక్కుదారుడు’ సహా శ్రీనివాసరావు కథలెన్నో ‘ఆంధ్రప్రభ, జ్యోతి మంత్లీ, మయూరిలాంటి ప్రముఖ పత్రికల్లో వచ్చాయి.

25 కథలు హిందీలోకి అనువాదమయ్యాయి. ‘తొలి కిరణం’, ‘అమ్మకోమాట’ కన్నడంలోకి అనువాదమై, కన్నడ కథాసంకలనంలో ప్రచురితమయ్యాయి.ఆయన ఇరవైనాలుగు తెలుగుకథలసంపుటి ‘మా ఇంటి పూదోట’ (2014) హిందీలో కూడా రాబోతోంది. 30 కథలతో ‘వెన్నెల వాన‌’ అనే మరో కథల సంపుటి కూడా త్వరలో రాబోతోంది.విశాఖ సాహితీవారి ‘విశాఖ తరంగాలు’ రమ్యసాహితివారి ‘కథామందారాలు’, హైదరాబాద్‌వారి ‘మా కథలు’ సంకలనం సహ వివిధ సాహితీసంస్థల సంకలనాల్లో శ్రీనివాసరావు కథలు వెలువడ్డాయి. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కాలేజీ వైస్‌ ప్రిన్సిపాల్‌ సి.వి.ఆర్‌.మూర్తి (గోవా) చొరవ–కృషివల్ల, శ్రీనివాసరావు 30 కథలు ‘కాండ్రేగుల కథలు’ పేరిట యూట్యూబ్‌లో ఆడియో వాయిస్‌ రూపంలో అందుబాటులోకి వచ్చాయి.