కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, రాష్ట్రపతి పురస్కార గ్రహీత వాచస్పతి ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారితో ముఖాముఖి


ఈ పేరు తెలుగు సాహితీప్రియులకు సుపరిచితమే. వీరికి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డుతో పాటు 2018లో రాష్ట్రపతి పురస్కారంతో సహా అనేక ఇతర ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలు వరించాయి. ఇటీవల తిరుపతిలోని రాష్ట్రియ సంస్కృతవిశ్వవిద్యాలయంవారు వాచస్పతి బిరుదాన్ని బహూకరించి సత్కరించారు. ఆ సందర్భంగా బేతవోలువారితో ముఖాముఖి

 

1. బేతవోలు రామబ్రహ్మం గారంటే – మొదట్లో అవధానానికి పెట్టింది పేరు. ఆ తరువాత ‘పద్యానికి పెద్ద దిక్కు’ ఇప్పుడు వ్యాఖ్యానబ్రహ్మ అంటోంది సాహితీలోకం. ఆ స్థాయిని పొందటానికి మీరు చేసిన కృషి, పొందిన స్ఫూర్తి వివరిస్తారా?

నేను కొవ్వూరు సంస్కృత కళాశాలలో భాషాప్రవీణ చదివిననాటినుండే పద్యం అంటే మక్కువ. అప్పుడే పోటాపోటీగా కావ్యాలు రాస్తుండేవాళ్ళం. అదే అవధాన విద్యలో రాణించడానికి ఉపకరించింది. మా గురువులు రావూరి వేంకటేశ్వర్లుగారి ప్రోత్సాహం వారి తర్ఫీదు నన్ను అవధానరంగంలో నిలబెట్టింది. ఆ తరువాత పద్యం రాసే కవి గురించి ఒక ప్రశంసావాక్యం పలకడం గానీ, రాయడం గానీ కరవై పోయిన రోజుల్లో నేను సమకాలిక పద్యకావ్యాల్ని పాఠకులకు పరిచయం చేయాలనుకున్నాను. చేస్తూ పత్రికల్లో చాలా వ్యాసాలు రాశాను. చాలా కాలం ఒక దినపత్రికలో (ఆంధ్రభూమి) ఒక కాలమ్ నడిపాను. వచన కవిత్వానికి చేరా అందించిన ప్రచారంలో ఒక వంతు పద్యకవిత్వానికి నేనందించాను. అలాగే, పద్యకృతులకి చాలా వాటికి పీఠికలు రాశాను. ప్రాచీన పద్య కావ్యాల్లోని అందచందాలను ఆధునిక పాఠకులకు ‘పద్యకవితా పరిచయం’ ద్వారా పరిచయం చేశాను. పద్యకవి సమ్మేళనాలూ అవధానాలూ వీటి నిర్వహణ మరొక పార్శ్వం. ఇన్ని కారణాలుగా పద్యకవులు, పద్యకవితా ప్రియులు నన్ను ‘పద్యానికి ఒక పెద్ద దిక్కు’ అని గౌరవిస్తున్నారు. ఇది తొంభై శాతం వారి ఔదార్యం. పెద్ద దిక్కు అంటే రూపంలో నాది భారీ విగ్రహమే. వయస్సు సరేసరి. ఆ తరువాత సంస్కృత నాటకాలకు వ్యాఖ్యానాలు కొన్నింటికి రాశాను. తెలుగులో ప్రాచీనకావ్యాలకు వ్యాఖ్యానాలు అందించాను. అందిస్తున్నాను.

2. మీ జీవన నేపథ్యం, కుటుంబ వాతావరణం మీ సాహితీ ప్రస్థానానికి తోడ్పాటునందించాయా?

నాకు తెలిసి మా కుటుంబంలో శాస్త్ర పండితులు గానీ, సాహితీవేత్తలు గానీ లేరు. మా నాన్నగారు హైస్కూల్ చదువుతో ఆపేసి, రోడ్డు గుమాస్తాగా ఉద్యోగించారు. పదిమంది సంతానంతో గంపెడు సంసారం. పేదరికం ఎలా ఉంటుందో రుచి చూసిన జీవితం. కొవ్వూరు పాఠశాలలో కాణీ ఖర్చు లేకుండా నేర్పే చదువు అని తెలిసి భాషాప్రవీణలో ప్రవేశపెట్టారు నన్ను. అప్పటివరకు పాఠశాల స్థాయిలో (ఎస్ ఎస్ ఎల్ సి) తెలుగు అంటే అభిమానం ఏర్పడిందే గానీ సంస్కృతంతో పరిచయం కూడా లేదు. కొవ్వూరు పాఠశాలలో దిగ్దంతుల్లాంటి పండితులు ఆదరించి నాలుగు ముక్కలు నేర్పితే 1969 లో భాషాప్రవీణ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బంగారు పతకాన్ని పొందగలిగాను. 1970 నుంచి తెలుగు పండితుడిగా, లెక్చరర్ గా, రీడర్ గా, ప్రొఫెసర్ గా ఉద్యోగాల ప్రస్థానం. ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంతంలో మొలకెత్తి, నాగార్జున విశ్వవిద్యాలయంలో పెరిగి, కేంద్రీయ విశ్వవిద్యాలయానికి జరిగి ఇప్పటికి ఇలా ఉన్నాను.