‘ఫిలాసఫీ ఆఫ్‌ నేచర్‌’ అనే ఉపశీర్షికతో విడుదలవు తున్న మీ ‘అవని’ పుస్తకాన్ని ఏ రకమైన రచనగా వర్గీకరించవచ్చు. కవిత్వమా, వచనమా?

ఇది వచన కవిత్వం. ఒక్కొక్క జీవికి సంబంధించిన ఆత్మకథలను ప్రతిఫలిస్తుంది. ప్రకృతి సృష్టించిన సమస్త జీవరాశి తన అందచందాలతో తన ప్రతిభతో జీవించి సమస్త లోకాలను ప్రభావితం చేస్తుంది. మిణుగురు పువ్వు వెలుగుల్ని, సాలీడు మగ్గంను, కోయిలలు పాటల్ని, రామ చిలకలు పలుకుల్ని, లేళ్ళు పరిగెత్తటాన్ని, పులులు వేటాడ టాన్ని... ఇలా సమస్త జీవరాశి ఒక్కొక్క ప్రతిభ కలిగి ఉంటుంది. ఇలాంటి జీవరాశి యొక్క ప్రతిభను ఆధారం చేసుకునే మానవుడు అద్భుతమైన ప్రగతిని సాధిస్తూ వచ్చాడు. ఉదాహరణకు: తుమ్మెదను చూస్తూ విమానాన్ని కనిపెట్టాడు. ఇలా అభివృద్ధి వైపు దూసుకొచ్చిన మనిషి ప్రకృతిని నిర్లక్ష్యం చేయటం వల్ల ఒక్కొక్క జీవి మనుగడ ప్రశ్నార్థకమైంది. జీవరాశి జీవించే నదులు పొల్యూట్‌ అయ్యాయి. అడవులు అంతరించిపోయాయి. గాలి కలుషితమై పోయింది. ఇప్పుడు నేలతల్లి సమస్తరోగాలతో బాధపడు తుంది. తను కట్టుకున్న ఓజోను చీరే చిరిగిపోయింది. తన శరీరం జ్వరంతో మండిపోతోంది. తన కాళ్ళు గతి తప్పుతున్నాయి. తన చేతులు పని చేయకున్నవి. తన చూపు తగ్గిపోతుంది. చెవులు వినిపించకున్నాయి. హృదయం స్పందించ లేకుంది. ఇలా రోజు రోజుకి నిర్జీవమైన ఈ పుడమి తల్లే నాతో ఈ పుస్తకం రాయించింది.
 
మీలో యీ పర్యావరణ ప్రేమకు మూలాలెక్కడివి?
ఒకనాడు మనం అడవుల్లో కొండల్లో నదీజలాల్లో చెలమలు తీసుకొని హాయిగా మంచినీళ్ళతో జీవించేవాళ్ళం. సమస్త పంటల్ని పండించుకొనేవాళ్ళం. వ్యవసాయమే జీవనాధార మైన ఈ దేశానికి పల్లెలు, ఉమ్మడి కుటుంబాలే పట్టు కలిగి వుండేవి. అలాంటి ఉమ్మడి కుటుంబాలు చెల్లా చెదురైపోయాయి. పల్లెలు పట్టణాలకు వలసపోతున్నాయి. తద్వారా ఒకనాటి పల్లె వైభవం, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోయింది. ఇప్పుడు మంచి గాలి, నీరు, ఆహారం కష్టతరమయ్యాయి. ప్రతిదీ కల్తీ. మనిషి స్వార్థపరుడై సమస్త జీవరాశిని బతకనివ్వకుండా చేస్తున్నాడు.
 
ఇప్పటివరకు చెట్టు నుండి పండ్లను, కొమ్మల నుండి ఆక్సిజన్‌ను, భూమి నుండి పంటలను తీసుకున్న మనం- ఏ తల్లి జీవితాన్నిచ్చిందో ఆ తల్లిని నిర్లక్ష్యం చేశాము. ఏ దేవుడో, ఇంతకన్నా పవిత్రమైన ఏ స్వర్గమో ఉన్నదని భావించిన మనం మనకు జన్మనిచ్చి, అన్నం పెట్టి, ఆకలి తీర్చి, కోటానుకోట్ల సంవత్సరాలుగా జీవితాన్నిచ్చిన ఈ పుడమి తల్లిని ప్రార్థించలేకపోయాము. ఈ తల్లి నుంచి వచ్చా మనే సంగతి, ఈ తల్లి వల్లనే బతుకుతున్నామనే సంగతి- ఇప్పుడిప్పుడే మానవాళికి అర్థమవుతుంది. ప్రపంచమంతా పర్యావరణం వైపు ఆలోచిస్తుంది. ఈ పుస్తకం ఒక భౌతిక వాద సైన్సును బోధిస్తూ ప్రకృతి తత్వాన్ని సమాజానికి అందించి ప్రకృతి యెడల ప్రేమ కలిగేలా చేస్తుంది.
 
ఈ రోజుల్లో ఈ పుస్తకం అవసరాన్ని ఎలా చెప్తారు?
కాలం గతి తప్పుతున్నది. వర్షాకాలం ఎండలు, ఎండా కాలం వర్షాలు వస్తున్నాయి. ప్రపంచ గమనమంతా కొట్టు మిట్టాడుతున్నది. మంచు కరిగి భూభాగం తగ్గిపోతుంది. మన బిడ్డలైన రేపటి తరానికి మంచి సమాజాన్ని అందిం చాల్సిన మనం ఇవ్వలేకపోయాము. కాబట్టి రేపటి ఒక సుందరమైన లోకం కోసం, రేపటి తరానికి ఒక స్వచ్ఛమైన, ప్రకృతి అందాలతో కూడిన సమాజాన్ని నిర్మించటం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం ఈ పుస్తకాన్ని తీసుకొచ్చాను. ఈ పుస్తకంలోని ప్రతి కథా ఒక్కొక్క జీవరాశి చరిత్ర, దాని సుగుణాలు, అది సమాజాన్ని ప్రభావితం చేసే తీరు చెబుతుంది. తప్పక చదవండి, పర్యావరణ పరిరక్షణకై పాటుపడదాం రండి.
 
జయరాజు : 98661 60035
 
(జయరాజు ‘అవని’ పుస్తకావిష్కరణ 19-11-2019న సాయంత్రం 4 గంటలకు రవీంద్ర భారతిలో జరుగుతుంది.)