పేరు: పరుచూరి గోపాలకృష్ణ

ఒకటో కోణం:మాటల రచయిత
రెండో కోణం:రష్‌కింగ్‌
 
పరుచూరి గోపాలకృష్ణ .... రషెస్‌ చూసి సినిమా తలరాతను చెప్పేస్తారు. ఆయన జడ్జిమెంట్‌ గురితప్పలేదు. అందుకే టాలీవుడ్‌లో ఆయన్ని ‘రష్‌ కింగ్‌’ అంటారు. వాడివేడి మాటల రచయితగా గోపాలకృష్ణ మనకు పరిచయమే. నటుడిగా, తెలుగు అధ్యాపకుడిగానూ సుపరిచితులే. తెలియనిదల్లా ఈ కొత్తకోణమే. ఆయన సూచించిన మార్పులతో సిల్వర్‌జూబ్లీ దాకా దూసుకెళ్లిన చిత్రాలూ, ఆయన చెప్పిన చేర్పులతో బాక్సాఫీసుబాధల నుంచి బయటపడిన బొమ్మలూ అనేకం.ఆ జ్ఞాపకాలు పరుచూరి గోపాలకృష్ణ మాటల్లోనే...
 

పరిశ్రమకు వచ్చిన తొలిరోజుల నుంచే ఈ సినిమా ఆడుతుందా లేదా అని చెప్పడం అలవాటయింది. చాలాసార్లు మా అన్నయ్య కూడా ఆశ్చర్యపోయేవాడు. భలే జడ్జిమెంట్‌ ఇస్తున్నావని మెచ్చుకునేవాడు. ‘లారీ డ్రైవర్‌’ సినిమా అప్పుడు, రషెస్‌లో మార్పులు సూచిస్తుంటే, తన నోటి వెంట ‘రష్‌ కింగ్‌’ అనే మాట వెలువడింది. ‘వాడసలే రష్‌ కింగ్‌, తను ఏం మార్పులు చెబుతాడో అవి చేయండి, లేకపోతే సినిమా తేడా వచ్చేస్తుంది’ అన్నాడు. అదే నా బిరుదుగా పడిపోయింది. ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’తో మూడొందల యాభై అయిదు సినిమాల మైలురాయిని దాటాం. మేం సంభాషణలు రాసిన ప్రతి సినిమా రషెస్‌ చూడటమూ... చూసి బయటికి రాగానే, అది హిట్టో కాదో తేల్చేయడమూ మామూలైపోయింది. ఏదీ గురితప్పలేదు. ఒకటిరెండు తప్ప.

 

సాధారణంగా సినిమాను రెండు రకాలుగా చూస్తారు... ఒకటి ప్రేక్షకులు చూసే తీరు, రెండోది ఇండస్ర్టీవాళ్లు చూసే తీరు. పరిశ్రమ వాళ్లు సినిమా ప్రివ్యూను.. ప్రేమతో చూస్తారు, లేదంటే అసూయతో చూస్తారు. ప్రేక్షకులు మాత్రం ఈ రెండిటికీ అతీతంగా చూస్తారు. అందుకే వాళ్ల జడ్జిమెంట్‌ భిన్నంగా ఉంటుంది. అనూహ్యంగానూ ఉంటుంది. నేను రషెస్‌ చూస్తున్నప్పుడు సామాన్య ప్రేక్షకుడిలా మారిపోతాను. సెంటిమెంట్‌ సీన్లు వచ్చినప్పుడు కళ్లవెంట నీళ్లు వచ్చేస్తాయి. కామెడీ సీను చూసినప్పుడు కడుపుబ్బా నవ్వేస్తాను. ‘ఆయన రాసిన సినిమాని కూడా... అప్పుడే కొత్తగా చూస్తున్నట్టు ఎంతగా ఫీల్‌ అవుతున్నాడో’ అని మా పిల్లలు హాస్యం చేస్తుంటారు.