నగరంలో చదువుకున్న మీరు తెలంగాణ గ్రామీణ మాండలీకం మీద పట్టు ఎలా సంపాదించారు?

చదువంతా హైదరాబాద్‌లోనే. కానీ పుట్టింది ఊళ్ళోనే కదా! మా స్వస్థలం రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మం. ఘట్‌పల్లి గ్రామం. మా తాత ముత్తాతల నుండి వ్యవసాయం వృత్తిగా బతికిన వాళ్ళం. మారిన కాల మాన పరిస్థితులలో, మేమందరం పగిలిన కుమ్మరి కుండ పెంకుల్లా చెట్టుకొకరం, పుట్టకొకరంగా దేశ మంతా వెదజల్లబడ్డాం.పేడ పురుగుకి సువాసనలద్దలేం కదా. భూమిలోకి బలంగా దిగిన వేళ్ళని అంత సులభంగా పెకిలించ లేము. అక్కడి గ్రామాల తోని, అక్కడి మనుషుల తోని పెంచుకున్న అనుబంధం వలన కావచ్చు... అలాగే మనకు తెలీకుండానే, మన ప్రమేయం లేకుండానే జరిగే నిరంతర పరిశీలన వల్ల కూడా కావచ్చు.

మీ కథలతో ‘నూనె సుక్క, ఇంకిన్ని కథలు’ సంపుటి ఇటీవల విడుదలైంది. మీ కథా రచనకు ప్రేరణ ఏమిటి?

రాయడం ఇష్టం. చదవడం అంతకన్నా ఇష్టం. సమాజం నుంచి ఏదైతే కోరుకుంటానో అది అందరికీ చెందాలని ఆశిస్తాను. దాన్ని కథ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాను.బుర్రలో నిరంతరం కదిలే ఆలోచనల విస్ఫోటనాలే కథలుగా బయటికి ‘లావా’ లాగా తన్నుకొని బయట పడుతుంటాయి. రాయకుండా ఉండలేని పరిస్థితి కలిగినప్పుడే కథగా బయటపడుతుంది. ఎందుకు రాస్తానంటే అగ్ని పర్వతాన్ని చల్లార్చాలి కదా? నా బుర్రను చల్లబర్చుకోడానికి రాస్తాను. కానీ, రాసిం దానికి ప్రయోజనం ఉండాలి.

ఈ సంపుటిలో సైన్స్‌ఫిక్షన్‌ కథ కూడా ఉంది. ప్రేరణ?

ప్రస్తుత సమాజంలో ఉన్న భావ నిర్లిప్తత, ప్రతీదీ మనకెందుకులే అనే ధోరణి వలన మనమేం కోల్పోతు న్నామో మనకు తెలీటం లేదు. మనం మన పిల్లల కోసం, వారి ఉజ్వల భవిష్యత్తుకోసం కష్ట పడుతుంటాం. రా బోయే కాలాల్లో మనం అనుభవించిన, అను భూతించిన ప్రకృతిని, దాని నుండి లభిం చిన ప్రేరణ, ఉత్తేజాల్ని మన భావి తరాలు కూడా అనుభవించా లన్న ఆలోచనలలోంచి పుట్టిన కథ ‘3456 GB’. నిజానికి మన భూమిని మనకు కావాల్సిన విధంగా మలుచుకోవడానికి కేవలం ఒక్క తరం తమ కొద్ది సమయాన్ని అందు కోసం కేటాయిస్తే జరిగే అద్భుతాలు ఎవ్వరూ ఊహించ లేరు. అందుకు ఎవరో ఒకరు పూనుకోవాలి. నా వంతు ప్రయత్నంగా ఈ కథ. విలువలైనా, ప్రకృతి అయినా మనం కాపాడుకుంటేనే మనకు ఎల్లకాలం తోడ్పాటు అందిస్తాయని నమ్మకం.

సంపుటిలో మీకు బాగా ఇష్టమైన కథ?

అన్ని కథలూ ఇష్టపడే రాస్తాను. ‘ఒంటరి ఏకాంతం’ కథ కొంచం ఎక్కువిష్టం. అనాదిగా మహిళలమీద, చిన్నారి అమ్మాయిలమీద జరిగిన, ఇంకా జరుగుతున్న అకృత్యాలను చూసీ చూసీ, చదివీ చదివీ, వినీ వినీ పొరబాటుగా అలవాటుపడి పోతున్నానా అన్న ఆలోచన నన్ను ఉలిక్కిపడేలా చేసింది. నిర్లిప్తుడినైపోతున్నానా, స్పందన లేకుండాపోతుందా, స్తబ్ధుడినైపోతున్నానా అన్న భావన నన్ను నిలవనీయలేదు. ప్రతిరోజూ వింటూన్న, కంటూన్న సంఘటలను కనీ వినీ ఆ బాధలను గుండె లోపల దాచుకోలేకా, కోపాన్ని అణచుకోలేకా, నా చేతగాని తనానికి సిగ్గుపడుతూ నన్ను నేను నిందించుకున్న సందర్భాలు కోకొల్లలు. వారి కోసం నా వంతుగా ఈ కథ.

కొట్టం రామకృష్ణారెడ్డి

పలకరింపు

92465 65824

బుర్రలో నిరంతరం కదిలే ఆలోచనల విస్ఫోటనాలే కథలుగా బయటికి ‘లావా’ లాగా తన్నుకొని బయటపడుతుంటాయి. రాయకుండా ఉండలేని పరిస్థితి కలిగినప్పుడే కథగా బయటపడుతుంది. ఎందుకు రాస్తానంటే అగ్ని పర్వతాన్ని చల్లార్చాలి కదా?