కన్నడ, తెలుగు అనువాదరంగంలో పరిచితమైన పేరు శర్వాణి. అర్ధశతాబ్దం కిందట రెండు మూడు తరాల పాఠకులకి కన్నడసాహిత్యంతో ప్రాథమిక పరిచయమైనా కలగడానికి ఆమె చేసిన అనువాద నవ లలు, కథలు సాయపడ్డాయి. శర్వాణి అసలుపేరు మణి గానహళ్ళి (నీలారంభం) శారద. ఏ తరగతి గదిలోనూ చదువుకోని కన్నడిగురాలైన శారద రెండుభాషల్లో ప్రవీణురా లైన శర్వాణిగా మారడానికి చేసిన ప్రయాణం ఆసక్తికరం. శర్వాణి గురించి ఆమె కుమార్తె కల్యాణి నీలారంభం తన అనుభవాలను విశాఖపట్నంలోని ‘పుస్తకాల పురుగులు’ గ్రూప్‌తో పంచుకున్నారు. ‘మాధవి’ వంటి కన్నడ అను వాద నవలల ద్వారా కల్యాణి నీలారంభం సుపరిచితులే.

 

 

మీ అమ్మగారు శర్వాణి జీవిత నేపథ్యం చెప్పండి?

శారద నుండి శర్వాణి గమనం, పుస్తకాల ద్వారానే సాధ్య మయిందనుకుంటా. మహానంది దగ్గరలోని నందవరం అనే చిన్నవూళ్ళో కాశీనుంచి వచ్చిన కొందరు, బ్రాహ్మణ కుటుంబా లుగా స్థిరపడ్డారు. వారే నందవరీకులనే ఉపశాఖీయుల య్యారు. వీరు ఏ రాష్ట్రంలో ఉన్నా ఇంట్లో తెలుగే మాట్లాడే వారు. కోలార్లో ప్రైమరీ స్కూల్‌ టీచర్‌ మా తాతగారు. ఆరు గురు ఆడపిల్లలు ఒక్క మగపిల్లవాడు. కోలార్‌లో ఓ మట్టి గోడల ఇల్లు తప్ప మరేం ఆస్తిలేని మా తాతగారు పిల్లల్ని ప్రేమగా పెంచుకున్నారు. చిత్తూరునుండి వచ్చి బెంగళూర్లో బ్యాంకు ఉద్యోగం చేస్తున్న నీలారంభం రామయ్యకు, మణి గానహళ్ళి శారదకు పెళ్ళయింది. అమ్మ బెంగళూర్లో కన్నడ సాహిత్యం విరివిగా చదివేది. అమ్మకి తెలుగు అలవాటు చేసే ప్రయత్నంలో నాన్న ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక తెప్పించే వారు. 1956లో నాన్నకు రాజమండ్రి బదిలీ అయి తెలుగు రాష్ట్రానికి వచ్చాక తెలుగు పుస్తకాలు, ఏది దొరికితే అది చదివేది. క్రమంగా మంచి పుస్తకాలు ఎంచుకోవడం వచ్చింది. ఓ సంవత్సరం నాన్నకు బోనస్‌గా 500రూపాయలు వచ్చా యి. ఆ డబ్బులతో బంగారు మంగళసూత్రం గొలుసా, రేడి యోనా అని ఆప్షన్‌ అమ్మకిస్తే రేడియోకి ఓటు వేశారు. మా వొంటి మీద చిన్నమెత్తు బంగారం ఉండేది కాదు గాని రెండు బీరువాల నిండా పుస్తకాలు ఉండేవి. దాని మూలం గానే పుస్తకాలు చదవడం సహజమైన అలవాటుగా ఉండేది.

మీ ఇద్దరి అనువాద ప్రస్థానం ఎలా మొదలైంది?

విజయవాడలో ఉండగానే, మా రెండోతమ్ముడు మెనింజై టిస్‌తో చనిపోయాడు. ఆ దుఃఖంలోంచి బయటపడడానికి అమ్మ ఏదైనా వ్యాపకాన్ని వెతుక్కునే ప్రయత్నంలో అనువా దాలు మొదలుపెట్టింది. ఆంధ్రపత్రికకు త్రివేణి కథ ‘ఆకర్షణ’ ఆమె అనుమతి తీసుకుని పంపాము. అది పత్రికలో రావ డంతో ఉత్సాహం వచ్చి అప్పుడు పత్రిక ఎడిటర్‌ శివలెంక రాధాకృష్ణకి అనువాద నవల వేసుకుంటారా అని లెటర్‌ రాశాము. ఆయన పరిశీలనకు పంపండి అనగానే ‘వెండి మబ్బు’ నవల చేసి పంపాము. అప్పటినుంచి అమ్మ అను వదించిన అన్నినవలలూ సీరియల్స్‌గా ఆంధ్రపత్రికలో వచ్చి నవే. 1960లో నాన్నకి బదిలీ అయి అనకాపల్లి వచ్చాము. అక్కడ శారదా గ్రంథాలయం, దాని మేడమీద రెగ్యులర్‌గా నడిచే సాహితీ సమావేశాలు మా పరిధిని పెంచుకోవడానికి దోహదం చేశాయి. మునిమాణిక్యం నుండి రావిశాస్త్రి, రంగ నాయకమ్మ--ఎంతమందిని విన్నామో! రావిశాస్త్రి, మహీధర రామ్మోహనరావు, వారి కుటుంబాలతో సహా జీవితకాలం స్నేహితులు అయ్యారు. 1967లో గుడివాడలో జరిగిన తెలుగు రచయిత్రుల మహాసభకు హాజరైనవారిలో అమ్మకూడా ఉన్నారు. తెన్నేటి హేమలత, బీనాదేవి, నిడదవోలు మాలతి వంటి రచ యిత్రులను ఒకేచోట చూడడం బాగానచ్చి చాలాసార్లు తల్చు కునేవారు. అప్పుడే కె. రామలక్ష్మి అందరి వివరాలు తీసుకుని రచయిత్రుల ‘who is who’ని ‘ఆంధ్ర రచయిత్రులు’ పేరిట తీసుకొచ్చారు. అందులో అమ్మ గురించి సమాచారం ఉంది.