మహిళాభ్యుదయాన్ని కోరుకునే రచయిత్రి ప్రొఫెసర్‌ అయ్యగారి సీతారత్నం..పుట్టినింటా, మెట్టినింటా కూడా సాహిత్య పరిమళాల మధ్యే జీవిస్తూ ప్రాచీన, ఆధునిక సాహిత్యాలను సమగ్రంగా అధ్యయనం చేసిన కథానవలా రచయిత్రి. స్రీల జీవన విధానాన్నే తన రచనల్లో చిత్రీకరించారామె..భాషాసాహిత్యాల ద్వారానే మానసిక చైతన్యం సులభం అవుతుంది అంటున్న సీతారత్నం ఇంటర్వ్యూ..

శ్రీకాకుళం జిల్లా రాజాం సమీపం పెంటలింగాపురం సీతారత్నం సొంతూరు.ఆమె తండ్రి అయ్యగారి నారాయణరావు, రచయిత, దేవాదాయశాఖ కార్యనిర్వహణాధికారిగా పనిచేశారు. తల్లి హైమావతి.ఇచ్ఛాపురం సమీపం మఠం పరియాపల్లిలో 1965ఆగస్టు ఒకటిన ఆఖరి సంతానంగా పుట్టారు సీతారత్నం. ఆమెకు ముగ్గురు అన్నయ్యలు, ముగ్గురు అక్కయ్యలు. ఆమె అన్నయ్యలు రమేష్‌ సాహిత్య విమర్శకుడు, ఆనంద్‌ కథానవలా రచయిత, సోమశేఖర్‌ ప్రధానమంత్రి అవార్డు పొందిన సైంటిస్టు, రచయిత. ఆమె అక్కయ్య కూతురు సువర్ణలక్ష్మి కూడా రచయిత్రే.బాల్యంనుచీ సీతారత్నం తన అమ్మమ్మ మారెళ్ళ కాంతమ్మగారి ప్రభావంలో పెరిగారు.ఆవిడ పుస్తకపిపాసి. స్ర్తీ విద్యను, స్ర్తీ సమానత్వాన్ని కోరుకునేవారామె. ఆవిడస్ఫూర్తితో ప్రాచీనసాహిత్యం సహా డిటెక్టివ్‌ నవలలు, వారపత్రికలన్నీ చదువుతూ కథమీద వల్లమాలిన అభిమానం పెంచుకున్నారు సీతారత్నం.

గురజాడ, రావిశాస్త్రి, తిలక్‌ ఆమె ఇష్టరచయితలయ్యారు.స్ర్తీవాదమే ఆలోచనా విధానంహైస్కూలు నుంచే కవిత్వం రాసేవారు సీతారత్నం. ఆమె కవితలు, వ్యాసాలు కాలేజీ మ్యాగజైన్‌లో వచ్చేవి. ‘‘మొదట్నించీ ఆమె ఆలోచనావిధానం స్ర్తీ సమానత్వం గురించే. అందువల్ల ఆ తరహా కవితలే ఎక్కువగా రాసేవారు సీతారత్నం. ఆమె పిహెచ్‌డి సిద్ధాంత గ్రంథం కూడా స్ర్తీవాదంమీదే.పెళ్ళయ్యాక భర్త ప్రోత్సాహంతో ఆంధ్రాయూనివర్సిటీలో ఎం.ఏ పిహెచ్‌డి చేసి, ఎన్‌.ఇ.టి పరీక్షలో కూడా ఉత్తీర్ణులయ్యారు సీతారత్నం. ‘స్ర్తీవాద కథలు, స్ర్తీ జీవిత చిత్రణ’ పై ఆచార్య అత్తలూరి నరసింహారావు పర్యవేక్షణలో సిద్ధాంతగ్రంథం సమర్పించి పిహెచ్‌డి పట్టా పొందారు.విశాఖపట్నంలో తను చదివిన ఎ.వి.ఎన్‌. కళాశాలోనే 1989లో తెలుగుశాఖ అధ్యాపకురాలుగా చేరారు సీతారత్నం. ముప్ఫైఏళ్ళుగా ఇదేవృత్తిలో ఉంటూ వేలాదిమంది విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు.

పదేళ్ళుగా తెలుగుశాఖాధిపతి కొనసాగుతున్నారు.కథలు, నవలలుసీతారత్నం తొలి నవల ‘స్కాలర్‌’ (1996). విశ్వవిద్యాలయంలో పరిశోధకులకూ, గైడ్స్‌కీ మధ్య అనుబంధాలు, రకరకాల ప్రభావలపై రాసిన నవల. మరో నవల ‘ఎంసెట్‌’ (2013). విద్యావిధానంలోని నెగిటివ్‌ షేడ్స్‌, వ్యవసాయానికి లేని ప్రాధాన్యం ఎంసెట్‌కే ఉండటం, పిల్లలపై ఒత్తిడి లాంటి అనేక అంశాలను ‘ఎంసెట్‌’ నవలలో కళ్ళకు కట్టారు సీతారత్నం. మరో నవల ‘సాఫ్ట్‌ లైఫ్స్‌’ త్వరలో రాబోతోంది.ఆమె తొలి కథ ‘మదుపు’ ఆంధ్రజ్యోతిలో వెలువడింది. పలు పత్రికల్లో ఆమె కథలు వచ్చాయి. ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) విధానంవల్ల భూమి కోల్పోయిన మహిళకథ ‘కూరాకుల మడి’ స్ర్తీవాద పత్రిక కథలపోటీల్లో దీనికి ప్రథమ బహుమతి లభించింది. అబ్బూరి ఛాయాదేవి ప్రశంసలందుకున్న కథ ఇది. ఆమె తొలి కథాసంపుటి ‘కూరాకుల మడి’ని ఓల్గాకు అంకితమిచ్చారు.

మైక్రోఫైన్సాన్‌పై రాసిన కథ ‘శతమానాలు’. భవన నిర్మాణంలో మహిళాకూలీలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులను తెలియజెప్పే ‘ముఠా సిన్నమ్మ’ కథకు ‘అస్మిత’ సంస్థ నగదు బహుమతి లభించింది.నవ్య వీక్లీలో వచ్చిన ‘లాస్ట్‌ మెయిల్‌’, ‘ఖాళీ ఇల్లు లేదు’ కథలకు పాఠకులనుంచి ఎంతో స్పందన లభించింది. ఒంటరితనం అనుభవించే వృద్ధులు ఆలోచనావిస్తృతితో గురజాడ చెప్పిన ‘కమ్యూనిటీ పొయ్యి’ కాన్పెస్ట్‌ ను అమలు చేస్తే తమ ఒంటరితనాన్ని పోగొట్టుకుని జీవితాన్ని చైతన్యవంతంగా గడపవచ్చుననే అంశాన్ని చెప్పే కథ ఖాళీ ఇల్లు లేదు’.