సాహిత్య పిపాసగల ఉన్నతాధికారులు  చాలా అరుదు. అలాంటివారిలో  ఒకరు ఆకెళ్ళ రవిప్రకాశ్‌. తనదైన ప్రత్యేకమైన బాణీలో అలతి అలతి పదాలలో ఉన్నత భావాల్ని పరిమళింపజేసే  కవి ఆయన. కవిత్వం నా ఆత్మ, సాహిత్యం నా అంతర్వాహిని , కవులూ, రచయితలే నవ సమాజానికి నిజమైన మార్గదర్శకులు  అంటున్న రవిప్రకాశ్‌ ఇంటర్వ్యూ .. 

మాది మధ్యతరగతి సంప్రదాయక కుటుంబం. మా నాన్నగారు ఆకెళ్ళ సూర్యజనార్దనరావు. అమ్మ మాణిక్యాంబ. ఆరుగురు ఆక్కయ్యలకు ఏకైక తమ్ముణ్ణి. 1968 జులై 25న విజయవాడలో పుట్టాను. నాన్నగారు నీటిపారుదల శాఖలో ఇంజనీరు. నా విద్యాభ్యాసమంతా కృష్ణా, గోదావరి జిల్లాల్లోని పల్లెల్లోనే సాగింది. కాకినాడ జె.ఎన్‌.టి.యులో బిటెక్‌, బిట్స్‌ పిలానీలో ఎం.ఇ. సివిల్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ పొందాను. 

కవిత్వానికి నాంది
నా కవిత్వ మూలాలు నా బాల్యంలోనే ఉన్నాయి. పచ్చని వరిచేలు, కాలువలు, నదులు, పడవ ప్రయాణాలు, ఇసుక తీరాలు, లంకలు...వాటితో పెనవేసుకున్న నా అనుభవాలన్నీ నా కవిత్వ ప్రతీకలే, నా తకవితావస్తువులే. ఆయా ప్రాంతాల్లోని భాష, యాసే నా కవిత్వ భాష. అంతేకాదు, నా ఆరుగురు అక్కయ్యలూ చదువుల సరస్వతులే. వారందరూ రాసే కథలు, కవితలు ప్రముఖ దిన, వార, మాస పత్రికల్లో అచ్చయ్యేవి. వారు చదివే సాహిత్యం, సాహితీ మిత్రులు సభల్లో వారికి కానుకలుగా ఇచ్చిన గ్రంథాలు మా ఇంట్లో విరివిగా ఉండేవి. దాంతో తిలక్‌ ‘అమృతం కురిసిన రాత్రి’, దాశరథి ‘గాలిబ్‌ గీతాలు’, రవీంద్రుని ‘గీతాంజలి’ సహా గొప్ప రచనలు చిన్నప్పుడే చదివాను. అప్పుడే కవిత్వంపట్ల ఆకర్షితుడనయ్యాను.

మిత్రలాభం

కాకినాడలో మెడికో రవూఫ్‌ పరిచయంతో నేను పూర్తిస్థాయి కవిగా మారిపోయాను. కవిగా ఇస్మాయిల్‌ నాకు మెరుగులు దిద్ది, నాకు గురువయ్యారు. శిఖామణి, విన్నకోట రవీందర్‌, వాడ్రేవు చినవీరభద్రుడు, అఫ్సర్‌, ప్రసేన్‌, గుడిపాటి సీతారామ్‌, యాకూబ్‌ తదితర కవిమిత్రులు నాలో కవితోత్సాహం నింపారు. నాలో ఆత్మవిశ్వాసం కలిగించారు. నగ్నముని, అజంతా, శివారెడ్డి, వేగుంట మోహనప్రసాద్‌ వంటిసీనియర్లు కవిగా నన్ను ఆశీర్వదించారు. 

తొలినాళ్ళలో నా కవిత్వం మీద తిలక్‌, ఇస్మాయిల్‌ ప్రభావం ఉండేది. శివారెడ్డి కవితల్లోని తేలిక పదాలమీదా, శిఖామణి ప్రతీకలమీద మోజు ఉండేది. సచ్చిదానందన్‌, పాబ్లో నెరుడ, డెరిక్‌వాల్కట్‌ తదితర కవుల ప్రవాహంలో కొట్టుకుపోయి కొత్త తీరాల్లో తేలేవాణ్ణి. కేశవరెడ్డి, మునిపల్లె రాజు, త్రిపురవంటివారి వచనం చదివి అంతకంటే గొప్ప మాటలతో అక్షరాలు పొదిగి కవిత్వం రాయాలనే ఆకాంక్ష నాలో కలిగింది. 

గురుదీక్ష
పిన్నవయసులోనే ఆత్మసాక్షాత్కారం పొందిన బెంగాలీ సాధువు, నాకు ధ్యానదీక్ష ఇచ్చిన నా ఆధ్యాత్మిక గురువు రాబిన్‌ మహరాజ్‌. ‘‘ప్రేమ రాహిత్యమే ప్రపంచంలోని అన్ని సమస్యలకూ మూలం, ప్రేమను పంచి ఇవ్వడంవల్ల లోకంలో ఎంతమార్పు తీసుకురావచ్చునో స్వామి వివేకానంద, అవతార్‌ మెహర్‌బాబా, మదర్‌ థెరిస్సా జీవితాలు నిరూపించాయి’ అని చెప్పేవారు ఆయన. నా కవిత్వానికి సైద్ధాంతిక, తాత్విక భూమిక ఇదే. 

మార్పు

సివిల్స్‌ పరీక్ష పాసై 1994లో పాండిచ్చేరిలో ఉద్యోగంలో చేరాక నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. సమాజస్థితిగతులు, వ్యవస్థాగత లోపాలు తెలుసుకున్నాను. యువకుడిగా నా ఆదర్శాలను ఎలా ఆచరణలో పెట్టాలనే స్పష్టత వచ్చింది. నా ఆలోచనల్లో బలాలు, వ్యక్తీకరించడంలోని బలహీనతలు గ్రహించడంవల్ల నా కవిత్వంలో కూడా మార్పు వచ్చింది. 

కవితాయాత్ర

విశాఖపట్నం గిరిజన సహకార సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గా 2014లో డెప్యుటేషన్‌మీద వచ్చి పదవీ బాధ్యతలు స్వీకరించాను. అప్పటి నా పై అధికారి అంగలకుర్తి విద్యాసాగర్‌ (ఐ.ఎ.ఎస్‌) గారు ప్రముఖ కవి. ఆయన నా చేత పట్టుపట్టి కవిత్వం రాయించి ప్రచురితమైన ప్రతి కవితకూ అభినందనలు తెలియజేసేవారు. ఉద్యోగరీత్యా నేను చూసిన ప్రకృతి సహజసిద్ధమైన అటవీ అందాలు, ఏజన్సీ ప్రాంత ప్రజల అమాయకత్వం నా కవిత్వంలో ప్రవేశించింది. అక్కడివారంతా నన్ను తమ కుటుంబసభ్యునిగా భావించి ప్రేమించేవారు. 

అచ్చొత్తినవి

నా తొలి కవిత 1986లో వచ్చింది. ఇప్పటివరకు నావి నాలుగు కవితా సంపుటాలు వెలువడ్డాయి. ‘ఓ కొత్త మొహంజోదారో’ (1993), ‘ఇసక గుడి’ (2000), ‘ప్రేమ ప్రతిపాదన’ (2010), ‘భూమి పుట్టినరోజు’(2018) సహా అనేక కవితా విమర్శనావ్యాసాలు ముద్రితమయ్యాయి. కథలు చదువుతాను. కానీ ఒకటి రెండు కథలకంటే ఎక్కువ రాయలేకపోయాను. కానీ రాసిన ఆ రెండు కథలూ 1991, 2014 ల్లో ఆంధ్రజ్యోతి నవ్య వీక్లీ దీపావళి ప్రత్యేక సంచికల్లో చోటు చేసుకోవడం ఆనందంగా ఉంది. ‘భూమి పుట్టినరోజు’ కవితా సంపుటిని రామతీర్థగారు ‘హ్యాపీ ఎర్త్‌ డే’ పేరిట ఆంగ్లంలోకి అనువదించారు. పదిమంది కవులను ఎంపికచేసి ఢిల్లీ సాహిత్య అకడెమీవారు వెలువరించిన ప్రత్యేక కవితాసంచికలో నేను రాసిన ఆరు కవితలు ఉండటం విశేషం. 

మా విశాఖ

విశాఖపట్నంలో కవులు, పండితులు మెండుగా ఉన్నారు. కవిమిత్రులు రామతీర్థ, లీడర్‌ రమణమూర్తి, ఎల్‌.ఆర్‌.స్వామి, అడపా రామకృష్ణ ప్రతి సాహిత్యసభకీ నన్ను ముఖ్యఅతిథిగానో, ముఖ్యవక్తగానో పిలిచి గౌరవిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి గంటేడ గౌరునాయుడు, అట్టాడ అప్పల్నాయుడు తరచు నన్ను కలిసి సాహితీచర్చలు చేస్తారు. విశాఖేతరులైన కె.శ్రీనివాస్‌, ఎ.ఎన్‌.జగన్నాథశర్మ, దాట్ల దేవదానంరాజు, బి.వి.వి. ప్రసాద్‌, ముకుంద రామారావు, బి.ప్రసాదమూర్తి, బొల్లోజు బాబా, చింతా కొండలరావు తదితరుల ప్రోత్సాహం అమూల్యం, అమోఘం.

కలమే బలమైనది 

సాహిత్యం నా జీవితంలో అంతర్వాహిని. కవిత్వం నా ఆత్మ. అది లేకుండా నేను లేను. పని ఒత్తిడిలో నేను అలసిపోయి రాయలేనితనంలోకి వెళ్ళిన ప్రతిసారీ మరింత ఉధృతంగా కవిత్వం నన్ను వరిస్తుంది. కత్తికంటే కలం గొప్పదనీ, ఆసలు సిసలైన సమాజ శాసనకర్తలు కవులేనని నా అభిప్రాయం. గన్నుతో పనిలేకుండా పెన్ను ఎక్కుబెట్టినవారి విప్లవాత్మకమైన రచనలు సంఘసంస్కరణకు తోడ్పడ్డాయని చరిత్ర చెబుతోంది. కవులపూనికతో మనకు స్వాతంత్ర్యం సుసాధ్యమైంది. కవుల ఆదర్శాలు కొన్ని చట్టాలుగా కూడా రూపుదిద్దుకున్నాయి. ప్రపంచం కుగ్రామమైపోతున్న ఈ తరుణంలో కవులూ, రచయితలే నవ సమాజానికి నిజమైన మార్గదర్శకులు.

మన భాషను పల్లకిలో మోయాలి

తమిళ, కన్నడ, మలయాళీయులకు మాతృభాషాభిమానం ఎక్కువ. మాతృభాషలోనే మాట్లాడుకుంటారు. ‘కవులు, రచయితలకు ఆ రాష్ర్టాలలో ఉన్న గౌరవమర్యాదలు మన తెలుగు రాష్ర్టాలలో లేవు అనిపిస్తుంది. తమిళనాట రాజకీయ నాయకులకంటే కవిప్రముఖుల విగ్రహాలే ఎక్కువ. పిల్లలకు, వీధులకు, కొన్ని ఊళ్ళకు కవులపేర్లే పెడతారు. కనీసం సినిమాహాళ్ళకు కూడా పరభాషాపేర్లు పెట్టరు. పరభాషా రాష్ర్టాలలో పనిచేసిన అనుభవంతో ఈ విషయాలు తెలుసుకున్నాను. మన మాతృభాషమీద మనకు ఎంత చిన్నచూపు ఉందో మనం గ్రహించాలి. పరభాషను ప్రేమించాలిగానీ మన భాషను మాత్రం పల్లకిలో భుజానపెట్టుకుని పల్లకిలో మోయాలి. 

ఉద్యోగ విజయాలు

నా చదువు పూర్తయ్యాక, విజయవాడలోని కృష్ణవేణి పాలిటెక్నిక్‌ కాలేజీలో ఒక ఏడాది లెక్చరర్‌గా పనిచేశాను. 1993లో సివిల్స్‌ పరీక్ష పాసై, పాండిచ్చేరి సర్వీస్‌లో చేరాను. అప్పటినుంచీ మున్సిపల్‌ కమీషనర్‌గా, మత్స్యశాఖ డైరెక్టర్‌గా, హౌసింగ్‌ బోర్డ్‌ సెక్రటరీగా, పౌర సరఫరాలశాఖ డైరెక్టర్‌గా సహకారశాఖ రిజిస్ర్టార్‌గా పాండిచ్చేరిలో సేవలు అందించాను. యానాం రీజినల్‌ అడ్మినిస్ట్రేటర్‌/సబ్‌–కలెక్టర్‌గా, ఉన్నత సాంకేతిక విద్య డైరెక్టర్‌గా, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్‌గా జోడుపదవులు నిర్వహించాను. 
విశాఖపట్నంలో గిరిజన సహకార సంస్థ (జి.సి.సి) వైస్‌ ఛైర్మన్‌–ఎం.డి. (2014–18)గా చేశాను. తర్వాత మే నెల నుంచి గిరిజన సాంస్కృతిక శాఖ పరిశోధన–శిక్షణ సంస్థ మిషన్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాను.

కృషి, ఫలితం 

అరకులోయ కాఫీది ఎంతో ఘనచరిత్ర. విశాఖ మన్యంలో 1100 మీటర్ల ఎత్తులో లక్షకుపైగా ఎకరాల్లో పండుతున్న కాఫీ పంట అనేక గిరిజన కుటుంబాలకు జీవనాధారం. నా ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా ఆ కాఫీ ఉత్పత్తులకు మంచి బ్రాండ్‌ ఇమేజ్‌ తెచ్చి ముఖ్యమంత్రి ప్రశంసలందుకున్నాను. నాణ్యతలో ‘అరకు కాఫీ’ ని వరల్డ్‌ కమర్షియల్‌ బ్రాండ్‌గా నిలబెట్టాను. ఇప్పుడు ఈ గిరిజన ఉత్పత్తులో 90శాతం పైగా స్వీడన్‌, ఇటలీ, ఎమిరేట్స్‌, స్విట్జర్లాండ్‌ దేశాలకు ఎగుమతి కావడం నాకు గర్వకారణం.
‘భవిష్యత్‌లో ఆవకాయ తినని ఆంధ్రుడు ఉంటాడేమోగానీ, అరకు కాఫీ తాగనివారు ఉండరు’ అని ఒక ప్రవాసభారతీయుడు నాకు మెయిల్‌ చేయడం ఎన్నటికీ మరువలేను. అదేవిధంగా గిరిజన ఉత్పత్తుల్లో ‘నన్నారి’ ని కూడా వేసవి పానీయంగా వినియోగదార్లకు అందించాను. దీనిని 27 విదేశీ నగరాల్లో పర్యాటకులకు ప్రమోషన్‌ నిమిత్తం అందజేస్తున్నాం. బి.సి.సి. అభివృద్ధికి నేను చేస్తున్న కృషికి గుర్తింపుగా నా డెప్యుటేషన్‌ కాలపరిమితిని పెంచడం పనిమంతుడికి పట్టాభిషేకంగా భావిస్తాను. 

తీపి–చేదు జ్ఞాపకాలు 

తెలుగులో నా మార్కుల్ని మా స్కూలు తెలుగు మాస్టారు మిగతావిద్యార్థులకు చూపించి నన్ను తన గుండెలకు హత్తుకున్న ఘటన నా హృదయంపై చెరగనిముద్ర వేసింది. ఇంజనీరింగ్‌ విద్యార్థుల్లో సాహిత్యస్పృహ తక్కువ. కానీ నేను కాకినాడలో ఇంజనీరింగ్‌ చదువుతూ కవుల కోసం ఒక క్లబ్‌ ప్రారంభించి అత్యంత వైభవంగా నడిపించడం ఒక మధురానుభూతి. 
రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 150వ జయంత్యోత్సవాలకు జరిగిన కలకత్తా కవిసమ్మేళనంలో 25 భాషల నుంచి పాల్గొన్న 150 మంది యువకవుల్లో తెలుగు భాష ప్రతినిధిగా నేను పాల్గొనడం, ఆనాటి సాహిత్య అకాడెమీ ఛైర్మన్‌ సునీల్‌ గంగోపాధ్యాయ నా కవితను మెచ్చుకోవడం, ఒక సభలో చేరా మాస్టారు ‘‘నీకు గొప్ప బంగారు భవిష్యత్తు ఉంది’’ అని  దీవించడం మరచిపోలేని ఘటనలు.
వృత్తిధర్మంలో భాగంగా అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమీషనర్‌ హోదాలో పేదవారి గుడిసెల్ని తొలగించాల్సి రావడం ఒక చేదు జ్ఞాపకం. పేదల పక్షపాతిగా, కవిగా, నాకు ఇష్టంలేని ఆ పనిని నా పై అధికారి కాఠిన్యంవల్ల చేయాల్సి వచ్చింది. 

కుటుంబం

నా ధర్మపత్ని పేరు డాక్టర్‌ రత్నపావని. 1995 డిసెంబరు 2వ తేదీన మా వివాహం జరిగింది. ఆమె అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. మాకు ఒక అబ్బాయి. పేరు శివజనార్దన ప్రణవ్‌. ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. 
మానవ సేవే మాధవ సేవగా భావిస్తాను. అదే ఆచరిస్తాను. బెంగాల్‌లో ఉన్న మా ఆధ్యాత్మిక గురువు ఆశ్రమంలోని వెయ్యిమంది పోషణకోసం ఏటా నా రెండు నెలల వేతనాన్ని ఆ ఆశ్రమానికే ఇస్తున్నాను.