పదహారణాల అచ్చతెలుగు వాడు,, దళితసాహిత్య ఆరంభకుడు , దళిత రచయితల్లో మొదటివాడు పద్మశ్రీ కొలకలూరి ఇనాక్‌.ఆధునిక సాహిత్యంలో తనప్రత్యేకత చాటుకున్న షోడశ కళాప్రపూర్ణుడు .సమాజ అసమానతలపై కలం పోరాటం చేస్తున్న యోధుడు. ఉప కులపతిగా ఆయన తీసుకున్న తిరుగులేని నిర్ణయాలను ఇప్పుడు అన్ని విశ్వవిద్యాలయాలు అనుసరిస్తున్నాయి .ఆయన రాసిన ‘విమర్శిని’ పుస్తకం ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (2018) పొందిన సందర్భంగా ఆయన ఇంటర్వ్యూ ...

గుంటూరుజిల్లా వేజెండ్లలో 1939 జూలై 1వ తేదీన పుట్టాను. నాన్న రామయ్య. అమ్మ విశ్రాంతమ్మ. మేం ముగ్గురు సంతానం. నాకు ఒక చెల్లెలు, తమ్ముడు.1959లో బి.ఏ ఆనర్స్‌ పాసయ్యాను. నేను చదుకున్న గుంటూరు ఎ.సి.కాలేజీలోనే 1959లో అధ్యాపకుడిగా చేరాను. చిత్తూరు, కాకినాడల్లోనూ, అనంతపురం ప్రభుత్వ కళాశాలలో పదేళ్ళు (1962–1972) పనిచేశాను. తర్వాత వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించి, ‘తెలుగు వ్యాస పరిణామం’ పై పిహెచ్‌డి చేశాను. అక్కడే ఉపకులపతిగా (1998–2001) పదవీ విరమణ చేశాను. అలా 42 ఏళ్ళు ఉపాధ్యాయుడుగా విద్యార్థులను తీర్చిదిద్దాను.నలభైఏళ్ళనాటి విశ్వవిద్యాలయం సిలబస్‌లో మార్పులు తెచ్చి, కొత్త సమాచారం, కొత్త పరిశోధనలు సిలబస్‌లో చేర్చి నాదైన ముద్ర వేశాను. నేను చదువుకునే రోజుల్లో ఆధునిక సాహిత్యం అంటూ ఏదీ ఉండేదికాదు, ఆ స్థాయిపోయి, ఇవాళ్టివరకు తెలుగులో వచ్చిన మంచి పుస్తకం కూడా సిలబస్‌లో చేరుతోంది. చాలా పోరాటపటిమతో నేనీ పని చేశాను. 11 విశ్వవిద్యాలయాల్లో బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ మెంబర్‌గా, మా ఆధునిక సాహిత్యాన్ని సిలబస్‌గా పెట్టాను.

మూడుసార్లు అకాడమీ అవార్డులు

నా ఆరో తరగతిలోనే తెలుగుమాస్టర్ని కావాలని నిర్ణయించుకున్నాను. ఇంటర్మీడియట్‌లో నేను రాసిన ‘ఉత్తరం’ ఎప్పటికీ గుర్తుండిపోయే కథ. అప్పుడే, పద్యాలు, గేయాలు రాసేవాణ్ణి. భారతి, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక నన్ను బాగా ప్రొత్సహించాయి. నా రచనలపై, ఆలోచనలపై నా తల్లిప్రభావం బాగా ఉంది. అనుభవానికి దగ్గరగాఉన్నవాటినే వస్తువులుగా తీసుకుని రాశాను. దళిత స్ర్తీ ప్రతిఘటన స్వరూపాన్ని 60వ దశకంలోనే నా కథల్లో ఆవిష్కరించాను.‘ఊరబావి’ కథా సంపుటి (1987), ‘మునివాహనుడు’ నాటకం (1989), ‘ఆధునిక సాహిత్య విమర్శ సూత్రాలు’ (1998) లకు మూడుసార్లు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డులు పొందాను.

నా సాహిత్యం

ఒకే రిజర్వాయర్‌నుంచి ఏడు కుళాయిల్లోకి నీరు ప్రవహించినట్టుగా, ఒకే హృదయంలోంచి ఏడు సాహితీ ప్రక్రియల్లోకి నా రచనలు ప్రసరించాయి. కథ, కవిత, నవల, నాటకం, విమర్శనం, పరిశోధనం, అనువాదం...ఈ ఏడు సాహిత్య ప్రక్రియల్లోనూ 96 పుస్తకాలు ఇప్పటివరకు సృజించాను. ఒక్కొక్క ప్రక్రియలోనూ పదీ, పదిహేను పుస్తకాలుంటాయి. వీటిని పాఠకులు ఎంతో ఆత్మీయంగా స్వీకరించారు. దళితజీవితం, స్ర్తీ జీవితం, బహుజన, గిరిజన, మైనార్టీల జీవితాలు, పేదల జీవితాలకు సంబంధించిన సమాచారం ప్రధానంగా నా రచనల్లో ఉంటుంది. స్ర్తీ వాద రచయిత్రులు, బహుజన రచయితలు, దళిత రచయితలు,కథారచయితలు వేరువేరుగా ఉండవచ్చు. కానీ మానవులందరి గురించీ మాట్లాడటం అనేదే నా సాహిత్యపంథా. ఆకలైన ప్రతి మనిషీ నా సాహిత్యంలో ఉంటాడు.

ఏ రకమైన అసమానతలకు గురైన మనిషి అయినా నా సాహిత్యంలో ఉంటాడు. సమాజం సంపూర్ణంగా ఉండాలనీ, సమాజంలో అసమానతలు ఉండకూడదనీ, దోపిడీ ఉండకూడదనీ, పీడనకు గురయ్యేవాళ్ళుండకూడదనీ, అట్లాకాకుండా ఉంటే బాగుంటుందనీ చెప్పడం కోసమే నేను రచనలు చేశాను. అదే నా రచనలకు మూలబిందువు. మీరు ఏ పుస్తకం తీసుకున్నా, ఏదో ఒక కోణం ఉంటుంది. ఏ కథ, నవల, నాటకం, కవిత్వం ఏది తీసుకున్నా నేను చేసే రచనల్లో విషయం ప్రధానంగా ఉంటుంది. ఆ విషయం సామాజికంగా ఉంటుంది. అందాలకోసం ప్రయత్నం చేసి, పాఠకుడికి చెప్పేది చెప్పకుండా చెయ్యను.