హైకూల కవి బొల్లిన వీర వెంకట ప్రసాద్‌. తనను తాను తెలుసుకోవాలనే స్వీయాన్వేషణనే ఓ పరిశోధనగా చేపట్టిన తాత్వికుడు. చింతనాత్మకమైన తన ఆలోచనా దృక్పథానికి హైకూ అతికినట్టు సరిపోతుందంటారాయన. మనోవికాసాన్నీ, జీవితంపట్ల ప్రేమనీ కలిగించని సాహిత్యాన్ని పాఠకుడు తిరస్కరిస్తాడంటున్న బి.వి.వి.ప్రసాద్‌ఇంటర్వ్యూ...

పశ్చిమగోదావరి జిల్లా తణుకు మా సొంత ఊరు. నాన్నగారు బొల్లిన అచ్యుతం. అమ్మ వెంకటస్వరాజ్య విజయలక్ష్మి. తాతలకాలంనుంచీ మాది వ్యవసాయ కుటుంబం. అయితే, నాన్న మొదట ఉద్యోగం చేసి, తర్వాత పౌల్ర్టీ మెడికల్స్‌ బిజినెస్‌లో స్థిరపడ్డారు.1966 నవంబరు 21న తాడేపల్లిగూడెంలో నేను పుట్టాను. సంతానంలో నేనే పెద్ద.మా తమ్ముడు నాగేంద్రకుమార్‌, చెల్లెలు భవాని.ఏడోతరగతి వరకు మాతామహుల ఇంట, నలుగురు మేనమామల మధ్య పెరిగాను. ఉమ్మడికుటుంబ వాతావరణంవల్ల మానవ సంబంధాలపట్ల గాఢమైన అనురక్తి, ప్రకృతిలో మమేకమయ్యే లక్షణాలను పుణికిపుచ్చుకున్నాను.

పరిశీలనా దృక్పథం

బాల్యం నుంచీ సమాజాన్ని బాగా పరిశీలించేవాణ్ణి. మనుషుల ద్వంద్వ వైఖరులు నాకు చాలా బాధ కలిగించేవి. సమాజంలోని అసమానతలు నన్ను తీవ్రంగా ఆలోచింపజేసేవి. ‘సమాజం, మనుషుల ప్రవర్తన ఇలా ఉండకుండా ఉంటే బాగుండును’ అనిపించేది. నా చుట్టూ సమాజం మంచిగా ఉండాలని కోరుకునేవాణ్ణి. ఆ దశలోనే బాలసాహిత్యం బాగా చదివేవాణ్ణి. లైబ్రరీ బుక్స్‌ తెచ్చుకుని చదువుకునేవాణ్ణి. దాంతో స్వతహాగానే సాహిత్యం అబ్బింది.సెవెన్త్‌ నుంచి బీకాం వరకు తణుకులో చదివాను. టెన్త్‌ నాటికి శరత్‌ సాహిత్యం, యండమూరి, మల్లాది, కొమ్మూరి రచనలు చదివేవాణ్ణి. సమాజ ప్రభావం వల్ల నాలో భావావేశం పెల్లుబికేది. ఇంటర్మీడియట్‌ నాటికి నా భావావేశం కవిత్వరూపం తీసుకుంది. 400 వరకు కవితలు రాశాను. అవి కాలేజీ మ్యాగజైన్‌లో వచ్చేవి. తెలుగు మాస్టారు జీఎస్వీ నరసింహారావుగారు నాకు శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి కవిత్వం ఇచ్చి చదవమని ప్రోత్సహించేవారు.

కాకినాడలో బీకాం ఫైనలియర్‌లో ఉండగా, శ్రీశ్రీ కవిత్వానికి ప్రభావితుడనై లెనిన్‌ రచనలతో సహా కమ్యూనిస్టు సాహిత్యం బాగా చదివాను. సమసమాజ భావనవైపు మొగ్గు చూపించి, అభ్యుదయవాద కవిత్వం బాగా రాసేవాణ్ణి. మహాప్రస్థానంలో చలం యోగ్యతాపత్రం చదివి అతడిమీద ఇష్టంతో ‘మ్యూజింగ్స్‌’, ‘ప్రేమలేఖలు’ సహా ఆయన రచనలు చదవడంతో సౌందర్యాన్ని ఆస్వాదించడం అలవడింది. అప్పటినుంచీ నాకు నచ్చినవిధంగా ఆలోచించడం ప్రారంభించాను. నాకు అలాంటి ధైర్యాన్నిచ్చింది చలం రచనలే.

తొలి కవితా సంపుటి

గోపీచంద్‌, ప్రేమ్‌చంద్‌, రాహుల్‌ సాంకృత్యాయన్‌ తదితరుల సాహిత్యం చదవడం వల్ల నా చుట్టూ సమాజంలోని లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించేవి. నా ప్రాథమికస్థాయి కవిత్వంలో సమాజ లోటుపాట్లన్నింటినీ ఎత్తిచూపించేవాడిని. నిత్యం తీవ్ర అశాంతితో తల్లడిల్లిపోయేవాణ్ణి. అప్పుడే అనిపించింది ‘మనం తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉందని’. నా అశాంతిని పొగొట్టుకోవడం ఎలా? అని మార్గాన్వేషణ చేస్తున్న సమయంలో, రమణమహర్షి గురించి చలం రాసిన ‘భగవాన్‌ స్మృతులు’ పుస్తకం నాకో దారి చూపించింది. రమణమహర్షి జీవన విధానం, బోధలు నాకెంతో నచ్చాయి.

అది వేదాంతం కాదు, ‘నువ్వు’ అంటే ఎవరో తెలుసుకో, స్వీయాన్వేషణ చేసి, ‘‘నేను’’ అంటే ఏమిటో తెలుసుకో అని బోధిస్తారు. అప్పటినుంచీ నన్ను నేను తెలుసుకోవడానికి స్వీయాన్వేషణ (SELF INQUIRY)ప్రారంభించాను. ఆ క్రమంలోనే విపరీతంగా కవిత్వం రాశాను. 1989–90లో మా తెలుగు మాస్టారు నరసింహారావుగారు, అవధాని–పండితులు చెరువు సత్యనారాయణశాస్త్రిగారి సహకారంతో, వస్తుప్రధానమైన నా 40 కవితల ‘ఆరాధన’ అనే నా తొలి కవితా సంపుటి వెలువడింది. శిఖాల కృష్ణారావు, సంజీవదేవ్‌, ఇస్మాయిల్‌ ఈ సంపుటిని ఎంతగానో మెచ్చుకున్నారు.