ద్రౌపదీ స్వయంవరం

బక వధానంతరం పాండవేయులు చతుర్వేదాలను అభ్యసిస్తూ అందరి మన్ననలను అందుకుంటూ ఏకచక్ర పురంలో జీవించసాగారు. ఆ సమయంలో ద్రుపదుని రాజధాని కాంపిల్య నగరం నుండి బ్రాహ్మణుడొకడు పాండవులు ఉంటున్న విప్రవర్యుని ఇంటికి అతిథిగా విచ్చేశాడు. అతనిని ధర్మరాజాదులతోపాటు కుంతీదేవి సందర్శించి-‘‘భూసురేంద్రా! తాము చూసిన రాజాధిరాజులలో గుణవంతులెవరు’’ అని ప్రశ్నించింది.‘‘ఇంకెవరున్నారమ్మా! ఆ ద్రుపద నరేశ్వరుడే! సద్గుణాలలో ఆ భూపతికి సరిజోడు లేరు’’ అన్నాడు బ్రాహ్మణుడు.‘‘అంతేకాదమ్మా! ఆ నరేశ్వరునికి అగ్నిహోత్ర జ్వాలాంజలి నుంచి ఓ అందాల రాశి సముద్భవించింది. ఆ చక్కని చుక్కకి అన్ని విధాలా తగిన వరుని కోసం ఇప్పుడు వెతుకుతున్నారు. ఇటీవలే స్వయంవరం కూడా ప్రకటించారు’’ అన్నాడు మళ్ళీ. ఆ మాటలకి-‘‘హోమజ్వాల నుండి అందాల రాశి సముద్భవించడమా! బాగుంది బాగుంది! అసలు ఆ అందాలరాశి హోమజ్వాల నుండి పుట్టడానికి గల కారణం ఏమయి ఉంటుంది’’ ప్రశ్నించారు పాండవులు.‘‘కారణం అడిగితే పెద్దకథే చెప్పాల్సి ఉంటుంది’’ అని ద్రోణ ద్రుపదులు అంతే వాసులై, ఆప్త మిత్రులుగా మెలగడం, ద్రుపదుడు పాంచాల దేశాధీశుడు కావడం, దారిద్య్ర పీడితుడు ద్రోణుడు ఒకనాడు ద్రుపదుని కలవడం, అతనిని ద్రుపదుడు అవమానించడం, ప్రతీకారేచ్ఛతో మండిపోతూ ద్రోణుడు పాండవ ధార్తరాష్ట్ర కుమారులను చేరదీయడం, గురుదక్షిణగా ద్రుపదుని బంధించి తెమ్మనడం, రాజ పుత్రులు తీసుకుని రావడం, ద్రుపద నరపతిని ద్రోణుడు అధిక్షేపించడం...అన్నీ వివరించి-‘‘ఆనాడు దుర్భర పరాభవంతో అట్టుడికిన ద్రుపదుడు రణరంగంలో ద్రోణాచార్యుని సంహరించగల వీరాగ్రణి, దేవేంద్ర నందనునికి దేవి కాగల సౌందర్యశాలి కోసం కఠోర దీక్ష స్వీకరించి విప్రవర్యుల నెందరినో ఆశ్రయించి, వారి అనుగ్రహాన్ని అర్థించ సాగాడు. అప్పడతనికి యాజుడు, ఉపయాజుడు తారసిల్లారు. తపోమహిమలో ఉపయాజుడు అగ్రగణ్యుడు. ద్రుపదుడు ఒకనాడు ఆ బ్రాహ్మణుని ఆశ్రయించి-‘‘మీకు ఓ లక్ష గోధనం సమర్పిస్తాను. ఉత్తమ పుత్ర భాగ్యం కలిగించే క్రతువొకటి నాచేత చేయించండి’’ అని వేడుకున్నాడు.

ఉపయాజుడు అందుకు అంగీకరించలేదు. అయినా ద్రుపదుడు పట్టు వీడలేదు. ఉపయాజునికి ఎన్నెన్నో పరిచర్యలాచరించి, అనేక విధాల సంతృప్తి కలిగించి మళ్ళీ వేడుకున్నాడు. అప్పుడతను తన అన్నను కలిసి ప్రార్థించమన్నాడు. ఆ మాట అన్నదే తడవు ద్రుపదుడు యాజుణ్ణి సందర్శించి-‘‘నన్ను నిర ్బంధించి నా పెడరెక్కలు విరిచి కట్టి నన్ను అవమానించిన ద్రోణుని అంతే స్థాయిలో అవమానించి ఆ బీద బ్రాహ్మణుని వధించగల కొడుకు నాక్కావాలి. అలాంటి యోధాగ్రణి కోసం నా చేత యాగం చేయించి నా గుండె మంటను చల్లార్చండి’’ అని వేడుకున్నాడు. యాజుడు ‘సరే’నన్నాడు. ద్రుపదుడు కోకిలాదేవితో పుత్రకామేష్టి ప్రారంభించి పావక దేవునికి సంతృప్తి కలిగించాడు. ఫలితంగా అగ్నిహోత్ర జ్వాలాంజలి నుండి కుమారుడొకడు ఆవిర్భవించాడు. వెలుగులు విరజిమ్ముతూ రెండు చేతులా ఆయుధాలు చేపట్టి రథారూఢుడై చూపరులకు ఆశ్చర్యం కలిగించాడా నందనుడు. ఆ ఆశ్చర్యం నుండి తేరుకోక ముందే ఆ యజ్ఞ వేదిక నుండి అత్యద్భుత సౌందర్యరాశి ప్రాదుర్భవించింది. ఆ తేజోవతిని తిలకించి అక్కడి వారంతా చిత్ర ప్రతిమలయినారు.

అంతలో అశరీరవాణి-‘‘ఇక మీదట ఈ కుమారి కుమారులను ‘కృష్ణా-ధృష్టద్యుమ్న’ అని వ్యవహరించండి’’ అని పలికింది. ద్రుపదుడు అందుకు అంగీకరించాడు. ధృష్టద్యుమ్న ధనుర్వేద పారంగతుడై శర శాస్త్రవేత్తలలో ప్రథముడయినాడు. రాకుమారి ద్రౌపది వివాహానికి సిద్ధమయింది. ఇదిలా ఉండగా-లాక్షా గృహ దహనం, పాండవేయుల మృతి తెలుసుకున్న ద్రుపదుడు చాలా దుఃఖించాడు.‘‘మా ద్రౌపదిని ఆ దేవేంద్ర నందనుడు అర్జునునికి సమర్పించాలని నిశ్చయించాను. విధి వక్రించింది. అర్జునుడు చనిపోయాడు. ఇప్పుడీ చిన్నదాన్ని ఏ అయ్య చేతిలో పెట్టేది’’ అని విలపించసాగాడు. అతని దుఃఖాన్ని మాపడం ఎవరి వల్లా కాలేదు. ఆఖరికి పురోహితుడొకడు కల్పించుకుని-