ద్రోణ భీమసేనుల యుద్ధం

అర్జునుని క్షేమ సమాచారాలు తెలుసుకుని రావాల్సిందిగా సాత్యకిని ధర్మరాజు ఆజ్ఞాపించడంతో అతను ఆ ప్రయత్నాల్లో ముందుకురికాడు. తోడుగా వస్తానన్న భీముణ్ణి వద్దన్నాడు. ‘గురుదేవుల నుండి ధర్మరాజును కాపాడాల్సిన బాధ్యత నీది! నువ్విక్కడే ఉండు’ అని భీముణ్ణి వారించి కౌరవసేనా మధ్యంలోకి దూసుకు వచ్చాడతను. అలా దూసుకుని వచ్చిన సాత్యకిని దుశ్శాసనుడు ఎదుర్కొన్నాడు. వజ్రాయుధాల్లాంటి బాణాలను గురిపెట్టాడు. వాటిని తట్టుకున్నాడు సాత్యకి. తర్వాత ఓ బాణంతో దుశ్శాసనుని విల్లుని రెండు ముక్కలు చేశాడు. దుశ్శాసనుడు ఇంకో విల్లు అందుకుని శరాప్రయోగం ప్రారంభించాడు. సాత్యకి ఇక ఉపేక్షించదలచలేదు. మళ్ళీ దుశ్శాసనుని విల్లు విరిచాడు. అతని రథసార థిని, గుర్రాలను కూల్చాడు. ఒక భయంకర బాణాన్ని ప్రయోగించి స్పృహ లేకుండా చేశాడతన్ని. మరో బాణాన్ని ప్రయోగించి దుశ్శాసనుని కుత్తుక ఖండించేవాడే! కాకపోతే భీమసేనుని ఘోర ప్రతిజ్ఞ గుర్తుకు వచ్చి వూరుకున్నాడు. ముందుకు కదిలాడు. సాత్యకి కౌరవసేన లోలోపలికి చొచ్చుకుని పోయాడని తెలిసి, ధర్మజ, భీమ, నకుల సహదేవులు సింహనాదాలు చేశారు. ఆ ఆనందం కాసేపే అనుభవించాడు ధర్మరాజు. అంతలోనే అర్జునుని గురించి, అతన్ని కాపాడమని పంపించిన సాత్యకి గురించి ఆలోచించి బాధపడ్డాడు. అర్జునుని కోసం భీముణ్ణి పంపించాలి. సాత్యకిని పంపడం తప్పు. ఎందుకిలా ఆలోచించాననుకున్నాడు ధర్మరాజు. మహాబలశాలి, అనేక మంది రాక్షసులను అవలీలగా ఎదుర్కొన్న భీముణ్ణి పంపితే కృష్ణార్జునులకు తోడుగా ఉంటాడు కాని, సాత్యకిని పంపడం పద్ధతి కాదనుకున్నాడు ధర్మరాజు. భీమసేనుని పిలిచాడు.‘‘నాయనా భీమసేనా’’ అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు.

‘‘ఏమయింది అగ్రజా! ఎందుకా కన్నీరు? చెప్పు! నేనేం చేస్తే నీ దుఃఖం తీరుతుందో చెప్పు! ఆజ్ఞాపించు! నేనందుకు సిద్ధంగా ఉన్నాను’’ అన్నాడు భీముడు.‘‘దేవదత్త ధ్వని వినిపించకుండా పదే పదే పాంచజన్యం వినరావడంతో నాకెందుకో ఆందోళనగా ఉంది. అర్జునునికి ఏదో కీడు జరిగి ఉంటుందని నా మనసుకి అనిపిస్తోంది. చూసి రమ్మని సాత్యకిని పంపినా నాకు ధైర్యం చాలడం లేదు. నువ్వే అందుకు సమర్థుడివి. నువ్వు వెళ్ళు. కృష్ణార్జునుల్ని కలుసుకో! వారు క్షేమమని ఓ సింహనాదం చెయ్యి. చాలు! తేరుకుంటాను’’ అన్నాడు ధర్మరాజు.‘‘నర నారాయణులు ఆ కృష్ణార్జునులు. వారికి ఏం కాదన్నయ్యా! అయినా నీ మాటను కాదనలేను. వెళ్ళి సాత్యకి, కృష్ణార్జునులు క్షేమమేనని తెలియజేస్తూ సింహనాదం చేస్తాను. వినండి’’ అని వెళ్ళేందుకు ముందుకురికాడు. ధృష్టద్యుమ్నుని సమీపించాడు.‘‘సేనాధిపతీ! అన్నగారిని జాగ్రత్తగా చూసుకోండి. గురుదేవులు ఏ క్షణాన్న ఎలా విరుచుకుని పడతారో తెలియదు’’ అన్నాడు.‘‘నా శరీరంలో ప్రాణమున్నంత వరకు ధర్మరాజుకి ఏం కాదు. నువ్వు ఆందోళన చెందనవసరం లేదు. ముందు అర్జునుని సంగతి చూడు’’ చెప్పాడు ధృష్టద్యుమ్నుడు. భీముడు రథాన్ని అధిరోహించాడు. గుర్రాలు ఇంకా కదలనే లేదు. అంతలో మళ్ళీ పాంచజన్యం వినవచ్చింది.‘‘విన్నావా భీమసేనా! మళ్ళీ పాంచజన్యమే వినిపించింది. నా ఉద్దేశంలో అర్జునునికి ఏదో ఆపద సంభవించింది. అది తట్టుకోలేక కృష్ణుడు పాంచజన్యాన్ని పూరించి యుద్ధానికి సన్నద్ధుడవుతున్నాడు.’’ ఆందోళన చెందాడు ధర్మరాజు.‘‘వెళ్ళు భీమసేనా! త్వరగా వెళ్ళు’’ ఆజ్ఞాపించాడు. భీముడు మనోవేగంతో పురోగమించాడు. కౌరవసేనలోనికి చొచ్చుకుని వస్తోన్న భీముని అల్లంత దూరం నుంచి చూసి ద్రోణుడు అతనికి అడ్డుగా నిలిచాడు. లెక్కకు మిక్కిలిగా బాణాలను ప్రయోగించి భీముణ్ణి, అతని రథాన్ని అడుగు కూడా ముందుకు కదలనీయకుండా చేశాడు.

‘‘భీమసేనా! నన్ను గెలిచినప్పుడే నువ్వీ వ్యూహం లోనికి చొచ్చుకుని పోగలవు. లేని పక్షంలో అడుగు కూడా ముందుకు వేయలేవు. నీకు అసలు సంగతి చెబుతున్నాను. నీ తమ్ముడు అర్జునుడు నా అనుమతితోనే వ్యూహ ప్రవేశం చేశాడు తప్ప నన్ను గెలిచి కాదు. ఆ సంగతి కూడా దృష్టిలో పెట్టుకో’’ అన్నాడు ద్రోణుడు. అర్జునునిలా భీముడు కూడా గురుభక్తి ప్రదర్శిస్తాడనుకున్నాడు. అయితే అందుకు భిన్నంగా జరిగిందంతా. ద్రోణుని మాటలకు మండిపడ్డాడు భీముడు.