కర్ణుని నాలుక కోసేందుకు భీముని యత్నం

పుంఖాను పుంఖంగా కర్ణుడు ప్రయోగించిన బాణాలు భీముని రథాన్ని కనిపించకుండా చేశాయి. మబ్బులా కమ్మేశాయి. ఆ తర్వాత ప్రయోగించిన ఒకానొక కర్ణుని బాణానికి భీముని చేతిలోని గదాయుధం తుళ్ళిపోయింది. విల్లు కూడా విరిగిపోయింది. వరుసగా ప్రయోగించిన ఇరవై అయిదు బాణాలకు భీముని కవచం తూట్లుపడి చిట్లిపోయింది. కర్ణుని ఎదుర్కొనడం కష్టసాధ్యమనుకున్నాడు భీముడు. అయినా గట్టిగా ప్రయత్నించి వజ్రాయుధంలాంటి బాణాన్ని గురి చూసి కర్ణుని గుండెల మీదికి విసిరాడతను. కర్ణుని గుండెల్లో గుచ్చుకుందది. దాంతో స్పృహ కోల్పోయాడు కర్ణుడు. నిలువునా కుప్ప కూలిపోయాడు. కౌరవసేనలో భయం చోటు చేసుకుంది. అదే అదనుగా భీముడు తన రథాన్ని ముందుకు పోనిచ్చాడు. కర్ణుని రథం దగ్గరగా వచ్చాడు. ఒరలోని కత్తిని తీసి, కర్ణుని నాలుకను ఖండించేందుకు అతని రథం మీదికి ఉరికాడు. ఏనుగులా వచ్చి పడ్డ భీముణ్ణి చూసి లేచి నిల్చున్నాడు శల్యుడు. స్పృహలో లేని కర్ణుని నోరు తెరవబోతున్న భీముని ఆంతర్యాన్ని గ్రహించిన శల్యుడు అతన్ని వారించాడు.‘‘ఏం చెయ్యబోతున్నావు’’ అడిగాడు.‘‘ఈ పాపాత్ముడి నాలుక ఖండిస్తాను’’ చెప్పాడు భీముడు.

‘‘అప్పుడు కర్ణుడు చనిపోతాడు’’‘‘కావాల్సింది అదే’’‘‘కాదు, కర్ణుణ్ణి చంపాల్సింది నువ్వు కాదు, అర్జునుడు చంపాలి. చంపుతానని అతను ప్రతిజ్ఞ చేశాడు. మరిచిపోయావా? కర్ణుణ్ణి నువ్వు చంపితే అర్జునుడు బాధ పడతాడు. తమ్ముణ్ణి బాధపెట్టడం నీకిష్టమా’’ అడిగాడు శల్యుడు.‘‘ఇష్టం కాదుగాని, ఈ దుర్మార్గుడు అన్న ధర్మరాజుని ఎన్ని విధాల వేధించాడో నీకు తెలియదు. అదంతా గుర్తు రావడంతో అర్జునుని ప్రతిజ్ఞ మరచిపోయాను. పాంచాలీ దేవిని ఈ దురాత్ముడు నిండు సభలో అనరాని మాటలన్నాడు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అందుకని తొందరపడ్డాను. సమయానికి తమ్ముని ప్రతిజ్ఞ గుర్తు చేశావు. కృతజ్ఞతలు’’ అన్నాడు భీముడు. స్పృహ కోల్పోయి ఉన్న కర్ణుణ్ణి కసిదీరా పిడికిలితో పొడిచి తన రథంలోకి వెళ్ళిపోయాడు. అక్కణ్ణుంచి నిష్క్రమించాడు. భీముడు అటు వెళ్ళగానే ఇటు శల్యుడు కూడా రథాన్ని ముందుకు పోనిచ్చాడు.కర్ణుడు స్పృహ కోల్పోయిన సంగతి సుయోధనునికి తెలిసింది. ఆందోళన చెందాడతను. తమ్ములతో ఇలా చెప్పాడు.‘‘భీమసేనునితో యుద్ధం చేస్తూ కర్ణుడు స్పృహ కోల్పోయాడని తెలిసింది. వెళ్ళండి! వెళ్ళి అతన్ని ఆదుకోండి’’అన్న చెప్పడం ఆలస్యం శ్రుతవర్మ, వికటుడు, సముడుతో పాటు మరి ముగ్గురు కలిసి మొత్తం ఆరుగురు దుర్యోధనుని తమ్ములు భీముణ్ణి ఎదుర్కొన్నారు.వారిని చూస్తూనే ప్రళయకాలానల జ్వాలలా భగ్గుమన్నాడు భీముడు. అప్పటికే అయిదువందల యాభైమంది రథికుల్ని మట్టుబెట్టాడతను. ఆపై శ్రుతవర్మ శీర్షం ఖండించి గొంతెత్తి గర్జించాడు. తర్వాత వికట సముల్ని కూడా అంతమొందించాడు. కాస్సేపటికి క్రాధునితో పాటు నందోపనందుల్ని కూడా వధించాడు. భీముణ్ణి ఎదుర్కొన్న దుర్యోధనుని తమ్ములు ఆరుగురూ అలా అంతమయ్యేసరికి కౌరవ యోధులు భీముడంటే భయపడి పరుగులు పెట్టారు. పలాయనం చిత్తగించారు. వారిని చూసి సైన్యం కూడా వెను తిరిగి పారిపోసాగింది. అప్పుడు స్పృహలోనికి వచ్చాడు కర్ణుడు. పారిపోతున్న యోధులను, సైన్యాన్ని చూసి ‘ఆగండాగండి’ అంటూ వారిని నిలిపాడు. వెనుకకు మరలించాడు. శౌర్యోత్సాహాలతో ముందుకు ఉరికి భీముణ్ణి సమీపించాడు.

పుంఖాను పుంఖంగా బాణాలు ప్రయోగించాడు. వాటిని ప్రతి ప్రయోగాలతో నివారించాడు భీముడు. ఏడు బాణాలు ఒక్కసారిగా ప్రయోగించి మళ్ళీ కర్ణుని బాధించాడతను. తట్టుకున్నాడు కర్ణుడు. పది బాణాలు ప్రయోగించి భీముని బెదిరించాడు. మరో బాణంతో అతని విల్లును విరిచాడు. భీముడు బెదరిపోలేదు. చేతిలోని గదను గిరగిరా తిప్పి కర్ణుని మీదకి విసిరాడు. విసిరినంత సేపు పట్టలేదు. దానిని అక్కడే బాణ ప్రయోగంతో రెండు ముక్కలు చేశాడు కర్ణుడు. తర్వాత అతని రథాశ్వాలను నేలపై కూల్చివేశాడు. ఒరిగిన పోయిన రథంలోంచి గదను అందుకుని దానిని గిరగిరా తిప్పుతూ కర్ణుని ఎదుర్కొన్నాడు భీముడు. అతనలా కర్ణుని ఎదుర్కొనడం అల్లంత దూరం నుండి గమనించిన దుర్యోధనుడు, పదిహేడు కొమ్ముటేనుగులతో భీమునిపైకి దండెత్తి వచ్చాడు. దండెత్తి వచ్చిన ఏనుగుల తొండాలు పట్టుకుని తిప్పి తిప్పి నేలకేసి కొట్టి వాటిని చిత్తు చిత్తు చేశాడు భీముడు. మూడు వేల గుర్రాలతో వచ్చి భీముణ్ణి ఎదుర్కొన్నాడు శకుని. వాటి ప్రాణాలు కూడా తీసేశాడు భీముడు.