యుద్ధానికి సిద్ధమయిన కర్ణార్జునులు

కర్ణుడు మరణిస్తే యుద్ధం ముగిసినట్టే! మిగిలిన వారి గురించి మనం పెద్దగా పట్టించుకోనవసరం లేదు అన్న శ్రీకృష్ణుని మాటతో గుండె నిండా పగ, ప్రతీకారాన్ని నింపుకున్న అర్జునుడు ఇలా అడిగాడు.‘‘ఎక్కడ కర్ణుడు’’‘‘అడుగో! అక్కడ’’ యుద్ధరంగంలో విజృంభిస్తోన్న కర్ణుని చూపించాడు కృష్ణుడు. రథాన్ని అటుగా పోనిచ్చాడు. పాండవేయ సేనలోకి ప్రవేశించింది రథం.ఆ సమయంలో కర్ణుని కుమారుడొకడు ఉత్తమౌజుని చేతిలో మరణించాడు. తన కళ్ళ ముందే జరిగిందది. చూసి తట్టుకోలేకపోయాడు కర్ణుడు. భగ్గున మండిపోయాడు. మరుక్షణంలో పుంఖాను పుంఖాలుగా బాణాలు ప్రయోగించి ఉత్తమౌజుని రథాశ్వాలతో పాటు కేతనాన్ని కూల్చివేసి వీరశంఖాన్ని పూరించాడు. విరథుడు అయిన ఉత్తమౌజుడు కత్తిని చేపట్టి ముందుకురికాడు. అతన్ని అడ్డుకున్నాడు కృపాచార్యుడు. తనని అడ్డుకున్నాడన్న కోపంతో కృపాచార్యుని రథాశ్వాల శీర్షాలను ఖండించాడు ఉత్తమౌజుడు. తర్వాత పరుగున వెళ్ళి శిఖండి రథంలో చోటు చేసుకున్నాడు. వారిద్దర్నీ ఎదిరించసాగాడు కృపాచార్యుడు. నేల మీద నిలబడే యుద్ధం చేయసాగాడు. ఇంతలో అతన్ని ఆదుకునేందుకు వచ్చాడు అశ్వత్థామ. కృపాచార్యుని తన రథంపైకి ఎక్కించుకుని, అక్కణ్ణుంచి వేరొక ప్రదేశానికి తరలిపోయాడు.అన్నగారిని చూసి వస్తానన్న అర్జునుడు ఏమయిపోయాడు? యుద్ధరంగంలోకి ఇంకా రాలేదేమి? పరిపరివిధాల ఆలోచనలు చేయసాగాడు భీముడు. తనని గమనించిన రథసారథి విశోకునితో ఇలా అన్నాడు.‘‘అన్న ధర్మరాజు క్షేమాన్ని తెలుసుకుని వస్తానన్న తమ్ముడు అర్జునుడు ఇంత వరకు రాలేదంటే...ఏమయి ఉంటుందో? ఆందోళనగా ఉంది’’‘‘మీరు ఆందోళన చెందనవసరం లేదు వీరవరేణ్యా! అర్జునుడు త్వరలోనే రాగలరిక్కడికి’’ అన్నాడు విశోకుడు. భీమసేనునికి ధైర్యం చెప్పాడు. అంతలోనే ఆ మూల కౌరవసైన్యం పరుగులు తీస్తూ కనిపించడంతో అటుగా పరిశీలించి చూశాడు విశోకుడు. అర్జునుడు కనిపించాడతనికి. ఆ ఆనందంలో ఇలా అన్నాడతను.‘‘భీమసేనా! అడుగో అర్జునుడు. కపికేతనం అదిగో’’ చూపించాడు.చూశాడు భీమసేనుడు. కౌరవ సేనని పరుగులు తీయిస్తున్నాడు అర్జునుడు. అతని శరపరంపరకు అడ్డులేకుండాపోతోంది.‘‘విశోకా! విజయుని రాక తెలియజేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇందుకు బహుమనంగా నీకు నూరుగురు దాసీమణులతో పాటు ఇరవై ఉత్తమాశ్వాలు, పద్నాలుగు గ్రామాలు ఇస్తున్నాను. తీసుకో’’ అన్నాడు భీమసేనుడు.

‘‘కృతజ్ఞుణ్ణి’’ అన్నాడు విశోకుడు.కనిపించిన చోటల్లా కౌరవసేనను కకావికలు చేస్తోన్న అర్జునుడు, కర్ణుని సమక్షంలోని సైనికుల్ని మాత్రం కదలించలేకపోయాడు. ప్రయత్నించి ప్రయత్నించి అతికష్టమ్మీద వారిని ఓడించాడు. భయంకర శస్త్రాస్త్రాలు ప్రయోగించి పాండవేయ భటుల జయాభినందనలు అందుకున్నాడు. అర్జునుని విజృంభణ గమనించి భీమసేనుడు గొంతెత్తి గర్జించాడు. అది విన్నాడు దుర్యోధనుడు. రగిలిపోయాడు. యోధుల్ని ఇలా హెచ్చరించాడు.‘‘వీరశ్రేష్ఠులారా! భీమసేనుడు మరణిస్తే పాండవపక్షం సర్వం నాశనమయినట్టే! అందుకనే చెబుతున్నాను. ఆలసించక అతన్ని చుట్టిముట్టి సంహరించండి’’‘‘ఆజ్ఞ’’ అంటూ చతురంగ సేనల పెను ఘోషలతో భీమసేనుని చుట్టుముట్టారంతా. భీమసేనునికి అవకాశం దొరికినట్టనిపించింది. అంత మంది యోధులు ఒక్కసారిగా ఒక్క దగ్గరగా దొరకడం అదృష్టమనుకున్నాడతను. విజృంభించాడు. వచ్చిపడుతోన్న వివిధాయుధాలను ఛిన్నాభిన్నం చేసి ఆకాశంలో నిలిచి చూస్తోన్న అమరుల అభినందనలు అందుకున్నాడు. దుర్యోధనుడు అది గమనించాడు. శకునితో ఇలా అన్నాడు.‘‘మామా! భీమసేనుని ఎదిరించి వెనక్కి మరలించు’’‘‘తప్పకుండా’’ అని ముందుకురికాడు శకుని. గుప్పెడు బాణాలు గుప్పించి భీముని బాధించాడు. తట్టుకున్నాడు భీముడు. చేతిలోని బాణాన్ని గురి చూసి శకుని మీదికి విసిరాడు. దాన్ని మధ్యలోనే ముక్కముక్కలు చేశాడు శకుని.

భీముని చూసి కవ్వింపుగా నవ్వాడు. మరో బాణాన్ని ప్రయోగించాడు భీముడు. అది శకుని ధనుస్సును రెండు ముక్కలు చేసింది. మరో విల్లు అందుకున్నాడు శకుని. పదహారు బాణాలు ఒక్కసారిగా భీమునిపై ప్రయోగించాడతను. వాటి దెబ్బకు భీముడు తట్టుకోలేకపోయాడు. చూస్తూండగానే అతని చేతిలోని విల్లు, కేతనం విరిగి నేలకొరిగాయి. దెబ్బతిన్న రథాశ్వాలు పరిగెత్తలేకపోతున్నాయి. సారథి విశోకుడు కూడా గాయాలపాలై బాధనణచుకుంటూ కనిపించాడు. అల్లంత దూరంలో ఉన్న దుర్యోధనుడు అదంతా గమనించి గొంతెత్తి శకునిని అనేక విధాల అభినందించాడు. వినవచ్చిన ఆ అభినందనలకు భీముడు ప్రళయకాల రుద్రుడయ్యాడు. పెను విల్లొకటి అందుకున్నాడు. అనేక బాణాలు ఒక్కుమ్మడిగా ప్రయోగించాడు. ఆ బాణాలకు మూర్ఛావేశంతో రథంపై నుండి జారిపడ్డాడు శకుని. తెప్పరిల్లలేకపోతున్నాడు. అది గమనించాడు దుర్యోధనుడు. వెళ్ళి శకునిని తన రథం మీదికి ఎక్కించుకున్నాడు. అక్కణ్ణుంచి తరలిపోయాడు. దూరంగా వెళ్ళిపోయాడు.