యుద్ధానికి రా రమ్మని పిలుపు

పాంచాల రాకుమారులు, శ్రీకృష్ణునితో సహా పాండునందనులు దుర్యోధనుడు దాగున్న మడుగును సమీపించారు. ధర్మరాజు మడుగున కాలుంచి చూశాడు. కాలు నీటిలో మునిగిపోతుందనుకున్నాడతను. అయితే నేల మీద నిలచినట్టుగానే కాలుండడంతో ఆశ్చర్యంగా నీటి మీద చేతి నుంచి చూశాడు ధర్మరాజు. మంచుగడ్డను స్పృశించినట్టుగా ఉంది. నీరంతా గడ్డ కట్టి ఉంది. చల్లగా ఉందక్కడ. శ్రీకృష్ణునితో అన్నాడిలా.‘‘ఆశ్చర్యంగా ఉంది వాసుదేవా! దుర్యోధనుడు తన అత్యద్భుత మాయాశక్తితో నీటిని చూడు ఎలా చేశాడో. ఇది అభేద్యం. అతను మన చేతికి చిక్కే అవకాశమే లేదు’’అంతలోనే ఆవేశంతో మళ్ళీ ఇలా అన్నాడు.‘‘అభేద్యం కావచ్చు. అసాధ్యం కావచ్చు. అయినా సరే! దుర్యోధనుడు ప్రాణాలతో ఉండకూడదు. పాండుకుమారుల చేతిలో హతమవ్వాల్సిందే’’ధర్మరాజు ఆవేశానికి సన్నగా నవ్వాడు శ్రీకృష్ణుడు. ఇలా అన్నాడు.‘‘మాయావులను మాయోపాయాలతోనే ఎదుర్కోవాలి. దుర్యోధనుణ్ణి ఎలాగయినా మడుగులోనుంచి బయటికి రప్పించాలి. అందుకు తగిన ఉపాయాన్ని ఆలోచించాలి’’ఆలోచించసాగాడు ధర్మరాజు. ఉపాయం తట్టిందతనికి. దాంతో మడుగులోని దుర్యోధనుణ్ణి ఉద్దేశిస్తూ ఇలా పలికాడు.‘‘దుర్యోధనా! రారాజులతో జేజేలు అందుకున్న నీలాంటి వాడు, ఇలా ప్రాణాపాయభీతితో మడుగులో దాగొనడం సముచితంగా లేదు. బంధువులు, మిత్రులు, తమ్ములు నీ కోసం ప్రాణాలర్పిస్తే, నువ్వేమో నీ ప్రాణాలను అరచేతిలో దాచుకుని దాగుంటావా? అసహ్యమనిపించడం లేదూ? దాగున్నంత మాత్రాన చావు నుంచి తప్పించుకోగలననుకుంటున్నావా? తప్పించుకోలేవు. అభిమానధనుడివి. ఏమయిపోయింది నీ అభిమానం? సుక్షత్రియ శూరులెవరూ ఇలా చేయరు. నీలా దాగొనరు. కౌరవవంశంలో పుట్టి కడకు ఇలా మడుగులో కడతేరుతున్నావంటే...అయ్యయ్యో న వ్విపోతారంతా. ఆనాడు నిండు సభలో ఎన్నెన్ని మాటలన్నావు. మా అంతు చూస్తానన్నావు! ఇదా నువ్వు చూసింది. చీఛీ’’‘‘ప్రాణం కంటే మానం గొప్పది. దాన్నే కోల్పోయావు నువ్వు. మరణించినట్టే లెక్క. కర్ణ శకుని దుశ్శాసనులను చూసుకుని విర్రవీగావు. మా అంతు చూడగలననుకున్నావు. చూశావుగా. నువ్వేపాటి శూరుడివో బాగా అర్థమయింది’’ అని ఎగతాళిగా నవ్వాడు ధర్మరాజు.

సమాధానం లేదు దుర్యోధనుని దగ్గర్నుంచి. శ్రీకృష్ణుని చూశాడు ధర్మరాజు. ‘ఏం చేయనింక’ అన్నట్టుగా ఉంది ఆ చూపు. రెచ్చగొట్టన్నట్టుగా సైగ చేశాడు కృష్ణుడు. దాంతో రోషావేశంతో దుర్యోధనుణ్ణి హెచ్చరించాడు ధర్మరాజు.‘‘విజయమో వీరస్వర్గమో తేల్చుకో దుర్యోధనా! రా! బయటికిరా! యుద్ధంలో మేము ఓడిపోయామా, నువ్వే చక్రవర్తివి. లేదూ నువ్వే ఓడిపోయావనుకుంటే...మరణిస్తే స్వర్గ సౌఖ్యాలు నీ సొంతం. ఆలోచించుకో! నువ్వు మగాడివయితే నా మాటలను పట్టించుకో’’‘‘ధర్మనందనా’’ పెనుకేకగా వినవచ్చిందా పిలుపు. మడుగంతా ప్రతిధ్వనించింది. దుర్యోధనుడు అరిచాడలా.‘‘మనిషన్న వాడికి ప్రాణం మీద తీపి సహజం. ఆ తీపితోనే నేనీ మడుగులో దాగున్నాను. అయినంత మాత్రాన మగాణ్ణి కాకుండాపోను. జాగ్రత్తగా విను. ఇప్పుడు నా దగ్గర రథం లేదు. ఆయుధాలు కూడా లేవు. అయిన వాళ్ళందరూ పోయారు. ఆ బాధలో ఉన్నాను. ఆపైన బాగా అలసిపోయి ఉన్నాను. దాంతో యుద్ధం అంటే సిద్ధం కాలేకపోతున్నాను. నన్ను తేరుకోనీ. అప్పుడు మీతో యుద్ధం తప్పకుండా చేస్తాను. అందాకా వేచి చూడండి’’ అన్నాడు దుర్యోధనుడు.‘‘వేచి ఉండడం వీరుల లక్షణం కాదు, సత్వర సమరమే శూరుల లక్షణం. నువ్వీ మడుగులో దాగుని చాలా సేపయింది. ఆ సంగతి మాకు తెలుసు. నిన్ను చాలా సేపటి నుంచి వెదుకుతున్నాం. కనిపించలేదు. ఆఖరికి ఇందులో ఉన్నావని తెలుసుకోగలిగాం. బాగానే సేదదీరుంటావు. తేరుకుని ఉంటావు. ఇకాలస్యం దేనికి? రా! యుద్ధానికి రా’’ పిలిచాడు ధర్మరాజు.

‘‘ఆత్మీయులందర్నీ పోగొట్టుకున్నాను. చతురంగ బలాలు కూడా కరవైపోయాయి. ఇప్పుడు యుద్ధం చేసి లాభమేమిటి? మీతో యుద్ధం చేసి గెలిచాననే అనుకుంటే...అభినందించేందుకు ఒక్కడు...ఒక్క ఆత్మీయుడు కూడా లేని పరిస్థితి నాది. అప్పుడు యుద్ధం ఎందుకనిపిస్తోంది. ఆప్తులతో కలసి ఆనందించలేని విజయం నాకొద్దు’’ అన్నాడు దుర్యోధనుడు బాధగా. కళ్ళు చెమర్చాయతనికి. వేడిగా కన్నీటిబొట్టు రాలిపడింది. పడిన చోట నీరు కరిగి, అంతలోనే మళ్ళీ గడ్డకట్టింది.