వాయుదేవుడు-బూరుగు చెట్టు

చేతులు జోడించి నిలుచున్నాడు ధర్మరాజు. భీష్ముడు చెప్పాడిలా.‘‘ధర్మరాజా! బలహీనుడు, బలశాలితో పోరాడకూడదు. పోరాడితే ఓటమి తప్పదు. ఓటమితో పాటు ఐశ్వర్యాన్నంతా అతను పోగొట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఓ కథ ఉంది. చెబుతాను విను.’’‘‘చెప్పండి పితామహా’’చెప్పసాగాడు భీష్ముడు.‘‘ఓ మంచుకొండ మీద ఓ బూరుగు చెట్టుంది. ఎన్నెన్నో కొమ్మలూ రెమ్మలతో ఆ చెట్టు మహావృక్షమైపోయింది. ఆకాశంలో ప్రయాణిస్తూ కిందికి చూశాడు నారదుడు. కొండంతటినీ ఆక్రమించుకుని ఉన్న బూరుగు చెట్టు కనిపించిందతనికి. ఆశ్చర్యపోయాడు. కిందికి దిగి, చెట్టును సమీపించాడు. ఇలా అన్నాడు.‘అబ్బబ్బ! ఎంత పెద్దచెట్టువి! ఇంత వైశాల్యం, పొడువున్న చెట్టుని నేను ముల్లోకాల్లోనూ చూడలేదు. పైగా నిన్నాశ్రయించి ఎన్నో జంతువులూ, పక్షులూ బతుకుతున్నాయి. బాగుంది. బాగుంది’గర్వంగా కొమ్మలూపింది చెట్టు.‘నాదో చిన్న ప్రశ్న బూరుగా! ఏమనుకోకుండా సమాధానం చెబుతావా’ అడిగాడు నారదుడు.‘అడగండి మహర్షీ’‘మరేం లేదు. వాయుదేవునికీ నీకూ స్నేహం ఏమయినా ఉందా? ఉండబట్టేనేమో నీ కొమ్మలూ రెమ్మలూ క్షేమంగా ఉంటున్నాయి. లేకపోతే విరిగిపోయేవి కదా! నిజం చెప్పు’ అడిగాడు నారదుడు.‘స్నేహ మా పాడా? ఏం లేదు ఇద్దరికీ. కాకపోతే నీకు తెలియనిదేముంది? నా శక్తిలో పద్దెనిమిద వంతుతో కూడా వాయుదేవుడు పోటీ పడలేడు. అందుకే ఆతని మానాన ఆతను, నా మానాన నేనూ ఉంటున్నాం. నిజం చెప్పాలంటే, వాయుదేవుణ్ణి చూస్తే ఒకొక్కసారి నాకు నవ్వొస్తుంది. ’ అన్నది బూరుగు.

‘నవ్వెందుకో’‘నన్నేదో చేద్దామని అప్పుడప్పుడూ నానా పాట్లూ పడతాడు. చెల్లవు. ఆకు కూడా రాల్చలేడు. అందుకే నవ్వుకుంటాను.’ అన్నది బూరుగు. కొమ్మల్ని సాచి ఆకాశంలోనికి పోనిచ్చింది. ‘చూడు నా ప్రతాపం’ అన్నట్టుగా ప్రవర్తించింది. బూరుగుకి గర్వం హెచ్చనుకున్నాడు నారదుడు. ఇలా అన్నాడు.‘ఎంతయినా వాయుదేవుణ్ణి నువ్వు కించపరుస్తూ మాట్లాడడం బాగా లేదు. అతను తలచుకుంటే కొండలకి కొండలే లేచిపోతాయి. పండుటాకుల్లా పల్టీలు కొడతాయి. అంతెందుకు? గాలి లేకపోతే నువ్వూ నేనూ మనందరం జీవించగలమా? అసలు ప్రయాణించగలమా?’ అడిగాడు నారదుడు.‘జీవించడం జీవించకపోవడం సంగతి అటుంచు మహర్షి. దానికి ముందేమన్నారు? వాయుదేవుడు తలచుకుంటే కొండలకి కొండలే లేచిపోతాయా! నిజమేనేమో! కొండలు లేచిపోవచ్చేమో, నేను మాత్రం కదలను. నన్ను తాకి చూడమనండి. ‘ప్రభంజనం’ అన్న బిరుదు పోగొట్టుకుంటాడు.’ అన్నది బూరుగు. పెద్దగొంతుతో అరిచినట్టుగా మాట్లాడింది.‘గొంతు తగ్గించవయ్యా! వాయుదేవుడు విన్నాడంటే లేనిపోని గొడవ. పైగా అతని బిరుదే పోతుందంటున్నావు. ప్రమాదం సుమా! నోరు పారేసుకోకు’ అన్నాడు నారదుడు.‘వస్తాను’ అంటూ అక్కణ్ణుంచి బయల్దేరి తిన్నగా వాయుదేవుణ్ణి సమీపించాడు. తనకూ, బూరుగు చెట్టుకూ జరిగిన సంభాషణంతా చెప్పాడతనికి. చెప్పడమే ఆలస్యం, వాయుదేవుడికి చెప్పలేనంత కోపం వచ్చింది. వెనువెంటనే బూరుగుచెట్టుని చుట్టుముట్టి ఇలా అన్నాడు.

‘ఏమన్నావు? నీ ఆకు కూడా నేను రాల్చలేనా? నిన్ను చుట్టుముడితే నా బిరుదుకే ప్రమాదమా? బాగా గర్వించి ఉన్నావు. అనుభవిస్తావు. త్వరలోనే నీ అంతు చూస్తాను, చూడు’లెక్క చేయలేదు బూరుగు. మరింతగా బిర్రబిగిసింది.‘నా అంతు ఏం చూస్తావు? నేనంత బలహీనుణ్ణి కాను. ముల్లోకాల్లోనూ నా అంత బలమైన చెట్టు లేదు, ముందా సంగతి తెలుసుకో’ అంది బూరుగు. అంత కోపంలోనూ పగలబడి నవ్వాడు వాయుదేవుడు. బూరుగు మాటలకి అతను నవ్వును ఆపులేకపోయాడు.‘ఒకప్పుడు బ్రహ్మదేవుడు కాస్సేపు నీ నీడలో విశ్రమించాడు. ఆ దేవుడు నీ నీడను కోరుకున్నాడు కాబట్టి నిన్నాళ్ళూ గౌరవించాను. నీ ఆకును కూడా రాల్చకపోవడానికి కారణం అదే! అంతేకాని, నిన్నేమీ చేయలేక కాదు. ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోయావు. రెచ్చిపోతున్నావు. అనుభవిస్తావు, చూడు’ అన్నాడు వాయుదేవుడు. అక్కణ్ణుంచి వచ్చినంత వేగంగానే వెళ్ళిపోయాడు.ఆలోచనలో పడింది బూరుగు.జరిగిందేమిటి? నారదుడు వచ్చి నన్ను పొగిడాడు. పొగడగానే నేను పొంగిపోయాను. పొంగిపోయి స్థాయికి మించిన మాటలాడాను. వాయుదేవుణ్ణి లెక్క చేయనన్నాను. వాయుదేవుడొచ్చాడు. గర్వంతో ఉన్నావు, తప్పన్నాడు. త్వరలోనే అంతు చూస్తానన్నాడు. అప్పడయినా లొంగి ఉన్నానా? లేదు. మరింత రెచ్చిపోయి మాట్లాడి, మనుగడకే ప్రమాదం తెచ్చుకున్నాను. నా బలం ఎక్కడ? వాయుదేవుని బలమెక్కడ? ఆ దేవుని బలం ముందు నేను నిలబడగలనా? అతను తలచుకున్నాడంటే కూకటి వేళ్ళతో నన్ను పెళ్ళగించేస్తాడు. ఇప్పుడేది దారి. ఏం చేస్తే బాగుంటుంది?