అర్జున బభ్రువాహన సంగ్రామం

సింధు దేశాన్ని విడచి, మణిపురవరం చేరుకున్నది అశ్వమేధాశ్వం. నగరాధిపతి బభ్రువాహనుడు, వేగుల ద్వారా ఆ సంగతి తెలుసుకున్నాడు. తండ్రి అర్జునుడు,తన నగరానికి వస్తున్నాడని తెలిసి ఆనందించాడు. పుర ప్రముఖులతో కలసి ఎదురేగాడు.తండ్రిని అల్లంత దూరంలో చూడగానే చేతులు జోడించాడు. దగ్గరగా వచ్చిన తండ్రి పాదాల మీద పడ్డాడు. పుత్రుడు బభ్రువాహనుడు అలా తన కాళ్ళ మీద పడడం అర్జునునికి నచ్చలేదు. అతన్ని అసహ్యంగా చూసి, ముందుకు కదలిపోయాడు. తండ్రి తనని చేరదీయలేదు, పైగా తనని అసహ్యించుకున్నాడు. తప్పేం చేశాడు తను? కోపం వచ్చింది బభ్రువాహనుడికి. అయినా కోపాన్ని దిగమింగుకున్నాడు. వెళ్ళిపోతున్న తండ్రిని చూడసాగాడు. అంతలో అర్జునుని రథం ఆగింది.‘‘రాకుమారా’’ కేకేశాడు అర్జునుడు. పరుగున చేరుకున్నాడక్కడికి బభ్రువాహనుడు.‘‘నీలాంటి రాకుమారులు అశ్వమేధ తురంగమాన్ని అడ్డుకోవాలి. బంధించాలి. బంధించి రారమ్మని యుద్ధానికి పిలవాలి. అంతేకాని, రాజుల పాదాల మీద పడి, నమస్కరించడం సిగ్గుచేటు. యువకుడివి. యుద్ధాన్ని ఆహ్వానించాలి. అది రాజధర్మం. ఆ ధర్మాన్ని కాదని కాళ్ళ మీద పడడం...ఛిఛీ! పిరికిపందల పని చేశావు. నీ ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంది.’’ అన్నాడు అర్జునుడు.

సారథితో రథాన్ని వేగంగా ముందుకు పోనిమ్మన్నాడు. వెళ్ళిపోయాడక్కణ్ణుంచి. వెళ్ళిపోతున్న తండ్రిని ఏమనాలో తోచక, చేతులు కట్టుకుని ఆలోచిస్తూ రాజభవనానికి చేరుకున్నాడు బభ్రువాహనుడు.జరిగిందంతా దివ్యదృష్టితో తెలుసుకుంది ఉలూచి. ఆమె నాగేంద్రుడు కౌరవ్యుని కూతురు. పాతాళం నుంచి పైకి వచ్చింది. బభ్రువాహనుణ్ణి సమీపించింది.‘‘నాయనా’’ పిలిచింది.‘‘ఎవరమ్మా నువ్వు?’’ అడిగాడు బభ్రువాహనుడు.‘‘నా పేరు ఉలూచి. నేను, నాగేంద్రుని కుమార్తెను. నీ కష్టం తెలుసుకున్నాను. నీకు మంచి చెబుదామని వచ్చాను. నీ తండ్రి అర్జునుడు అన్న మాటలు నిజం. అతను కోరుకున్నట్టుగానే యుద్ధానికి సిద్ధమవ్వు. యజ్ఞాశ్వాన్ని బంధించు. నీ తండ్రి కోరిక తీర్చు.’’‘‘తండ్రితో యుద్ధం సముచితం కాదు తల్లీ.’’ అన్నాడు బభ్రువాహనుడు.‘‘ఆ సంగతి దృష్టిలో పెట్టుకునే తండ్రి నన్ను కవ్వించినా కదనానికి కాలు దువ్వలేదు. లేకపోతే...’’ అంటూ పిడికిలి బిగించాడు బభ్రువాహనుడు.‘‘నీ తండ్రి నీలో కోరుకున్నది ఈ ఆవేశాన్నే! ఆలోచించకు. వెళ్ళు, తండ్రితో తనయుని యుద్ధం చూడచక్కగా ఉంటుంది. విజయోస్తు.’’ అంది ఉలూచి. దీవించింది అతన్ని.

‘‘తండ్రికి కావాల్సింది యుద్ధమే! నువ్వు కూడా నా శ్రేయస్సు కోరి, యుద్ధానికి సిద్ధమవమంటున్నావు. మీ ఇద్దరికీ ఆనందాన్ని కలిగిస్తాను. యుద్ధభూమిలో అర్జునుని ఇదిగో, ఇప్పుడే ఎదుర్కొంటాను.’’ అన్నాడు బభ్రువాహనుడు. సమర సన్నద్ధుడై ముందుకురికాడు. హంసకేతనంతో రథాన్ని పరుగులు పెట్టించాడు. అతన్ని అనుసరించాయి చతురంగబలాలు.అడుగో అర్జునుడన్నారు. అంతే! అతనికి ఎదురు నిలిచాడు బభ్రువాహనుడు. బాణాలను పుంఖానుపుంఖంగా ప్రయోగించాడు. కొడుకు యుద్ధకౌశలాన్ని మెచ్చుకుంటూ అతని బాణాల్ని ముక్కలు ముక్కలు చేయసాగాడు అర్జునుడు. తర్వాత పదహారు బాణాలు ప్రయోగించి, బభ్రువాహనుణ్ణి తీవ్రంగా నొప్పించాడు. గుచ్చుకున్న బాణాల్ని ఇట్టే తొలగించుకుని, తండ్రి మీద ఇరవై బాణాల్ని ప్రయోగించాడు బభ్రువాహనుడు. పెద్దపెట్టున గర్జించాడు. ఆ గర్జనకు ఆనందించాడు అర్జునుడు. గురి చూసి, తనయుని హంసకేతనాన్ని కూల్చి వేశాడు. తర్వాత మరికొన్ని బాణాలతో బభ్రువాహనుణ్ణి తీవ్ర గాయాలపాల్జేశాడు. గాయాలపాలయినా బెదిరిపోలేదు బభ్రువాహనుడు. పైగా రెట్టించిన కోపంతో భయంకరమైన బాణాన్ని ప్రయోగించాడు. అది అర్జునుని పార్శ్వంలోంచి దూసుకుని పోయింది. దాని వేగానికి అర్జునుడు తూలిపడబోయాడు. గాండీవాన్ని ఆసరా చేసుకుని నిల్చున్నాడు. ఇలా అనుకున్నాడు.అద్భుతం! బాణప్రయోగంలో బభ్రువాహనుడు నన్నే మించాడు.‘‘బభ్రువాహనా! నేను ప్రయోగించే మహోగ్రబాణాలకు బెదరకుండా చెదరకుండా నిల్చోవాలి. నిల్చోగలవా?‘‘ ప్రశ్నించాడు అర్జునుడు. కొడుకు నుంచి సమాధానం రానేలేదు, పుంఖాను పుంఖంగా విద్యుద్వేగంతో బాణప్రయోగం చేశాడు అర్జునుడు. వాటిని ఆకాశంలోనే తుత్తునియలు చేశాడు బభ్రువాహనుడు. ప్రయోగించిన ఓ బాణమూ బభ్రువాహనుణ్ణి డీకొనలేకపోతోంది. తట్టుకోలేకపోయాడు అర్జునుడు. మహావేగంతో గుప్పెడు బాణాలు ప్రయోగించి, బభ్రువాహనుణ్ణి గాయాలపాల్జేశాడు. నెత్తురోడుతున్న తన శరీరాన్ని చూసుకున్నాడు బభ్రువాహనుడు. ఆవేశాన్ని అణచుకోలేకపోయాడు. వజ్రం వంటి బాణాన్ని గురి చూసి అర్జునుని మీద ప్రయోగించాడు. ప్రయోగించిన మరుక్షణంలోనే ఆ బాణం అర్జునుని విశాల వక్షస్థలాన్ని చీల్చుకుని, వీపు వైపు నుండి దూసుకుపోయింది.