ధర్మజుని ఆత్మలో విదురుని ప్రవేశం

గాంధారీదేవి, ధృతరాష్ట్రుడు, సంజయ విదురులు అరణ్యవాసం చేసేందుకు హస్తినాపురం పొలిమేరలు దాటారు. వారికి కూతవేటు దూరంలో నిలిచింది కుంతీదేవి. తాను కూడా అరణ్యవాసాన్ని ఆశిస్తున్నట్టుగా చెప్పి, అందుకు అనుమతించమని ధర్మరాజాదులను అర్థించిందామె. వినలేదెవరూ. పైగా భీముడు తల్లిని ఎత్తిపొడిచాడు. రాజ్యం వీరభోజ్యం అని చెప్పి, యుద్ధం అనివార్యమని బోధించి, రాజ్యాన్ని చేజిక్కించుకున్న అనంతరం, సుఖంగా జీవించక అరణ్యాల పాలవుతావేమిటి అని ప్రశ్నించాడు. ఆ మాటలకి కోపగించుకుంది కుంతీదేవి. తానెందుకు కౌరవులతో యుద్ధం చేయమన్నదీ వరుస కారణాలు చెప్పుకొచ్చింది. వింటూ నిల్చున్నారంతా. కన్నీరు పెట్టుకుని తననే దీనంగా చూస్తున్న ద్రౌపదిని గమనించింది కుంతీదేవి. ఇలా అంది భీముడితో.‘‘మహా గౌరవంతో తులతూగుతున్న ఈ సుకుమారి పాంచాలిని దుశ్శాసనుడు నిండు సభలో కొప్పుపట్టి ఈడ్చినప్పుడు, అక్కడి పెద్దలు నోరు మెదపకపోవడం చూసి, పాండురాజు వంశానికి తీరని కళంకం ఏర్పడుతోందన్న బాధతో యుద్ధం చెయ్యమన్నాను. అంతేగాని సామ్రాజ్య భోగాల కోసం నేనెప్పుడూ తాపత్రయ పడలేదు.’’భీముణ్ణి ఎర్రగా చూసిందామె.‘‘నా గురించి తెలియక మాట్లాడావు. తప్పు. తల్లినయినా ఎత్తిపొడిచి మాట్లాడడం మంచిది కాదు. శాంతించు.’’ హెచ్చరించింది భీముణ్ణి.

సిగ్గుతో తల వంచుకున్నాడు భీముడు. కండబలం తప్ప, గుండెబలం లేని భీముడు అలా తల వంచుకుని తప్పు చేసిన వాడిలా నిల్చోవడాన్ని తట్టుకోలేకపోయింది కుంతీదేవి. పరుగున వచ్చింది. అతని శిరసు నిమిరి దగ్గరగా తీసుకుంది.‘‘బాధపడకు నాయనా’’ అని ఓదార్చింది.‘‘భోగభాగ్యాల మీద నాకే మాత్రం ఆశ లేదు తండ్రీ! ఏనాడూ లేదు. ఈనాడు ఉన్నది ఒకటే ఆశ. సంపూర్ణ తపస్సుతో ఉత్తమగతిని ఆశిస్తున్నాను. అనుమతించు.’’ అన్నది. తర్వాత అందర్నీ కలియజూసింది. ఇలా అంది.‘‘అన్నపానాలు మాని అహర్నిశలూ తపస్సాచరించాలని ఉంది.అందుకు మీరంతా అంగీకరించాలి. తప్పదు.’’ అని వేడుకుంది.కుంతీదేవి అరణ్యవాసానికి సమాయత్తం కావడం, కుమారులు అందుకు ఒప్పుకోకపోవడం అంతా విన్నాడు ధృతరాష్ట్రుడు. సంజయ విదురులను దగ్గరగా పిలిచాడు. వచ్చిన వారితో ఇలా అన్నాడు.‘‘పిల్లలు వద్దంటుంటే, పట్టుబట్టి మరీ అరణ్యవాసాన్ని కుంతీదేవి కోరుకోవడం, పద్ధతి కాదు. మనసు మార్చుకోమని నా మాటగా ఆ సాధ్వికి చెప్పండి.’’‘‘సరే మహారాజా’’ అన్నారిద్దరూ. వెను తిరిగి కుంతీదేవిని సమీపించారు. ధృతరాష్ట్రుని వేడుకోలుని వివరించారు. వినలేదు కుంతీదేవి. అరణ్యవాసం తప్ప అన్యధా తాను కోరిందేమీ లేదన్నది. పాండవుల్ని, వారి పత్నీమణుల్ని, బంధువులని కలియజూసింది. చేతులు జోడించింది.‘‘దయచేసి అంతా తిరిగి వెళ్ళిపోండి, నన్ను వనగమనానికి అనుమతించండి.’’ అన్నది. ఇక ఆమె మాట మారదని తెలుసుకున్న ధర్మరాజాదులు కుంతీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. ఆమె పాదాలకు సాష్టాంగ ప్రణామాలు చేశారు. అందరినీ ఆశీర్వదించి, సంజయ విదురుల సహా గాంధారీదేవి, ధృతరాష్ట్రులను కలిసింది కుంతీదేవి. వారితో పాటుగా ముందుకు నడిచింది.అంతఃపుర కాంతలు, పరివారం సహా పాండవులు హస్తినాపురికి చేరుకున్నారు. యథావిధిగా రాజ్యకార్య నిర్వహణలో తలమునకలయ్యారు.

అగ్నిహోత్రాలతో తమను అనుసరిస్తున్న ఋత్విజులతో ధృతరాష్ట్రాదులు నడిచి నడిచి భాగీరథీ నదీతీరానికి చేరుకున్నారు. అక్కడ ఏకాంత ప్రదేశంలో విశ్రమించారంతా. మర్నాడు నది దాటి అవతలి తీరం చేరుకున్నారు. కురుక్షేత్రంలోకి ప్రవేశించారు. అక్కడ ఓ పుణ్యాశ్రమ సమీపంలో చెట్ల నీడన కూర్చున్నారంతా.ధృతరాష్ట్ర మహారాజు పరివార సహితుడై తన ఆశ్రమానికి అల్లంత దూరంలో ఉన్నాడని తెలిసి, శతయూప రాజర్షి చేరుకున్నాడక్కడకి. వారందరికీ అర్ఘ్యపాద్యాదులు సమర్పించాడు. వచ్చి, తన ఆశ్రమంలో నివసించాల్సిందిగా ప్రార్థించాడు. అందుకు అంగీకరించాడు ధృతరాష్ట్రుడు. వెనువెంటనే పర్ణశాలల నిర్మాణం జరిగింది. అంతా కుటీరాల్లో నెలవేర్పర్చుకున్నారు. క్రమ క్రమంగా తీవ్ర తపశ్చర్య ప్రారంభించారు. ధృతరాష్ట్రుని అపూర్వ తపస్సు గమనించి, అక్కడి మునీశ్వరులంతా ఆశ్చర్యపోయారు. ఆనాటికానాటికి ధృతరాష్ట్రుని శరీరం శల్యావశిష్టం అయింది. ఆతని ఎముకుల గూడు స్పష్టంగా కనిపించసాగింది. ఆ సమయంలో నారద పర్వత దేవల మౌంజాయనలు ఆతన్ని సందర్శించారు. ధృతరాష్ట్రుడు వారందరికీ సాష్టాంగ నమస్కృతులు ఆచరించాడు. మంగళాశీర్వచనాలు అందుకున్నాడు. తర్వాత మాటల్లో మాటగా నారదుడు ఇలా అన్నాడు.