శ్రీకృష్ణ నిర్యాణం

సాగరతీరాన ఉన్న యాదవస్త్రీలందరినీ అంతఃపురానికి చేర్చాడు కృష్ణుడు. వారి యోగక్షేమాలను మర్నాడు అక్కడికి రానున్న అర్జునుడు చూస్తాడని తెలిపి, అరణ్యప్రవేశం చేశాడతను. అన్న బలరాముణ్ణి చూశాడు. పలకరించాడతన్ని. బలరాముడు దగ్గర నుంచి బదులు లేదు. అతను కనులు మూసుకుని, ధ్యానంలో ఉన్నట్టుగా ఉన్నాడు. అప్పుడు జరిగింది ఆ అద్భుతం.ఎర్రెర్రగా వేయి నాలుకలతో ఒక పెద్దపాము బలరాముని ముఖం నుండి వెలువడింది. వేయి తలలతో విరాజిల్లింది. కొండలాంటి శరీరంతో కదలి కదలి అదృశ్యమయిపోయింది. అదే సమయంలో యోగశక్తితో బలరాముడు మానవశరీరాన్ని వదలి ఆకాశంలోకి ప్రవేశించాడు. బలరాముడి రాకను గమనించాడు వరుణదేవుడు. నాగ ప్రముఖులతో ఎదురొచ్చాడు. ఆహ్వానం పలికాడతనికి. వాసుకి, కర్కోటకుడు, తక్షకుడు, వరుణుడు,కుంజరుడు, కుముదుడు, దుర్ముఖుడు, పృథుశ్రవుడు, హ్రాదుడు, వక్రదంతుడు, క్రోధుడు, శంఖుడు, పుండరీకుడు, మిశ్రి మొదలయిన నాగ ప్రముఖుల్ని చూసి, చిరునవ్వు నవ్వాడు బలరాముడు. గంగ, యుమునలు కూడా మనోజ్ఞ మహిళా స్వరూపంతో బలరామునికి హారతి పట్టాయి. అల్లంత దూరాన ఉన్న అనంతదేవుడు, బలరాముణ్ణి బాహుబంధంలో బంధించాడు. తనలో అతన్ని విలీనం చేసుకున్నాడు.జరిగిందంతా దివ్యదృష్టితో తెలుసుకున్నాడు కృష్ణుడు. కన్నీరు పెట్టుకున్నాడు. అన్న లేడు. కన్న సంతానం అంతా కనుమరుగయిపోయింది.

దిక్కులేని వాణ్ణనుకుంటూ అడవి అంతటా పిచ్చివాడిలా పరిభ్రమించాడు కృష్ణుడు. తర్వాత తన అవతారం ప్రయోజనం నెరవేరినదని తెలుసుకున్నాడు. మునీంద్రుల శాపవృత్తాంతం గుర్తు చేసుకున్నాడు. దూర్వాస మహర్షి శాపవృత్తాంతం కూడా జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. దూర్వాసుని శరీరానికంతటికీ తను పాయసం పూశాడు. అరికాలికి మరచిపోయాడు. ఆ భాగంలోనే ప్రాణానికి ముప్పు ఉన్నదని శపించాడు ఆ మహర్షి. శాపం ఫలించక తప్పదనుకున్నాడు కృష్ణుడు. నడచి నడచి అలసిపోయాడేమో! చదునుగా ఉన్న చోట శయనించాడు. ఇంద్రియాలను నిగ్రహించాడు. ధ్యానమగ్నుడయ్యాడు. కాస్సేపటికి జర చేరుకుందక్కడికి. అటూ ఇటూ సంచరిస్తున్న ఓ వేటగాడికి విభ్రాంతి కలిగించింది. ఫలితంగా శయనించి ఉన్న శ్రీకృష్ణుణ్ణి, లేడిగా తలచాడు వేటగాడు. మంచి వేట దొరికింది అనుకున్నాడు. బాణాన్ని సంధించాడు. గురి చూసి వదిలాడు. మహావేగంతో ఆ బాణం ప్రయాణించి ప్రయాణించి కృష్ణుని పాదంలో గుచ్చుకుని, వెలికొచ్చింది.దెబ్బకి లేడి చచ్చి ఉంటుందనుకుని, పరుగుదీశాడక్కడికి వేటగాడు. శయనించి ఉన్న కృష్ణుణ్ణి చూశాడు. అతని కాలికి అయిన గాయం చూశాడు. గోలు గోలున విలపించాడు.‘‘ఇందులో నీ తప్పు ఎంతమాత్రం లేదు. ఇది దూర్వాస మహర్షి శాపం.’’ అన్నాడు కృష్ణుడు.

వేటగాణ్ణి ఓదార్చాడు. నవ్వుతూ శరీరాన్ని పరిత్యజించాడు. వెలుగులీనుతూ ఓ దివ్యకాంతి నిష్క్రమించింది అక్కణ్ణుంచి. దివ్యధామంలో ప్రవే శించింది. దేవదేవుడు వస్తున్నాడని తెలుసుకుని, దేవేంద్రుడు సహా మునీంద్రులు, సిద్ధులు, సాధ్యులు, రుద్రులు, వసువులు, ఆదిత్యులు, విశ్వేదేవతలంతా ఎదురేగారు. స్వామికి సాష్టాంగ నమస్కృతులు ఆచరించారు. దేవేంద్రుడు నమస్కరించి ఇలా అన్నాడు.‘‘దేవాధిదేవా! కరుణే ప్రధానంగా భూలోకంలో జన్మించి, కంసాది దురాత్ములను నిర్మూలించావు. భరతకుల కళంకాన్ని కూడా తొలగించావు. నీ దివ్యధామం అజరామరం. అవ్యయం. అత్యంత నిర్మలం. వేదైక వేద్యం. నీ దివ్యధామానికి నువ్వు చేరుకో! ఆర్త నివారణ కోసం మళ్ళీ భూతలిపై అవతరింతువుగాని.’’ఆకాశం వైపు చూశాడు దేవేంద్రుడు. ఆనతినిచ్చాడేమో! దివ్యపుష్పాలు వర్షంలా విష్ణుదేవుని మీద పడ్డాయి. అంతలో అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చాడు. వస్తూనే విష్ణుదేవుని పాదాలనంటి, నమస్కరించాడు. వేద సూక్తులతో వేవిధాల ప్రస్తుతించాడు.‘‘అనిరుద్ధము, ప్రద్యుమ్నము, సంకర్షణము, వాసుదేవము అన్న నాలుగు రూపాలకూ ఏకత సమకూర్చుకున్నాను. నా మంగళధామానికి నేను చేరుకోవాల్సి ఉంది. ఇక సెలవు. మీ అందరికీ సుఖానుభూతులు సంప్రాప్తించుగాక.’’ అన్నాడు విష్ణుదేవుడు. చూస్తూండగానే తన దివ్యధామం చేరుకున్నాడతను.తన ధామానికి విష్ణుదేవుడు చేరుకోక మునుపే దారుకుడు పాండవుల్ని సమీపించాడు. మునుల శాపం, ముసలం సంగతీ వివరించాడు వారికి. యాదవులంతా మరణించారని చెప్పాడు. బలరామకృష్ణులు మాత్రం జీవించి ఉన్నారన్నాడు. ఆ దుర్వార్తలకు ధర్మరాజు సహా అంతా కలత చెందారు. కన్నీరు పెట్టుకున్నారు. అర్జునునితో ఇలా అన్నాడు దారుకుడు.