మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం....సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు.వీధిలో జనసంచారం తక్కువగా ఉంది.ఢిల్లీలోని అశోక్‌ విహార్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆ సమయంలో ఇన్‌స్పెక్టర్‌ అభయ్‌ సింగ్‌ డ్యూటీలో ఉన్నాడు.ఆయన తన టేబుల్‌ ముందు కూర్చుని ఏవో పేపర్లు తిరగేస్తున్నాడు.సరిగ్గా అప్పుడే ఆయన టేబుల్‌ మీదున్న ఎర్రరంగు ఫోన్‌ మోగింది.‘‘హలో ఇన్‌స్పెక్టర్‌ అభయ్‌సింగ్‌ స్పీకింగ్‌’’ అన్నాడు.‘‘సారో! ఇక్కడ ఎవరో బాంబులు పెట్టినట్టున్నారు. మీరు వెంటనే రావాలి’’ అని అవతల నుంచి ఓ కంఠం కంగారుగా పలికింది.‍

‘‘హలో ఎక్కడ? కాస్త వివరంగా చెప్పండి. మీరెవరు?’’‘‘సార్‌! ఎక్స్‌–72 ఫ్లాటు ముందు ఓ నల్లరంగు అంబాసిడర్‌ కారు నిలబెట్టి ఉంది. దాని వెనుక సీట్లో ఏదో మూట కనిపిస్తోంది. ఇప్పటిదాకా ఎవరూ వచ్చి కారు తీసుకుని పోలేదు. మాకు అనుమానంగా ఉంది. మూటలో ఉన్నది బాంబా? శవమా? అని అక్కడ అందరూ మాట్లాడుకుంటున్నారు’’.‘‘ఇంతకీ మీరెవరు?’’‘‘నేనొక బాధ్యతగల పౌరుడ్ని సార్‌’’ అని అవతల వ్యక్తి ఠక్కుమని ఫోన్‌ పెట్టేశాడు.ఇన్‌స్పెక్టర్‌ అభయ్‌సింగ్‌ రిసీవర్‌ పెట్టేసి లేచి గబగబా బయటికి వచ్చాడు.అప్పటికే అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ జీపు సిద్ధం చెయ్యమని చెప్పటమూ, జీపు సిద్ధంగా గేటు బయట నిలబెట్టడం జరిగిపోయింది. ఇన్‌స్పెక్టర్‌ అభయ్‌సింగ్‌ తన అసిస్టెంట్‌తో పాటు నలుగురు కాని స్టేబుల్స్‌ను వెంటబెట్టుకుని ఘటనాస్థలికి హడావుడిగా బయలుదేరాడు.కొద్ది నిముషాల్లోనే పోలీస్‌ జీపు ఫోన్‌లో సూచించిన ప్రాంతాన్ని చేరుకుంది.

అక్కడ నిజంగానే నల్లరంగు అంబాసిడర్‌ కారు నిలబడి ఉంది. దాని డోర్లన్ని అద్దాల సహా లాక్‌ చేయబడి ఉన్నాయి. వెనుకసీటుపై ఒక పొడవాటి మూట పెట్టబడి ఉంది.ఇన్‌స్పెక్టర్‌ అభయ్‌సింగ్‌ జాగ్రత్తగా పరిశీలించాడు. మూట తీరు చూస్తే ఆయనకు ఎందుకో అది బాంబుల మూట కాక ఏదో శవం మూటగా అనిపించింది. ఆయన వెంటనే తాళాలు తెరిచే మనిషిని పిలిపించి కారు డోర్లు తీయించాడు.ఇన్‌స్పెక్టర్‌ అభయ్‌సింగ్‌ ఆదేశాల మేరకు కానిస్టేబుళ్ళు మూటను కిందికి దింపి దాన్ని విప్పారు. లోపలున్న శవాన్ని చూడగానే ఉలిక్కిపడ్డారు. అప్పటికే అక్కడికి చుట్టుపక్కల జనం గుమిగూడారు. వారెవరూ ఆ శవాన్ని గుర్తించలేకపోయారు.