సమయం ఉదయం పదిగంటలు.రమేశ్‌సాగర్‌ ఫ్లాటు తలుపులు విరగ్గొట్టి లోపలికి అడుగు పెట్టబోయారు పోలీసులు.అంతటా వంటగ్యాస్‌ వాసన కమ్ముకుంది. దాంతో ఇన్స్‌పెక్టర్‌ సక్సేనా సహా పోలీసులందరూ అరగంటసేపు బయటే నిలబడిపోయారు. ఆ వాసన తగ్గాక లోనికి ప్రవేశించిన పోలీసులుడ్రాయింగ్‌రూంలో దృశ్యం చూసి నిర్ఘాంత పోయారు. గదిమధ్య రక్తంమడుగులో రమేశ్‌ భార్య రూపాలి శవం! ఆమె కాళ్ళ దగ్గర రమేశ్‌ శవం! ఆ శవాలకు నాలుగడుగుల దూరంలో గది గుమ్మంలో పదమూడేళ్ళ జ్యోతిశవం రక్తంతో తడిసిన ముద్దలా పడివుంది. రమేశ్‌ కూతురు జ్యోతి. లోపల బెడ్రూమ్‌లో రమేశ్‌ తల్లి మూలీబాయి, అతడి కుమారుడు జయేశ్‌ శవాలు మంచంమీదపడి ఉన్నాయి. కారిన రక్తంతో తడిసిపోయిన పరుపు, ఆ శవాలు..అక్కడ భయంకర దృశ్యం కనిపిస్తోంది.

ఇన్స్‌పెక్టర్‌ సక్సేనాలో కోపం, బాధ తన్నుకొచ్చాయి. ఐదుగురుహతుల తలలు దాదాపు ఒకేవిధంగా గాయపడి ఉన్నాయి. బలమైన వస్తువుతో ఒకేవ్యక్తి ఐదుగురి తలల్నీ పగులగొట్టి హత్యలుచేసి ఉండొచ్చని అనుమానించాడు సక్సేనా.కనీసం చిన్నఆధారమైనా సంపాదించాలనే పట్టుదలతో పోలీసులు ఆ ఇల్లంతా క్షుణ్ణంగా వెతికారు. బాత్‌రూమ్‌ మూల క్రికెట్‌బ్యాట్‌ కనిపించింది. దానిమీద అక్కడక్కడ రక్తపు మరకలు కనిపించాయి. బహుశా హంతకుడు బ్యాట్‌ను కడిగి అక్కడ వదిలేసి ఉంటాడని ఊహించారు.ఇంట్లో డబ్బు, బంగారం ఉంది.

హంతకుడు వాటిని తాకనూ కూడా తాకలేదు! అంటే మరి ఈ హత్యలు ఎందుకు జరిగినట్టు? వెంటనే ఫొటోగ్రాఫర్‌కీ, ఫోరెన్సిక్‌ డిపార్ట్‌మెంట్‌కీ ఫోన్‌చేశారు. శవ పంచనామాచేసి, ఐదు మృతదేహాలనూ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో ఐదుగురు హత్యకు గురైన సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. వాళ్ళను చూసేందుకు అక్కడిజనం తండోపతండాలుగా తరలివచ్చారు. కానీ ఆ బిల్డింగ్‌కుకొద్దిదూరంలోనే బ్యారికేడ్‌ నిర్మించి పోలీసులు వారిని రానివ్వకుండా అడ్డుకున్నారు.