ఊళ్ళో ఆ రోజు కూడా ఏదో భారీ ఊరేగింపు బయలుదేరింది.శ్యామల కూడా షాపింగ్‌ అని బయలుదేరింది. హెడ్‌పోస్టాఫీస్‌ దాటగానే ఎదురుగా వస్తున్న ఊరేగింపును చూసి కాస్త కంగారుపడింది. ముందుకు వెళ్ళడం కుదరదని చెప్పి ఆమెను అక్కడే దించేశాడు ఆటోడ్రైవర్‌.ఆమె నిస్సహాయంగా ఓ ఇంటి అరుగు ఎక్కి కిటికీ దగ్గరగా నిలబడింది.

హఠాత్తుగా కిటికీలోంచి ఓ వ్యక్తి ఆమెను పలకరించాడు.‘‘లోపలికి రండి శ్యామల’’శ్యామల ఆశ్చర్యపోయింది. తనను పేరుపెట్టి పిలుస్తున్న ఆ యువకుడికేసి ఆశ్చర్యంగా చూసింది.‘‘నేను మనోహర్‌! గుర్తుపట్టలేదా? ముందు లోపలికి రండి. ఊరేగింపులోని జనం మిమ్మల్ని తోసేస్తారు’’ అన్నాడు తలుపులు తెరిచి.శ్యామల ఇంట్లోకి అడుగు పెట్టంది.‘‘మీరు నన్నింకా గుర్తు పట్టినట్టులేదు. మీరు డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌లో ఉండగా నేను సెకెండ్‌ ఇయర్‌లో ఉండేవాడిని. మా చెల్లెలు హరిణి మీ క్లాసులోనే ఉండేది. తన కోసం వచ్చేవాడిని’’ అన్నాడు.ఆమెకు వెంటనే హరిణి గుర్తొచ్చింది. హరిణితోపాటు మనోహర్‌. ఆమె ముఖం సంతోషంతో విప్పారింది.ఆ తరువాత ఇద్దరూ కబుర్లలో పడ్డారు.

శ్యామల తన భర్తతో కలిసి ఏడేళ్ళుగా ఇదే ఊళ్ళో ఉంటున్నట్టు చెప్పింది. అతడి గురించి అడిగింది.‘‘ఇక్కడే ఓ ప్రైవేట్‌ ఫర్మ్‌లో పని చేస్తున్నాను. పెళ్ళయింది. ఇద్దరు పిల్లలు. మూడవ కాన్పుకు శ్రీమతి పుట్టింటికి వెళ్ళింది’’ అని మనోహర్‌ అన్నాడు.‘‘ఓహ్‌! చాలా సంతోషం’’ అని శ్యామల అన్నా ఆమె ముఖంలో ఏదో విచారం మనోహర్‌ దృష్టిని దాటిపోలేదు.‘‘మీకు పిల్లలు...’’ అన్నాడు. శ్యామల ముఖం వాడిపోయింది. ‘‘ఆ అదృష్టం నాకు లేదు’’ అంది విచారంగా.‘‘ఓ, సారీ, అయినా ఇప్పుడేం వయసు మించిపోయింది. ఒక్కోక్కసారి ఏడేళ్ళలో పిల్లలు పుడతారట’’ అన్నాడు.