బలుంబజారి అందమైన పట్టణమే కాక అందమైన పడుచు పిల్లలకు పేరు పడ్డ పట్టణం!అదే పట్టణంలో ఉంటున్న ఎమిలీ పాతికేళ్ళ పరువాల భారాలు మోస్తున్న అందాల రాశి!తీర్చిదిద్దినట్టున్న ఆమె శరీర సౌష్ఠవం చూపరులను అమాంతం ఆకర్షించేది.

ఓ ప్రైవేట్‌ కంపెనీలో టైపిస్ట్‌గా పనిచేస్తున్న ఎమిలీ ఇంకా అవివాహితురాలే.అదే ఫర్మ్‌లో ఫెడ్రిక్‌ సేల్స్‌ మేనేజర్‌గా పని చేస్తున్నాడు.ఫెడ్రిక్‌ వివాహితుడు. ఆ విషయం ఎమిలీకి తెలుసు.అయినా అతడి పట్ల కలిగిన ఇష్టాన్ని, ప్రేమను వదులుకోలేక పోయింది. అతడంటే ఆమె పడి చచ్చేది. దానికి కారణం ఫెడ్రిక్‌లో ఉండే అద్భుతమైన ఆకర్షణ. అతడ్ని చూసిన ఎలాంటి ఆడ పిల్ల అయినా అతని ఆకర్షణ నుంచి తప్పించుకోలేకపోయేది. ఆడవాళ్ళను క్షణాల్లో పరిచయం చేసుకుని వలలో వేసుకునే వాడు. అదేవిధంగా ఎమిలి అతడి వలలో పడింది.వారిద్దరి స్నేహం పార్కులు, సినిమాలు, క్లబ్బులు దాటి బెడ్‌రూం చేరుకుంది. వారిద్దరి మధ్య సంబంధానికి ఎమిలీ గర్భవతయ్యింది.అదే విషయాన్ని ఆమె ఫెడ్రిక్‌కు ఆనందంగా తెలియజేసింది.తనను వెంటనే పెళ్ళి చేసుకోమని కోరింది.అయితే పెళ్ళికి ఏ మాత్రం సిద్ధంగా లేని ఫెడ్రిక్‌ గుండెల్లో రాయి పడింది.

ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించసాగాడు.సరిగ్గా అలాంటి సమయంలోనే ఓ రోజు ఎమిలీ డైలీ న్యూస్‌ పేపర్‌ చూస్తుండగా ఓ ప్రకటన కనిపించింది.సముద్రపు ఒడ్డున ఉన్న ‘ఎవరెస్ట్‌ బూన్‌’ అనే ప్రాంతములో ఓ బంగ్లా ఖాళీగా ఉందని, అద్దె అతి చౌకని, బంగ్లా కావలసిన వాళ్ళు తమను సంప్రదించవచ్చని ఆ ఇంటి యజమాని ఇచ్చిన ప్రకటన అది.ఆ ప్రకటన చదివిన ఎమిలి తనను, ఫెడ్రిక్‌ను ఆ బంగ్లాలో ఒంటరిగా ఊహించుకుని కలల్లో తేలిపోయింది.ఆ బంగ్లా విషయం ఫెడ్రిక్‌కు తెలియజేసింది.రెండు రోజుల తరువాత వాళ్ళిద్దరూ ‘ఎవరెస్ట్‌ భూన్‌’కు బయలుదేరారు.అలా ఫెడ్రిక్‌తో పాటు వెళ్ళిన ఎమిలి మళ్ళీ తిరిగి రాలేదు! మిసెస్‌ ఫెడ్రిక్స్‌ మనస్సు బాధగా మూల్గింది.దానికి కారణం ఆ రోజు ఉదయం ఎవరెస్ట్‌ భూన్‌ నుంచి వచ్చిన ఓ టెలిగ్రామ్‌, మధ్యాహ్నం హోమ్స్‌ హాల్‌ నుంచి వచ్చిన మరో టెలిగ్రామ్‌. ఆ రెండు టెలిగ్రాములు ఆమె భర్త ఫెడ్రిక్‌ పంపినవే.