ఉదయం ఎనిమిది గంటల సమయం...ముజఫర్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ జాదవ్‌ డ్యూటీలో ఉన్నాడు.ఆయన ఎదుట ఉన్న ఫైలును దీక్షగా పరిశీలిస్తున్నాడు.సరిగ్గా ఆ సమయంలో శక్తిస్వరూప్‌ పార్క్‌ నైట్‌ వాచ్‌మెన్‌ రామ్‌సింగ్‌ పడుతూలేస్తూ పోలీస్‌ స్టేషన్‌లోకి అడుగుపెట్టాడు.‘‘సార్‌ మా పార్క్‌ వెనుక ఉన్న పొదల్లో ఒక మనిషి శవం పడి ఉంది. అతడి మెడ కోయబడి ఉంది. శరీరం పూర్తిగా కాలిపోయి ఉంది’’ అన్నాడు రామ్‌సింగ్‌.

ఆ సమయంలో సర్కిల్‌ ఇన్‌‍స్పెక్టర్‌ శర్మ స్టేషన్‌లో లేరు. సబ్‌ఇన్‌స్పెక్టర్‌ జాదవ్‌ వెంటనే కొందరు కానిస్టేబుల్స్‌ను వెంట బెట్టుకుని ఘటనా స్థలానికి చేరారు. అప్పటికే జనం అక్కడ జాతరగా గుంపుకట్టి ఉన్నారు. జీపు దిగిన సబ్‌ఇన్‌స్పెక్టర్‌ జాదవ్‌ రామ్‌సింగ్‌ దారి చూపు తుండగా గబగబా శవం దగ్గరికి నడిచాడు. కానిస్టేబుల్స్‌ అతడిని అనుసరించారు.సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ జాదవ్‌ శవాన్ని సూక్ష్మంగా పరిశీలించారు.శవం నేలమీద పడి ఉంది. మెడ నెవరో పదునైన కత్తితో కోసినట్టుగా చూడగానే తెలిసి పోతోంది. మృతుడిని గుర్తుపట్టడానికి వీల్లేనంతగా ముఖం కాలిపోయింది. మృతుడి ముఖా నికి గుడ్డలు చుట్టి, శరీరం మీద కట్టెలు పేర్చి కాల్చటానికి ప్రయత్నించినట్టు కనిపించింది. మృతుడికి దాదాపు నలభై ఏళ్ళుండవచ్చుని సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ జాదవ్‌ అంచనావేశాడు. సూక్ష్మంగా పరిశీలించిన ఇన్‌స్పెక్టర్‌ జాదవ్‌కు మృతుడి కుడిచేతి మీద ‘పువ్వు ఆకారం’ పచ్చబొట్టు గుర్తు ఉండటం కనిపించింది.

శవానికి దగ్గర్లో ఖాళీసారా సీసాలు కనిపించాయి. హతుడ్ని, హత్యాస్థలాన్ని సూక్ష్మంగా పరిశీలించాక హంతకులు ఒక ప్లాన్‌ ప్రకారం హతుడికి బాగా తాగించి, అతడు మత్తులో ఉండగా గొంతుకోసి చంపి ఉండాలని ఊహించాడు. హతుడిని గుర్తుపట్టకుండా ఉండటానికి శవాన్ని తగలబెట్టడానికి ప్రయత్నించి ఉంటారని అనుకున్నాడు.అప్పుడు జరిగిన పోలీసుల దర్యాప్తులో హతుడిని గుర్తించగలవాళ్ళెవరూ తటస్థపడలేదు.సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ జాదవ్‌ సూచనమేరకు హత్యాస్థలానికి చేరుకున్న పోలీసు ఫొటోగ్రాఫర్‌, వేలిముద్రల నిపుణులు తమ పనులు ముగించుకుని వెళ్ళిపోయాక శవపంచనామా జరిపించి శవాన్ని పోస్ట్‌మార్టంకై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ జాదవ్‌ పోలీసు స్టేషన్‌కు తిరిగి వచ్చాడు.