‘గట్టిగా వూపకరా అన్నయ్యా! కళ్లు తిరుగుతాయి’ అంటే.‘నీకెంత వూపాలో నాకింతప్పట్నుంచీ తెలుసే’ అన్నాడన్నయ్య. పుట్టినప్పటి నుంచి అన్నయ్యే వూపాడు వుయ్యాల! ఆ సంగతి మరిచిపోయి మాట్లాడింది తను.రైలు ప్రయాణం వుయ్యాల్లో వూగుతున్నట్లుగానే వుంది. సరదాగా, సుఖంగానే వుంది కానీ, ఏంటో బాధగా వుంది లక్ష్మికి. పదే పదే అన్నయ్య తలపునకు రావడాన్ని తట్టుకోలేకపోతోందామె. నిద్ర పట్టట్లేదు. లేచి కూర్చుంది. ముడుచుకొని కూర్చునేందుకు కాళ్లు మడుచుకుంటూ అటుగా చూసి ఆశ్చర్యపోయింది. కళ్లు పెద్దవి చేసుకొని భయపడ్డట్లుగా చూసింది.ఎవరో స్త్రీ.. ముఫ్పై, ముఫ్పై అయిదేళ్ల వయసుంటుంది. నైటీలో వుంది. సన్నగా వున్నా అందంగా వుంది. బ్రష్‌ చేస్తోందేమో! నోటినిండా టూత్‌ పేస్ట్‌ నురుగుంచుకొని లక్ష్మిని రమ్మంటున్నట్టుగా చేత్తో సైగ చేస్తు పిలుస్తోంది.ఎవరో తెలీదు! ఎందుకు పిలుస్తోందో తెలీదు. దాంతోనే ఆశ్చర్యపోయి భయపడ్డట్టుగా కళ్లు పెద్దవి చేసుకొని చూసింది లక్ష్మి. ఎందుకైనా మంచిదని తల మీద నుంచి దుప్పటి కపకొని, దుప్పటిలో కట్టి పడేసిన శవంలా పడుకున్న శకుంతలను లేపబోతుంటే ‘వద్దు వద్ద’న్నట్లుగా సైగ చేసి అమాంతం లక్ష్మి చేయందుకొని ముందుకి టాయ్‌లెట్స్‌ దగ్గరగా లాక్కొచ్చి, నోటిలోని నురగని అక్కడ వాష్‌బేసిన్లో ఉమ్మేసి, ‘ఎవరీవిడ? ఏంటిదంతా’ అన్నట్లుగా భయం భయంగా చూస్తోన్న లక్ష్మితో...

‘‘నా పేరు రాణి! రా చెప్తాను’’ అంటూ ఎస్‌ సిక్స్‌ కోచ్‌లోకి తీసుకొచ్చి అక్కడి డోర్‌ దగ్గరగా నిలబెట్టి, ‘‘కంగారు పడకు! అసలు సంగతేంటంటే...’’ అని రాణి ఏదో చెప్పబోతోంటే...‘‘ఏంటి మీరు! బలవంతంగా లాక్కొచ్చారు! వదలండి చెప్తాను’’ అని గింజుకొంటున్న లక్ష్మితో....‘‘వదిలితే ఛస్తావ్‌! చెప్పింది విను’’ అంది రాణి.‘‘ఎందుకు ఛస్తాను’’ మొండిగా అడిగింది లక్ష్మి.‘‘ఎందుకా? అది అదెవరనుకున్నావ్‌’’‘‘ఎవరు?’’‘‘ఎవరా? శకుంతల! ఆ శకుంతల ఎవరనుకుంటున్నావ్‌’’‘‘ఎవరు’’ శకుంతల పేరు చెప్పగానే కొంతలో కొంత మెత్తబడింది లక్ష్మి.‘‘పెద్ద బ్రోకర్‌! దానికి హైదరాబాద్‌ కృష్ణానగర్‌లో పెద్ద ఫ్లాటుంది.! అందులో నీలాంటి వాళ్లు ఆరేడుగురుంటారు’’అర్థం కాలేదు లక్ష్మికి. అలాగే చూసింది రాణిని.‘‘అర్థం కాలేదు కదూ? నీకు ..నీకెలా చెప్పాలి? అది... ఆ శకుంతల పెద్ద వేశ్య. దానికి కృష్ణానగర్‌లో పేద్ద వేశ్యాగృహం వుంది. నిన్ను అక్కడ వేశ్యని చెయ్యడానికే తీసుకెళ్తోంది’’ చెప్పింది రాణి.ఆ మాటలు విన్న లక్ష్మికి నోట మాట రాలేదు. చూపులో కూడా సూటిదనం చచ్చిపోయింది. గుడ్లప్పగించి అటెటో చూడసాగింది. అలా చూస్తోన్న లక్ష్మిని...‘‘ఏయ్‌! ఏయ్‌’’ అంటూ కుదిపి, తేరుకున్న లక్ష్మితో...‘‘అసలు సంగతి ఇప్పుడర్థమయిందా?’’ అడిగింది రాణి.‘‘అర్థమయింది కానీ... అసలింతకీ మీరు..మీరెవరు’’ అడిగింది లక్ష్మి.

‘‘నేనెవరన్నది తర్వాత నీకు వివరంగా చెప్తాను! ముందో పన్చెయ్‌’’‘‘ఏం చెయ్యమంటారు?’’‘‘నీ బెర్త్‌ దగ్గరకెళ్లి నీ సూట్‌కేస్‌ తీసుకొని రా! వచ్చే స్టేషన్లో నువ్వు నేనూ దిగిపోదాం’’‘‘దిగిపోయి...?’’‘‘ముందు దిగిపోదాం. తర్వాత సంగతి తర్వాత’’‘‘లేదు! నేనెట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్‌ వెళ్లాలి! సినిమా నటిని కావాలి’’‘‘ఈ పిచ్చితోనే పీకల మీదకి తెచ్చుకున్నావ్‌!చెప్పిన మాట విను! ముందు సూట్‌కేస్‌ తీసుకొనిరా’’‘‘అమ్మో! శకుంతల చూసిందంటే ఇంకేమైనా వుందా? నా వల్లకాదు.’’ భయపడింది లక్ష్మి.‘‘సరే!గుర్తులు చెప్పు! ఆ సూట్‌కేస్‌ని నేను తీసుకొస్తాను’’ అంది రాణి. లక్ష్మి గుర్తులు చెప్పింది.