అందం, గొప్పతనం ఉంటే, మనుషులనైనా, వస్తువులనైనా ప్రతివారూ సొంతం చేసుకోవాలనే కోరుకుంటారు. అయితే గొప్పతనం కలిగిన ప్రతీవాటినీ, గొప్పతనం కలిగిన ప్రతీవ్యక్తినీ మన సొంతం చేసుకోవడం కుదురుతుందా? డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులూ...వీళ్ళేనా గొప్పతనంగలవాళ్ళు. వీళ్ళందరినీ పోషించే అన్నదాత వాళ్ళకంటే గొప్పవాడు కాదా? ఈ కథలో పార్వతమ్మ తనకు కాబోయే కోడలు గురించి ఎలా ఆలోచించిందంటే..

‘‘అమ్మా! పది రూపాయలుంటే ఇవ్వవే. జేబులో అస్సలు రూపాయి కూడా లేదు’’అన్నంతిని కంచంలో చెయ్యి కడుగుతూ కొడుకు అడిగేసరికి తన చేతిలో కూడా డబ్బులు ఆడక వారంరోజులైందని పార్వతమ్మకు గుర్తుకొచ్చింది. ఎంగిలిపళ్ళెం ఎత్తి దొడ్లోకి వెళ్ళి కడిగి లోపలికితెచ్చి గోడకున్న కంచాలచిక్కులో పెట్టింది. అక్కడే నిలబడి ఉన్న కొడుకువంక ‘ఏమిటి..’ అన్నట్లు ప్రశ్నార్థకంగా చూసింది. కుడిచెయ్యి ముందుకు జాపి అరచెయ్యి తెరచి చూపించాడు అతను.‘‘నా కాడా లేవురా. బడికిపోతా పోతా, నే రమ్మన్నానని కోంటోల్ల యన్నపూస ఈశ్వరయ్యకు చెప్పిపో!’’ అని, గోడబీరువాలో వెన్నచట్టి మూతతెరచి చూసింది. కాస్త అటూ ఇటూ కిలో దాకా ఉండొచ్చు అనుకుని తృప్తిగా తలతిప్పి చూసేసరికి కొడుకు వంటింటి గడపదాటి హాల్లోకి వెళ్తున్నాడు.

వెన్నచట్టిమీద మళ్ళీమూతపెట్టి, బీరువా తలుపుమూసి ఇవతలికి వచ్చేసరికి హాల్లో కూచునున్న భర్త, ‘‘ఏరా పరమయ్య కూతురు ఎట్టుందిరా!’’ అని కొడుకును అడగటం, ‘‘ఆ! ఆ! పర్లేదు!’’ అని కొడుకు సమాధానం చెప్పడం వినపడింది. గబగబా హాల్లోకి వచ్చేసరికి తండ్రి కొడుకులు ఇద్దరూ వసారాలోకి వెళ్ళడం, ‘‘వస్తానమ్మా!’’ అని పెద్దగా అరచిచెపుతూ కొడుకు వీధిలోకి వెళ్ళడం జరిగిపోయింది.‘‘పరమయ్య కూతురు ఈ ఇంటి కోడలుగావటానికి సరిపోద్దనుకుంటున్నావా!’’ సందేహిస్తూ వరండాలోకి అడుగుపెడుతూ అన్నది.

‘‘ఎందుకు సరిపోదు? నాకు నువ్వు సరిపోలా?’’ అన్నాడు చిదంబరయ్య.‘‘నాకు దానికి సాపత్తెవా! నేనొచ్చాక నువ్‌ మనూరికి పెసిరెంటయ్యావ్‌!’’ ‘‘ఎత్తిపొడుపుగా అని లోపలికి వచ్చింది.నేను జెప్పేదీ అదేనే పిచ్చిమొకమా, నువ్వీ ఇంటికొచ్చాక నేను మనూరి సర్పంచ్‌ అయినట్టే పరమయ్యకూతుర్ని జేసుకొని నీ కొడుగ్గూడ మనూరిసర్పంచ్‌ గావాల’’. పార్వతమ్మను అనుసరించి లోపలికివస్తూ అనునయంగా అన్నాడు చిదంబరయ్య. ‘‘పరమయ్య బలగం కూడా శానపెద్దది. నీ కోసం మీ నాయన నాకు సపోర్టిచ్చినట్లే పరమయ్య తన బిడ్డకోసం తన జనాల్నందర్నీ మనోడియనక నిలపడా!’’ అర్ధోక్తిగా అన్నాడు.