కాలింగ్‌ బెల్‌ మోగేసరికి హాల్లోనే కూచున్న గోవింద్‌ లేచి తలుపుతీశాడు.ఎదురుగా ఒక స్త్రీ. గంజిపెట్టిన చీరె. చేతులో పర్సుతో దర్జాగా కనిపించింది.‘‘ఝాన్సీగారు పంపించారు’’. ఆ మాట విని ఆశ్చర్యం కలిగింది గోవింద్‌కి. పక్కకి తప్పుకుని ‘‘రండి’’ అన్నాడు మర్యాదగా. గదిలోకి తీసికెళ్ళి, ‘‘శాంతా ఆవిడ వచ్చారు’’ అన్నాడు.

ఇక అక్కడ తన పనేమీలేదు కాబట్టి ఇవతలికి వచ్చాడు.‘ఈవిడ ఆవిడేనా? లేకపోతే ఆవిడ గురించి వివరాలు చెప్పటానికి ఈవిడ వచ్చిందా?’ అని మనసులో ఓ మూల సందేహంగానే ఉంది. చూడగానే ఠీవిగా ‘లెక్చరరేమో’ అనిపించేలా ఉంది. సుమారు అరగంట తర్వాత గదిలోంచి బయటకువచ్చి గోవింద్‌ను చూసి ఓ నవ్వు నవ్వేసి వెళ్ళిపోయింది.గదిలోకి వెళ్ళాడు. శాంత వివరాలన్నీ చెప్పింది. ‘‘పొద్దున ఏడింటికి వస్తుంది. టిఫెన్‌, వంట చేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ సాయంత్రం ఐదింటికొచ్చి వంట చేస్తుంది. నెలకు పదిహేను వేలు’’.‘‘అమ్మో అంతే!’’ అన్నాడు.‘‘సరేలెండి. ఇంకా అంత ఇచ్చినా మనిషి దొరకడం లేదు. అదృష్టం బావుండి దొరికింది. రేపటి నుండి రమ్మన్నాను. మరి ఆరుగురం మనుషులం ఉన్నాం కదా!’’ అంది శాంత.

ఫోన్‌ చేసి కొడుకులకీ కోడళ్ళకీ చెప్పిందా శుభసమాచారం. అందరూ చాలా సంతోషించారు. హమ్మయ్య సమస్య తీరింది. ఇక డాక్టర్‌ దగ్గరికి వెళ్ళి డేట్‌ ఫిక్స్‌ చేయొచ్చు. అనుకున్నారు.ఇద్దరు కొడుకులు కోడళ్ళతో గోవింద్‌, శాంత అంతా కలిసే ఉంటారు. గోవింద్‌ రిటైరయ్యాడు. పిల్లలందరికీ ఉద్యోగాలు.శాంతకి మోకాళ్ళ నొప్పులు మొదలయ్యాయి. హోమియోపతి, అల్లోపతి, ఆయుర్వేదం అన్నీ వాడారు. అవేవీ లాభం లేదు. ఆపరేషన్‌ చెయ్యాల్సిందే అన్నాడు డాక్టర్లు.ఇంటి ఇల్లాలికి అనారోగ్యం అంటే మరి అది అత్యవసర పరిస్థితి. ఏ జ్వరమో వస్తేనే ఇల్లంతా అతలాకుతలమైపోతుంది. మరి మోకాళ్ళ ఆపరేషన్‌ అంటే సామాన్యం కాదు. కనీసం మరో ఇద్దరు మనుషులు ఉండాలి ఇల్లు గడవాలంటే. మరో పని మనిషి తేలిగ్గానే దొరికింది. కానీ వంటకే ఎవరూ కుదరలేదు. దాదాపు నెలరోజులుగా వెతుకుతున్నారు. ఆ మనిషి దొరకాలి. వీళ్ళు ముందుకు సాగాలి.