‘‘ఏమండి ! పేపర్‌లో మీ ఫొటో చాలాబాగా వచ్చింది. ఫుల్‌పేజి వేసారు. సన్మానం కూడా చాలా భారీ ఎత్తున చేస్తారేమో? పిల్లలు చూసేఉంటారేమోనండి. వస్తారంటారా?’’ అని సుమిత్ర చాలా ఆనందంగా అంది.. ‘‘అవును సుమిత్ర చాలా భారీగా చేసేటట్టు ఉన్నారు. వాళ్ళు చెపితే వినలేదు. నువ్వు వాళ్ళకే సపోర్ట్‌ చేసావు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమి చేసిన చేయించుకోవాలి. ఇక పిల్లల విషయం అంటావా? వాళ్ళు రేపిన గాయం ఇంకా మానలేదు. మళ్ళీ వాళ్ళను కలుసుకోవడం నాకు సుతారము ఇష్టం లేదు’’.

‘‘అవునండి వాళ్ళు మనతో మనుషుల్లాగా ఉండి ఉంటే మనం ఇలా ఉండేవాళ్ళం కాదేమో కానీ ఏది జరిగిన మన మంచికే అనుకోవాలి. దేవుడు మీకు పునర్జన్మను ఇచ్చింది ఈ మంచి పనికేనేమో? ఇప్పుడు నాకు వాళ్ళ ముఖాలు కూడా చూడబుద్ధి అవ్వడం లేదు.’’‘‘సరే నేను స్నానం చేసి వస్తాను లేట్‌ అవుతుంది’’ అని లోపలికి వెళ్ళాడు. మనసు పదకొండు ఏళ్ళ క్రితం ఈ సంఘటనలు మొదలు అయిన రోజుకు వెళ్ళింది. ఆ రోజు తను ఎలా మర్చిపోగలదు. ‘‘అమ్మ నేను ప్రెగ్నెంట్‌. ఇప్పుడే డాక్టర్‌ దగ్గరికి వెళ్లి వస్తున్నాం. ఇక మీరు పాస్‌పోర్ట్‌, వీసా కోసం ప్రయత్నాలు మొదలుపెట్టండి’’ అంది దీప్తి ఫోన్‌లో. ‘‘ఎంత మంచివార్త చెప్పావు తల్లి. అమ్మమ్మను చేస్తున్నావు. ఇంతకంటే ఏం కావాలి నాకు.

నీ ఆరోగ్యం జాగ్రత్త. కావాల్సినవన్నీ తిని సంతోషంగా ఉండు’’ అని ఫోన్‌ పెట్టేసింది. ‘‘ఏమండి మీరు తాతయ్య కాబోతున్నారు. ఇప్పుడే దీప్తి ఫోన్‌ చేసింది. పిల్ల అక్కడెక్కడో ఉంది. వెళ్లి చూసి వచ్చే దూరం కాదు. ఏదన్న చేసి పెట్టడానికి కూడా లేదు. అంతా కొత్త. ఎలా చేస్తుందో ఏమో?’’‘‘ఈ కాలం పిల్లలకు అన్ని తెలుసు సుమిత్ర. ఇక దూరం అంటావా అది ఏరి కోరి అమెరికా సంబంధం చేసుకుంది. దగ్గరలో ఏదన్న మంచి సంబంధం చూస్తాను అమ్మాయి మనకు పక్కనే ఉంటుంది అంటే ‘‘అన్నయ్యను మీ డబ్బు ఖర్చు పెట్టి అమెరికా పంపారు. నేను అమెరికా సంబంధం ఎందుకు చేసుకోకూడదు? అంతేలే నేను ఆడపిల్లనని చిన్నచూపు కదా! వాడు మగపిల్లవాడు కాబట్టి వాడికి ఎంతయినా ఖర్చు పెడతారు’’ అంటూ అమెరికా సంబంధం చేసుకుంది.’’