వాళ్ళిద్దరూ కంపెనీ కాన్ఫరెన్స్‌లో కలుసుకున్నారు. ఇద్దరిమధ్యా యవ్వనపు ఆకర్షణ. కళ్ళల్లోకి తదేకంగా చూసుకోవడం, చిరునవ్వుల పలకరింపులు, కలిసి లంచ్‌లూ..అంతేనా! అంతటితో ఆగలేదు, ఉద్యోగులంతా కూర్చున్న సమయంలో గులాబీ ఆమె చేతికిచ్చి ఐ లవ్యూ చెప్పేశాడు. ఆ మర్నాడే వాళ్ళిద్దరూ కలిసి ఓ చోటుకెళ్ళారు. అక్కడ బహుశా ఆమెకు ప్రపోజ్‌ చెయ్యడానికేనేమో మెల్లగా ఆమె చెవులదగ్గర తన పెదాలనుంచాడతను! అప్పుడు...అప్పుడు....!

******************************************

ఆమెకు ఇంకాస్త దగ్గరగా జరిగాడతడు.అతడి ఊపిరి ఆమె మెడపై వెచ్చగా తగులుతోంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది.‘‘మధురిమా... ఐ లవ్‌ యూ’’ఉలిక్కిపడి నిద్రలేచింది మధురిమ. మళ్ళీ అదే కల! గోడ గడియారం ఒంటిగంట కొట్టింది. గడియారం క్రింద ఉన్న డ్రెస్సింగ్‌ టేబుల్‌ అద్దం మీదికి మళ్ళింది ఆమె దృష్టి.‘‘దోషి!’’ అంటూ అద్దంలోని ఆమె ప్రతిబింబం ఆమెని నిందిస్తున్నట్టనిపించింది. గట్టిగా కళ్ళుమూసుకుని అరచేతులతో ముఖం కప్పుకుంది మధురిమ.

*******************************************

‘‘చెప్పండి’’ కళ్ళద్దాలు సవరించుకుంటూ అడిగింది డాక్టర్‌ మహిత.‘‘చెప్పడానికేమీ లేదు. మిమ్మల్ని తప్పకుండా కన్సల్ట్‌ చెయ్యాల్సిందే అన్నారు మా కంపెనీవారు. నేను మెంటల్లీ ఫిట్‌ అని మీరు సర్టిఫికెటు ఇచ్చేస్తే, నేను బయలుదేరతాను’’ సైకాలజిస్ట్‌ మహిత కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అంది మధురిమ.‘‘రిలాక్స్‌, మీరు మెంటల్లీ ఫిట్‌ అనడంలో నాకు సందేహం లేదు. ఇదిగో మీరు అడిగిన సర్టిఫికెట్‌ కూడా ఐదునిమిషాల్లో రెడీ అయిపోతుంది. కాకపోతే, మీకు చెయ్యని కౌన్సెలింగ్‌కి మీ ఆఫీసువారినుండి నేను డబ్బు తీసుకుంటే నా వృత్తిని అవమానించినట్టవుతుంది. కంపెనీవారు ఊరికే ఒక ఎంప్లాయ్‌ని కౌన్సెలింగ్‌కి పంపరు. మీ సెషన్లో ఇంకా యాభై నిమిషాలు టైముంది. చెప్పండి, ఎనీ స్ర్టెస్‌ ఎట్‌ వర్క్‌?’’‘‘వర్క్‌లో స్ట్రెస్‌ ఏమీలేదు. కానీ నాకు రాత్రిళ్ళు బాగా నిద్రపట్టకపోవడంతో ఆఫీసులో అలసటగా అనిపిస్తోంది. దానివల్ల పెర్ఫార్మెన్స్‌ దెబ్బతింటోంది’’ చూపులతోనే తనని చదివేస్తున్న డాక్టర్‌వైపు దృష్టి మళ్ళించకుండా గోడమీద పెయింటింగ్స్‌వైపు చూస్తూ బదులిచ్చింది మధురిమ.

‘‘ఈ నిద్రపట్టకపోవడం..ఎప్పటినుండీ?’’‘‘వద్దు. చెప్పొద్దు, ఎంత సిగ్గుచేటు’’ మెదడు మధురిమను చెప్పొద్దని వారించింది.‘‘చెప్పేసేయ్‌, ఇంకా ఎన్నాళ్ళు ఇలా నీలో నువ్వే కుమిలిపోతావ్‌? నీలోని వేదనను ఇంకొకరితో పంచుకుంటే ఇవాళ రాత్రి హాయిగా నిద్రపడుతుందేమో’’ ముందుకు తోసింది మధురిమ మనసు.