ఒకానొక గ్రామంలో శ్రీనాథుడు అనే సకల విద్యాపారంగతుడు ఉండేవాడు. ఎక్కడెక్కడినుంచో విద్యార్థులు వచ్చి అతడివద్ద శిష్యరికం చేసేవారు. శ్రీనాథుడు శిష్యుల తెలివిని అంచనావేసి, ఎవరికి తగ్గ చదువు వారికి చెప్పి పంపేసేవాడు. ఒకరోజున శ్రీనాథుడివద్దకు సుబుద్ధి అనేవాడు వచ్చి, ‘‘ఆర్యా, నాకు తమవద్ద శిష్యరికంచేసి శాస్త్ర రహస్యాలు తెలుసుకోవాలని ఉన్నది. అయితే నాకు కుటుంబబాధ్యతలు ఉన్నాయి. అందువల్ల ఒక మాసానికిమించి విద్యాభ్యాసంచేసే అవకాశంలేదు. నెల్లాళ్లలో మీరు నాకు జీవితానికి పనికొచ్చే ముఖ్యసందేశాలు చెప్పగోర్తాను’’ అన్నాడు వినయంగా.

శ్రీనాథుడు అందుకు వెంటనే అంగీకరించాడు. సుబుద్ధి జాతకవివరాలు అడిగితెలుసుకుని, అతడి హస్తరేఖలు శ్రద్ధగా పరిశీలించాడు. ‘‘నువ్వు మంచిరోజున వచ్చావు. నీ విద్యాభ్యాసం ఆరంభించడానికి ఈ రాత్రి చక్కని ముహూర్తమున్నది. ఆ తర్వాత మళ్లీ మూడుమాసాలదాకా మంచి ముహూర్తం లేదు. నేనెప్పుడూ చెడు మూహూర్తంలో విద్యాబోధన ప్రారంభించను’’ అన్నాడు.సుబుద్ధి తన అదృష్టానికి సంతోషించాడు. కానీ, అదెంతోసేపు నిలువలేదు. పట్నంలో శ్రీనాథుడి అన్న విరూపాక్షుడి ఆరోగ్యం బాగోలేదనీ, అతడొకసారి తమ్ముణ్ణి చూడాలంటున్నాడనీ అప్పుడే కబురొచ్చింది. కబురు తెచ్చింది ఆ గ్రామస్థుడే! అతడు స్వంతపనిమీద పట్నంవెళ్లి, ఆ రోజే తిరిగొచ్చాడు.

తను చూసినప్పటికే పట్నంలో విరూపాక్షుడి ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉందనీ, వెంటనే వెళ్లమనీ అతడు సూచించాడు. చుట్టుదారిన వెడితే పట్నంచేరడానికి రెండ్రోజుజులు కాలినడక. అడ్డదారిలో వెళితే పూర్తిగా ఒకరోజుకూడా పట్టదు. కానీ, అది అడవిదారి. అక్కడ బ్రహ్మరాక్షసుడు ఉన్నాడనీ, మనుషుల్ని విరుచుకు తింటాడనీ అంటారు. అందుకనే సాధారణంగా ఎవరూ ఆ దారిలోవెళ్లరు. కానీ తన అన్నని చూడాలన్న తొందర్లో శ్రీనాథుడు అడవిదారినే ఎన్నుకుని, శిష్యులందరికీ రెండువారాలకు సరిపడ చదువుపని అప్పజెప్పాడు. అప్పుడు సుబుద్ధి శ్రీనాథుడితో, ‘‘అయ్యా, నేనూ తమతో వస్తాను. మీకు తోడుగా ఉంటాను. మీరు చెప్పిన ముహూర్తానికే నాకు దారిలో చదువు మొదలెట్టొచ్చు’’ అన్నాడు.