ప్రతి మనిషి మనశ్శాంతి కోరుకుంటాడు. అది ఇంట్లో దొరక్కపోతే మరోచోట వెతుక్కుంటాడు. మనం కోరుకునే ఆనందం మరొకరికి ఆనందాన్నివ్వాలేగానీ, మరొకరి జీవితంతో చెలగాటం ఆడకూడదు. మరొకరి జీవితాన్ని పణంగాపెట్టి, వారి నుంచి మనం ఆనందాన్ని పొందకూడదు. ఒకరి పేదరికాన్ని అలుసుగా తీసుకుని డబ్బు ఎరవేసి వాళ్ళనుంచి మనం మనశ్శాంతి పొందడం ఏ రకమైన నీతికి చిహ్నం? ఈ కథలో అతడి అంతరాత్మ అడిగిన ఇలాంటి ప్రశ్నలకు జవాబు చెప్పిందెవరు?….

‘‘నా భక్తుల ఇంట లేమి అను శబ్దము ఉండదు’’షిరిడి శ్రీసాయిబాబావారి గుడిలో సాయి ఏకాదశ సూత్రాలు చదువుతూ సాలోచనగా నిలబడిపోయాను. బోర్డుపైన వ్రాసిన ఆ సూత్రాలు భక్తులు చదువుతున్నారు, బాబాకు మొక్కుతున్నారు, వెళ్లిపోతున్నారు. నేను మాత్రం అక్కడినుంచి కదలలేకపోయాను. మళ్లీ మరోసారి పై నుంచి కిందిదాకా ఆ సూత్రాలన్నీ చదువుకున్నాను. భక్తులకు సాయిబాబా చేసిన వాగ్దానాలే ఆ పదకొండు సూత్రాలూ.

‘‘షిరిడి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము, ఆర్తులైన నేమి, నిరుపేదలైన నేమి, ద్వారకామయ మసీదు ప్రవేశించినంతనే సుఖసంపదలు పొందగలరు, నా భౌతికదేహానంతరం నేను అప్రమత్తుడనే, నా భౌతిక రక్షణ నా సమాధి నుండియే వెలువడుచుండును, నా సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహింతును, నన్ను ఆశ్రయించిన వారిని, నా శరణు జొచ్చినవారిని రక్షించుటయే నా కర్తవ్యము, నా యందెవరిదృష్టి కలదో వారియందే నా కటాక్షము, నా సమాధినుండియే నేను మాట్లాడుదును, మీ భారములు నాపైయుంచుము, నేనే మోసెదను, నా సహాయముగానీ, సలహాగానీ కోరినచో తక్షణమే యొసంగుటకు సంసిద్ధుడను, నా భక్తుల ఇంట ‘లేమి’ శబ్దము ఉండదు..’’ అనేవే ఆ పదకొండు సూత్రాలూ.వీటిల్లో పదకొండవది, ‘‘నాభక్తుల ఇంట ‘లేమి’ అనుశబ్దము ఉండదు’’ అనే సూత్రాన్ని చదివేసరికి, నావీపుమీద ఎవరో ఛెళ్లున చరిచినట్టు అనిపించింది. తెలియని భావమేదో మదిలో మెదిలింది. సాయిబాబా విగ్రహంవంకే చూస్తూ ఉండిపోయాను. ఇదివరకెన్నడూ ఎరగని అనుభూతీ, ఉత్తుంగ తరంగమూ హృదయాన్ని తాకింది. మనసుకి తెలియని నా లోతుల్లోకి, నాలోకి నేను చొచ్చుకుపోయాను.కారణం తెలియని ఆ అనుభూతికి అర్థమేమిటో తోచక, మెట్లుదిగి, కుడివైపు ఉన్న రావిచెట్టుకింద అరుగుపై కూర్చున్నాను. ప్రసాదంగా ఇచ్చిన కట్టుపొంగలిని కనులకద్దుకొని తింటూండగా, మనసులో ఏదో కలవరం.