అతడో అనాథ. చిన్నప్పుడు చిన్న దొంగ, పెద్దయ్యేసరికి పెద్ద రౌడీ. అతడంటే అందరికీ హడల్‌. వడ్డీ వ్యాపారం కూడా చేస్తాడు. డబ్బులివ్వకపోతే నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తాడు. యముడంతటివాడు. దయ, దాక్షిణ్యం, కనికరం లేవు. నర్సిమ్ములు కుటుంబం కూడా అతడి కోరల్లో చిక్కుకుంది. భార్యాబిడ్డలతో వీధిపాలయ్యాడు. రహస్యంగా ఉన్నవూరు వదిలిపారిపోదామనుకున్నాడు. వీలు కాలేదు. మరి అతడి జీవితం ఎలా తెల్లారింది?

అదొక ఊరు. చిన్నసైజు పట్టణం. జనం ఎక్కువా, పనులు తక్కువా అయిపోతున్న ప్రదేశం. జనం గుంపులుగా వలసపోతున్న ఊరు.మధ్యాహ్నం నాలుగు గంటలు. ఓ ప్రైవేట్‌ బస్‌ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అడ్డూ అదుపు లేకుండా నిండా జనాన్ని ఎక్కించేశారు.‘బస్సు బయలుదేరుతోంది రండి’ అని అప్పటికి చాలాసేపటినుంచి క్లీనర్‌ కుర్రాడు అరుస్తున్నాడు. కానీ బస్సు మాత్రం కదలటం లేదు. విసుగెత్తి జనం గొడవ చేసేసరికి కండక్టర్‌ లోపలికి ఎక్కి రైట్‌ రైట్‌ అన్నాడో లేదో బస్సు మీద దడదడ బాది హోల్డాన్‌ అని అరిచారెవరో.బస్‌ ఆగిపోయింది. లోపలికి ఎక్కాడు ఓ శాల్తీ. సినిమాలో విలన్‌ వెంట తిరిగే గుండాలా ఉన్నాడు.‘‘నర్సిమ్ములు ఉన్నాడా? నర్సిమ్ములూ...’’ అంటూ అరిచాడు.

అతన్ని చూడగానే సీటుమీద నించి కిందకి జారి దాక్కునే ప్రయత్నం చేశాడు నర్సిమ్ములు. అటువైపు కూచున్న లక్ష్మి ప్రాణం ఎగిరిపోయింది.జనాన్ని తోసుకుంటూ లోపలికి జొరబడ్డాడు రాములు. నర్సిమ్ములుని చూడగానే బండ బూతులు తిడుతూ మెడపుచ్చుకుని జనంలోంచి ఈడ్చుకుంటూ బస్సు డోర్‌ దాకా తీసుకువచ్చి మూటని విసిరేసినట్లూ రోడ్డు మీదకి విసిరేశాడు.లక్ష్మి ఏడ్చుకుంటూ వెనకనే వచ్చింది. నర్సిమ్ములుని ఆచెంపా ఈచెంపా వాయించాడు రాములు. జనం పోగయ్యారు.

చచ్చిపోతాడు అంటూ రాముల్ని అడ్డుకున్నారు. ‘ఏమైంది?’ అని ఆరా తీశారు. చెప్పాడు రాములు. ఏముందీ పాతకథే. రాములుకు సొమ్ము బాకీ ఉన్నాడు నర్సిమ్ములు. అది తీర్చకుండా ఊరొదిలి పారిపోతున్నాడు. రాములుకి ఉప్పు అందింది, పరుగున బస్‌ స్టాండుకు వచ్చి పట్టుకున్నాడు.‘‘నేను పారిపోటం లేదు. ఇక్కడ పనులు దొరకటం లేదు. పట్నానికి వెళ్ళి ఏదైనా పని చూసుకుని బాకీ తీరుద్దామనుకున్నాను’’ అంటాడు నర్సిమ్ములు.