ఆ శనివారం ఉదయం ..కాఫీలు కలుపుతూ అనుకుంది హిమజ, రేపెలాగైనా వంట ప్లాట్ఫారం కడిగించాలి. పోయిన ఆదివారం తను ఇంట్లో లేదు, అంతకు ముందు ఆదివారం పనిమనిషి ఆగమ్మ ఊరిలో లేదు.వంట ప్లాట్ఫారం సన్నగా పొడవుగా... సరిగ్గా స్టవ్‌ పట్టేంత జాగాతోనే ఉంటుంది.

కాబట్టి, కూరలు తాలింపు చేసేటపుడు మూకుట్లో ఉన్న నూనె చింది గోడపై పడుతుంది. అలాగే, కుక్కర్‌ వేసే విజిల్స్‌ నుంచి వచ్చే ఆవిరి కూడా గోడను తాకి జిడ్డుగా తయారయ్యింది.ఆగమ్మకి కాఫీ గ్లాసు అందిస్తూ చెప్పింది.‘‘రేపు ఒకసారి వంట ప్లాట్ఫారం కడగాలి ఆగమ్మా.’’అలా ముందుగా చెప్పడం ఎందుకంటే, రోజూ కన్నా ఆదివారాల్లో కాస్త పని ఎక్కవ. రోజులాగే అంట్లూ, ఇల్లు తుడుపులే కాకుండా బాత్రూములు కడగడం, తడిబట్ట పెట్టడం లాంటివి ఉంటాయి.బట్టలు ఎలాగూ వాషింగు మెషిన్లో వేసేస్తుంది కాబట్టి.అలా పని ఆవశ్యకతని కాస్త ముందుగా తెలియచేస్తే.. తను అప్పటికి మానసికంగా తయారై ఉంటుందని.‘‘అదేంటండీ! రేపు ఎవ్వరూ బయట తిరగ కూడదని అంటున్నారు కదా! ప్రధానమంత్రి గారే చెప్పారట. ఏదో ‘జనతా కర్ఫ్యూ’ అట.

మీకు తెలీదా ఈ విషయం?’’ ఆశ్చర్యంగా అడిగింది.రోజూ పేపర్లు చదువుతావు. టీ.వీలు చూస్తావు ఆమాత్రం తెలీదా? అన్నట్లు.‘‘అయితే, ఇంటి పనులు చేసుకోవడానికి ఏమిటీ? వండుకుని తినడం తప్పుతుందా?’’ ఈ సారి ఆశ్చర్యపోవడం ఆమె వంతయ్యింది.‘‘ఏమో! నండీ, ఆటో మీద తిరిగి మైకులో చెబుతున్నారు. అదేదో వైరస్‌ అంట. ఊరంతా మందు జల్లుతారంట. రేపు .. మేము ఎవ్వరం బయటకు రాకూడదనుకుంటున్నాం’’ అంటూ తమ పనిమనుషుల సంఘం కట్టుబాట్ల గురించీ, తను రేపు ‘పని’కి రానన్న విషయం చెప్పకనే చెప్పేసింది ఆగమ్మ.చివరిగా.. వెళ్లిపోయేటపుడు ఆశ చావక అడిగింది. ‘‘అయితే, రేపు రావన్న మాట’’ అంటూ.‘‘ఏమో! నండీ. అందరూ వస్తే, నేనూ వస్తాను.. లేకపోతే లేదు’’ అంది కొసమెరుపుగా, ఏదో తాయిలం ఆశ చూపుతున్నట్లు.ఆ స్వామినగర్లో ఉన్న పనివాళ్ళు .. ఎవరు పనులకు వెళుతున్నారో! ఎవరు వెళ్ళడం లేదో! తనకేం తెలుస్తుంది. ఆగమ్మ తనింటికి రాకపోతే, మిగిలిన వాళ్ళూ బయటకి రాలేదని తను అనుకోవాలా?