‘‘నాన్నా నేను బడికిపోతున్న...నా బాక్స్‌ తీసుకున్న....మిగతాది నీకూ, చెల్లికి సరిపోతది.’’‘‘అట్లనే, మరి చెల్లిని నీ వెంట తీస్కపోవా?’’‘‘అది ఇంక తయారు కాలె! లేవడమే జాగు నాన్నా!’’‘‘నేనేం జేయను, చెబితే ఇనదు. దానికోసం ఇప్పటికే చాలా క్లాసులు ఎగ్గొట్టిన.మళ్ళీ ఆ పాఠాలు ఎవరు జెబుతరు?’’

‘‘మా అమ్మగదే, మంచిదానివిగాని ఉండు దాన్ని నేను పంపుతా’’ నాలుగడుగులువేసి, ‘‘నీకున్న శ్రద్ధలో సగం దానికి లేకపాయె’’ అనుకుంటూ ఇంట్లోకి దారితీశాడు గట్టుకింది రామయ్య. కాసేపు చూసి లాభంలేదని బయలుదేరింది రెండుజళ్ళ శ్యామల. కోపం బుసలు కొడుతున్నా నిభాయించుకుంది.కొద్దిసేపు తర్వాత కోపం తగ్గి మంచిగ చదవాల, డాక్టర్‌ గావాల, నాన్న కష్టం తీర్చాల, ఏటాకష్టం, చాలీచాలని ఆకుదాని. ఇంటికి రానిపంట, అప్పులభారం, ఇంటిమీదకొచ్చి అల్లరిచేసే అప్పులోళ్ళు, పోయినసంవత్సరం చచ్చిపోయిన అమ్మ, గుండెలదిగులు, నాన్ననుచూస్తే దిగులు, చదువులకు అడ్డంకులు ఉండకూడదని నెగ్గొకరావాలని ఆరాటం, రాగలనో లేదోనని దిగులు, క్లాసులో అందరూ అంటారు ‘‘దిగాలు మొహమని’’.

‘‘ఫస్ట్‌ మార్కులే వస్తాయిగా, సార్లు మెచ్చుకుంటారుగా ఎందుకే దిగలు’’ అని అడిగింది పెద్దింటి గౌరి.ఎప్పుడోగాని ఒకసారి చిరునవ్వు కనబడేది మొహమ్మీద. బ్యాగుభుజాన వేసుకుని రోడ్డెక్కితే, ‘రోడ్డు చేరడానికే రెండుమైళ్ళు. అంతవరకు బురదనిండిన కాలిబాట. వర్షం వస్తే నరకమే! ఎందుకిట్లా? ఎవర్ని అడగాలి? స్కూ్‌ల్‌ వున్న టౌన్‌లో రోడ్లు అద్దంలా మెరిసిపోతుంటాయి. పెద్దపెద్ద భవనాలు, సిన్మాలు, రోడ్డుమధ్యలో విగ్రహాలు, వాటి చుట్టూ పూలమొక్కలు. కాని పల్లెల్లో పూరిళ్ళు, పెంకుటిళ్ళు, మురికి, పేదరికం...! ఎందుకీ అంతరాలు’. అట్లా ఆలోచించుకుంటూ కాళ్ళకు, బట్టలకు బురదంటకుండా అలవాటైన దారైనా అడుగులో అడుగేసుకుంటూ నడిచింది. మధ్యలో ఆకుచెప్పులు జారటం ఒకటి...