దొంగలు అనేక రకాలు. ప్రియురాలి జడపిన్నులు, పారేసిన బిస్కెట్టు ప్యాకెట్లు దాచుకునేవాళ్ళు కొంతమంది. జేబులు కత్తిరించేవాళ్ళు కొంతమంది. పెళ్ళిళ్ళు, శుభకార్యాల్లో బంధువుల్లో కలిసిపోయి మూకుమ్మడిగా లంచ్‌, డిన్నర్లు లాగించేసే ఘరానా దొంగలు ఇంకొంతమంది. కానీ ఈ కథలో మాత్రం సభలు, సమావేశాలకు హాజరై శాలువాలు, దండలు దొంగిలించే ఓ ప్రత్యేకమైన పెద్దమనుషుల బ్యాచ్‌ ఉంది. ఒకసారి ఏం జరిగిందంటే...

‘దొరకునా ఇటువంటి సేవ...’ త్యాగరాజకృతి లయబద్ధంగా పాడుకుంటూ వస్తున్నాడు సదానందం. ఆ కృతికి తగ్గట్టే చిటికెలు వేస్తూ అతని వెనకనే నడుస్తున్నాడు దయానందం. అప్పటికే అక్కడ హోటల్లో నిత్యానందం, పరమానందం కూర్చుని అదే కీర్తనను సరదాగా హమ్‌ చేస్తున్నారు.‘‘అంతా సిద్ధం’’ అన్నారు మిగతావాళ్లంతా కోరస్‌గా.వీళ్లు నలుగురూ నాలుగురకాల వ్యాపారాలు చేస్తున్నారు. సదానందానిది బట్టలషాపు, దయానందానిది టీ కొట్టు, నిత్యానందానిది పండ్లవ్యాపారం, పరమానందానిది కొబ్బరికాయల వ్యాపారం. వ్యాపారం ఏదైతేనేం? నలుగురూ మంచి స్నేహితులు.

వీళ్లు నలుగురికీ నగరానికి చివరనున్న టౌనుహాలుతో అవినాభావ సంబంధం ఉంది. అక్కడ ప్రతిసభకూ వీరు హాజరవుతారు. ప్రతి సన్మానంలో పాలుపంచుకుంటారు. వీళ్ల సాహిత్యాభిలాషను, సంగీతాభిలాషను ప్రజలు మెచ్చుకుంటారు.అంతేగాక ముందుగా వీళ్లు మౌత్‌పబ్లిసిటీ కూడా బాగాచేస్తారు. టౌనుహాలు పూర్తిగా నిండటానికి ఇదికూడా ఒక కారణం కావడంతో టౌనుహాలు నిర్వాహకులకు వీళ్లంటే చాలాఇష్టం. ఈ చతుష్టయాన్ని వాళ్లపేర్లలో మొదటి అక్షరాలతో ‘సదనిప’ బ్యాచ్‌ అని కూడా పిలుస్తుంటారు.వీళ్లు ఆ రోజు సంగీతరావు సన్మానంలో వేయబోయే దండలగురించి, కప్పబోయే శాలువాలుగురించి వివరంగా మాట్లాడుకున్నారు.

వీళ్లు ఇలా కాఫీలు త్రాగడం పూర్తిచేశారో లేదో హోటల్లోకి ప్రవేశించాడు మహదానందం.‘‘సద్గురువు సదానందానికి, జగద్గురువు దయానందానికి, విశ్వగురువు నిత్యానందానికి, పరమగురువు పరమానందానికి నా నమస్సులు’’ అంటూ నాటకీయంగా నమస్కారంపెట్టి ఎదురుగా కూర్చున్నాడు మహదానందం.అందరూ బిత్తరపోయారు మహదానందం వాక్చాతుర్యానికి. మహదానందం కూడా చిన్నతనంలో వీళ్లతో కలిసి చదువుకున్నవాడే.‘‘ఏరోయ్‌ ఎప్పటినుంచి ఈ కవిత్వం’’ అన్నాడు సదానందం. అదే తానూ అడుగుతున్నట్లు తలూపాడు సదానందం.‘‘ఏం మర్యాదిచ్చావురా మాకు. బాగుపడుతావురా’’ చేయెత్తి ఆశీర్వదించాడు నిత్యానందం. పరమానందం అయితే పరవశించిపోయి మహదానందానికి షేక్ హ్యాండిచ్చాడు.