‘‘అమ్మా నా కొడుకు సరిగా చదవటం లేదు. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు’’ అన్న లక్ష్మి మాటలకు ఏదో పుస్తకం చదువుతున్న కాంతి పుస్తకంలోంచి తల పైకెత్తి లక్ష్మి వైపు చూసింది.‘‘ఇప్పుడేమయ్యింది బోలెడు డబ్బులు ఖర్చుబెట్టి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్లో వేసావు కదా! ఐనా వాడు చదవకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు?’’ అంది కాంతి.

‘‘కాదమ్మా మీరు కోపంగా ఉన్నట్లున్నారు. మీ మాట కాదని ఆ స్కూల్లో వేసినందుకు, ఏదో మీ పిల్లల్లా నా కొడుకు కూడా ఇంగ్లీష్‌ మీడియం స్కూల్లో చదివితే బాగా పైకొస్తాడని ఆశ పడ్డాను. కానీ నా ఆశ నిరాశయ్యింది. డబ్బులూ పోయాయి. పిల్లవాడు సరిగ్గా చదవటం లేదు’’ అంది లక్ష్మి.‘‘వాడు సరిగా చదవటం లేదన్న అనుమానం నీకెలా వచ్చింది? మంచి స్కూల్లోనే వేసావు కదా! అంది కాంతి.‘‘డబ్బులు కడుతున్నాను కానీ నేను చదువుకోలేదు కదా అమ్మా! మార్కులు బాగానే వస్తున్నాయి కదా! బాగానే చదువుతున్నాడని అనుకున్నాను. మొన్న మా అన్న ఊరునించి వచ్చిండు పిల్లగాడెట్ల చదువుతున్నాడో చూడమని నేనే అడిగిన. వాడ్ని దగ్గర కూర్చోబెట్టుకుని అన్నీ అడిగి వాడు సరిగా చదవటం లేదని చెప్పిండు’’ అంది.

లక్ష్మికి ఇద్దరు పిల్లలు. కూతుర్ని గవర్నమెంట్‌ స్కూల్లో వేసింది. కొడుకును మాత్రం కాన్వెంట్‌లో చదివించాలని వాడేదో గొప్పవాడవ్వాలని ఆశించి తన శక్తికి మించినదైనా ఆ స్కూల్లో చదివించండం మొదలుపెట్టింది.ముందుగా ఆ స్కూల్లో చేరుస్తున్నానని చెప్పి పది వేలు అప్పు అడిగినప్పుడే వద్దని చెప్పింది కాంతి. సంవత్సరానికి ఏభైవేలు ఫీజు కట్టాలి అని చెప్పినప్పుడు ఒక్కసారి గుండె ఆగినట్లు అనిపించింది. అందరిళ్ళలో పనిచేసి పొట్టపోసుకుంటున్న మనిషి ఏభై వేలు పోగు చెయ్యా లంటే మాటలు కాదు. ఆ మాటే అంది లక్ష్మితో కాంతి.‘‘అదేంటమ్మా మీ పిల్లలు ఇంగ్లీష్‌ మీడియంలో చదవగా లేంది మా పిల్లలు చదవకూడదా! మా బిడ్డలు కూడా మంచిగ చదవాలని మేం అనుకోవడం తప్పా!’’ అంది.