ఆ ఉత్తరం చదివినప్పటి నుంచి మనసంతా వికలమైపోయింది. ఎవరో డైనమైట్లుపెట్టి పేల్చినట్టు గుండె ఛిద్రమైపోయింది. నేను చేసే ఉద్యోగంలో పిటీషన్లు రావడం సహజమని తెలుసుగానీ ఇంత నీచంగా, ఇంత వికృతంగా ఓ ఆడపిల్ల జీవితంమీద బురద చల్లగలరని ఊహించలేదు. ఈ ఉత్తరం నాకే వచ్చిందా లేక దీని నకళ్ళు తీసి నాకింద పనిచేసే ఉద్యోగులందరికీ పంపించాడా? తప్పకుండా పంపించి ఉంటాడు. అతని ఉద్దేశం నన్ను మానసికంగా హింసించడమే కాబట్టి నా పై అధికార్లముందేకాదు, మిగతా సిబ్బందిముందు కూడా నన్ను నైతికంగా పతనమైన దానిలా చిత్రించి ఉంటాడు.

‘‘మేడం...మీరు చెప్పినట్టు నోటీసులు రాసిపెట్టాను. సంతకాలు పెడితే డిస్పాచ్‌కి ఇచ్చేస్తాను’’ అంటూ వినయ్‌ లోపలికొచ్చాడు. టాక్స్‌ అసిస్టెంట్‌...అతని మొహంవైపు చూశాను. పైకి వినయం నటిస్తూ నిలబడినా లోపల ఎగతాళిగా నవ్వుకుంటున్నాడనిపించింది. ‘నిజంగానే అలా కనిపిస్తున్నాడా లేక నేను భ్రమ పడ్తున్నానా? ఇతనుకూడా చదివే ఉంటాడా? అసలు ఎవరు రాసి ఉంటారు? నా ఆఫీస్‌లో పనిచేసేవాడే ఎవడో రాసి ఉండాలి. ఎవరికైనా నామీద ఎందుకంత కక్ష? నేనేం అన్యాయం చేశానని?’ ఆలోచనల్తో బుర్ర వేడెక్కిపోయి ఫెటిల్లున పేలిపోయేలా ఉంది.

‘‘అక్కడ పెట్టి వెళ్ళండి. తర్వాత చేస్తాను’’ అన్నాను.అతను వెళ్ళిపోయాక ప్యూన్‌ని పిలిచి ‘‘నేను చెప్పేవరకూ ఎవర్నీ లోపలికి పంపకు’’ అన్నాను. అతను తలుపు దగ్గరగా చేరవేసి వెళ్ళిపోయాక మళ్ళా ఆలోచనలు.నేను సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో పాసై ఇండియన్‌ రెవిన్యూ సర్వీస్‌కి సెలక్ట్‌ అయినప్పుడు ‘‘ఎంత కష్టపడితే ఇంతపెద్ద ఉద్యోగం వచ్చిందో నా బంగారు తల్లికి’’ అంటూ అమ్మ మురిసిపోయింది.