నానమ్మ చెప్పినట్టే చేశాడామనవడు. ‘గజ స్నానంతు నిష్ఫలం’ అంటే ఏమిటని అతడిని అడిగాడు. ఆ ప్రశ్నవిని ఆగ్రహంతో ఊగిపోయాడతను. ఇది మీ నానమ్మ ప్రశ్నేకదూ! పోరా ఇక్కడినుంచి! ఇక నా గుమ్మ తొక్కకు! అన్నాడతను. ఇక ఆమె కూడా అదే ప్రశ్న తన తండ్రిని అడిగింది. అతడు ఆగ్రహించలేదుగానీ, ఇది అతడి నానమ్మ ప్రశ్నేకదూ! అన్నాడు. మరి ఇంతకీ గజస్నానంతు నిష్ఫలం’ అంటే ఏమిటి? దీనికి సమాధానం చెప్పిందెవరు?

‘‘నానమ్మా! పాలమ్మేసి వస్తాను’’ సైకిలు క్యారియర్‌కి పాలకేన్లు కట్టి, అమ్మడానికి వెళ్తూ అన్నాడు విద్యాధరరావు. కర్ణాటకలోని చిక్‌బులాపూర్‌ దగ్గరలో చరవారినది తీరంలో ఉన్న చిన్న గ్రామం. ఆంధ్రప్రదేశ్‌ని అంటిపెట్టుకొన్నట్టున్న గ్రామంలో నివసించే అమాయకజీవి విద్యాధరరావు!పేరుకి మాత్రమే విద్యాధరుడు. ఎమిదోక్లాసు తప్పగానే చదువు మానేశాడు. తల్లిదండ్రులు లేని బిడ్డ కావడంతో, నానమ్మ తులసమ్మ ఇక వాడిని బలవంత పెట్టలేకపోయింది.ఇంటి బాధ్యత అంతా తులసమ్మదే. విశాలమైనపొలంలో పెంకుటింటిచుట్టూ, కూరగాయలు పండిస్తోంది. పెరట్లోని గోశాలలో ఆవులు, బర్రెలున్నాయి. అలా ‘పాడి,పంటలతో’ ఇల్లు గడుపుకొస్తోంది తులసమ్మ.‘‘ఒరేయ్‌! ఈసారైనా డబ్బులు వసూలుచేసి తీసుకురా రా!!’’ అని ఒక కేకపెట్టింది తులసమ్మ.

‘‘ఆసామీలు ఇవ్వకపోతే నేనేమి చేసేది నానమ్మా?’’‘‘ఆసామీలు డబ్బు ఇబ్బందులకి ఏమేమి కట్టుకథలు చెప్తున్నారో, వాటినే మీసాలుమార్చి నువ్వు కూడాచెప్పి నీకు కూడా డబ్బు అవసరం ఉందని గట్టిగా అడుగు! ఇవ్వకపోతే తులసమ్మ వచ్చి ధర్నా చేస్తుందని బెదిరించు’’‘‘అలాగే నానమ్మా! ముందు గురూజీ దర్శనం చేసుకుని వెళ్తాను’’.‘‘ఈ గురువు ఎవడ్రా? కొత్తగా తగిలినట్లున్నాడు!’’‘‘నీకు తెలిసిన ఆసామీ నానమ్మా! మన ఇంటికి రైట్‌ కొట్టి వెళ్తే అతని గోశాల, మిద్దిల్లు వస్తాయి!’’‘‘ఓహో! ఆ గడ్డాల రాఘవుడా? వాడుత్త దగుల్బాజీ గురువురా అమాయక జీవుడా! ఏం చెప్తున్నాడు నీకు?’’‘‘సంస్కృత శ్లోకాలుపాడి, వాటి అర్థాలు చెప్తున్నారు. లాఠీ విద్య నేర్పుతానని, అది నా రక్షణకి ఉపయోగపడుతుందని అన్నారు. వాటికి బదులుగా ఏవో కొన్ని చిన్నచిన్న పనులు..అంటే నెయ్యి, పెరుగు, మందులు లాంటివి ఎలాగూ గ్రామం చుట్టూ వెళ్తూ ఉంటాను కాబట్టి, ఊర్లోని మనుష్యులకి ఇవ్వమని అడుగుతున్నారు!’’