అతనికి సెల్‌ఫోన్‌ లేదు! కేవలం ల్యాండ్‌లైన్‌ మాత్రమే వాడుకుంటాడు! అతడిని చూసి అందరూ జాలిపడాలా? లేక పిచ్చివాడనుకోవాలా? చేతిలో సెల్‌ఫోన్‌ లేకుండా బయటకు మనిషి కదలలేని ఈ సమాజంలో ఇలాంటివాడిని చూసి ఏమనుకోవాలసలు? ఆతడేమన్నా గొప్ప ఆదర్శనీయుడా? లేక ఛాదస్తపు మనిషా? కానీ అతనికి ఎదురైన అనుభవాలు ఎలా ఉన్నాయంటే.....

ఉదయం ఆరుగంటలు దాటింది.పాలక్యానుతో బయలుదేరాడు రామారావు. రోజూ రెండొందలగజాల దూరంలో ఉన్న పాలకేంద్రంనుంచి పాలు తీసుకొస్తాడు. స్వచ్ఛమైన చిక్కటి గేదెపాలకోసం రోజులాగే ‘ఆయన’ కనిపించాడు. వెకిలి నవ్వులు, వెర్రివేషాలు, ఓ చేత్తో జారిపోతున్న ప్యాంటును పైకి లాక్కోడం, తూలుతూ ఊగుతూ నడవడం ఆయన ప్రత్యేకత. అయితే రెండో చేయి చెవిదగ్గరే ఉంది. అరచేతిలో విలాసంగా పట్టుకున్న సెల్‌ఫోను.గట్టి గట్టిగా మాట్లాడటం కొందరికి ఇబ్బందిగానూ ఉండచ్చు. పాదచారులకు వినోదం, వికారం సమపాళ్ళలో కలిగిస్తూ ఉండవచ్చు.మూడువారాలనుంచీ ఈ భాగోతాన్ని చూస్తున్నాడు రామారావు. జేబుకు చిన్నపాటి నేంప్లేటుంది. ‘‘టినోపాల్‌’’ అని పేరుకి సూచనగా కనిపిస్తూ. ఓరోజు ఆయన్ని పేరుతో పలకరించాడు.

‘‘నా పేరు టినోపాల్‌ అని బాగానే గ్రహించారే! రోడ్డుమీదపోయే గొట్టంగాళ్ళతో మీకేం పని? ఎందుకు నా టైము వృథా చేశారు’’ స్వల్పంగా మందలించాడు టినోపాల్‌.రామారావు ఖంగుతిన్నాడు.‘‘మీరు మీపని చూసుకోండి. ముఖ్యంగా సెల్‌ఫోనులో మాట్లాడుతున్నప్పుడు ఇతరుల్ని డిస్టర్బ్‌ చేయడం మంచిదికాదు’’ టినోపాలు తన మందలింపు కొనసాగించాడు.‘‘మిమ్మల్ని మీరు గొట్టంగాడిగా భావించుకోకండిసార్‌. మీరు వాకింగు చేస్తూ, గట్టిగా అరుస్తూ ఫోన్‌లో మాట్లాడటం చూడ్డానికి బాగుందని మిమ్మల్ని పలకరించాను సార్‌’’ అన్నాడు రామారావు. ‘‘అంటే...!’’ అన్నాడు నొసలు ముడివేసి. జారిపోతున్న ప్యాంటుని టినోపాల్ చెయ్యి వదిలేసింది. ఇంకా నయం, లోపల కట్‌ డ్రాయరుంది!టినోపాల్‌ గుర్రుగా చూశాడు.

‘‘నా సెల్లు. నానోరు. నా గొంతు. నా ఇష్టంవచ్చినట్టు మాట్లాడుకుంటాను, అరుస్తాను. మీకేమైనా నొప్పా’’ అంటూ సెల్లుని రెండోచెవిలోకి మార్చుకున్నాడు.‘‘మిమ్మల్ని పరిచయం చేసుకుందామని పలకరించానుసార్‌’’ రామారావు అతన్ని ములగచెట్టు ఎక్కించే ప్రయత్నం చేశాడు.‘‘చాలా సంతోషం. ఈ వాగుడు, అరుపులు నాకు చిన్నప్పట్నుంచి అలవాటే. అందుకే నాకు విరోధులు ఎక్కువ. కాని మీరు ధైర్యంచేసి నాతో మాట్లాడినందుకు సంతోషంగా ఉంది’’ అంటూ గట్టిగా నోరు తెరచి నవ్వినప్పుడు కొండనాలుక కనిపించింది.