మనదేశంలో రావణాకాష్టంలా రగులుతున్న ఒకేఒక సమస్య ఆడవాళ్ళకి భద్రత లేకపోవడం. ప్రపంచదేశాల్లో మన దేశానికి చెడ్డపేరు తెస్తున్నదీ ఈ సమస్యే. దిశ సంఘటన తర్వాత సమాజంలో చాలా పెద్ద మార్పు వచ్చింది. పెద్ద చర్చ దేశంలో జరుగుతోంది. మగపిల్లలకు టీనేజ్‌ వచ్చాక ఎలా ప్రవర్తించాలో తల్లిదండ్రులు, గురువులు చెప్పకపోవడంవల్లే ఈ సమస్యలన్నీ. అందుకే ఈ కథలో ఒక గురువు ఏం చేశాడంటే..

**********************

‘‘మీరు వచ్చేటప్పుడు అరటిపళ్ళతోపాటు తమలపాకులు కూడా మరచిపోకుండా తీసుకురండి’’ అంది శ్రీమతి. అలాగే అని చెప్పి బజారుకు బయలుదేరాను.సాయంకాలం ఆరుగంటలు కావొస్తోంది. డిసెంబరు నెల. మార్గశిర మాసపు చలి కొంచెం ఎక్కువగానే ఉంది. నెమ్మదిగా నడుచుకుంటూ సెంటర్‌కి చేరుకున్నాను. అక్కడ ఓ షాపింగ్‌మాల్‌ పక్కనే చెట్టు కింద ఉన్న గంగమ్మ అరటిపళ్ళ బండి దగ్గరకు నడిచాను. ఆ బండిమీద దూరంగా కరెంటు స్థంబానికున్న ట్యూబులైటు వెలుగు పడీపడనట్లుంది. పచ్చని పసిమిఛాయతో నుదుటిమీద రూపాయి కాసంత కుంకుమ బొట్టు పెట్టుకుని, నేరేడు పండు రంగు ముతక నేతచీరతో సాక్షాత్తూ ఆ గంగమ్మ తల్లిలాగే ఉంది గంగమ్మ. నన్ను చూసిన వెంటనే బ్యాటరీతో పనిచేసే మినీ ట్యూబులైట్‌ కింద నుంచి తీసి బండిమీద పెట్టి స్విచ్‌ ఆన్‌ చేసింది.

అరటిపళ్ళతో నిండివున్న ఆ బండంతా వెలుగుతో నిండిపోయింది. అరటిపళ్ళు బంగారంలా మెరుస్తున్నాయి.‘‘రండి సారో బోణీ చేయండి’’ అంది నవ్వుతూ. ఆమెకి అదో సెంటిమెంటు. నేను రోజూ ఆమె దగ్గరే అరటిపళ్ళు కొంటాను. ఒకటిరెండుసార్లు తను లైటువేసిన వెంటనే కొన్నానట. అప్పుడామె పళ్ళన్నీ అమ్ముడై బాగా లాభం వచ్చిందట. అప్పటినుంచీ నేను వెళ్ళాకే లైటు వెలిగించేది. నాకు అలాంటి సెంటిమెంట్లు లేవు. ఆవిడ నమ్మకాన్ని నేనెందుకు కాదనాలని నేనూ ఆ టైముకే వెళుతూ ఉండేవాడిని. నేను ప్రతిరోజూ ఓ డజనుపళ్ళు కొంటుంటాను. మా పిల్లలిద్దరికీ అరటిపళ్ళంటే చాలా ఇష్టం. మా ఆవిడా, నేను కూడా తింటాం. ఈ రోజు సాయంత్రం డజనుకొంటే రేపు సాయంత్రానికి ఒక్కపండు కూడా కనిపిపించదు. ఒక్కోసారి గంగమ్మే రోజూ ఇచ్చే పళ్ళకంటే రెండుపళ్ళు అదనంగా ఇచ్చేది. ‘‘ఎందుకలే గంగమ్మా’’ అంటే ‘‘బుడ్డోళ్ళు తింటార్లే సారూ’’ అనేది నవ్వుతూ.