‘‘హలో అత్తా, ఎలా ఉన్నారు? నేను ఢిల్లీ నుంచి పూజని మాట్లాడుతున్నాను. గుర్తు పట్టావా?’’ ఫోన్లో పలకరించింది పూజ.‘‘ఓహో! పూజా నువ్వటే! చాలాకాలమైంది నీతో మాట్లాడి, ఎలా ఉన్నారు మీరు? నీ కొడుకు పేరేమిటన్నావ్‌?’’ బదులిచ్చింది పార్వతమ్మ.‘‘మేము బాగానే ఉన్నాం అత్తా! వాడికి నిర్భయ్‌ అని పేరుపెట్టాం. మెల్లగా అల్లరి నేర్చుకుంటున్నాడు వెధవ. ఇప్పుడు నీకు ఫోన్‌ చేసింది వాడిగురించే’’ అన్నది పూజ.

‘‘అలాగా! ఏమిటి విషయం?’’ అడిగింది పార్వతమ్మ.‘‘ఏమీ లేదు అత్తా, వాడికి ఏడాది నిండేలోగా పుట్టువెంట్రుకలు తిరుపతిలో తీయిద్దామని మొక్కుకున్నాం. వచ్చేనెలలో ఆ పనిమీద తిరుపతి వద్దామనుకుంటున్నాం’’.‘‘అలాగా, వచ్చేనెలలో ఎప్పుడు వద్దామనుకుంటున్నారు?’’ అడిగింది పార్వతమ్మ.‘‘వచ్చేనెల ఆరోతేదీన వచ్చి ఒక నాలుగురోజులు ఉందామనుకుంటున్నాం. ఎప్పుడో నేను ఇంటర్‌లో ఉండగా రావడమే, మళ్ళీ కుదర్లేదు. ఈసారి ఆ చుట్టుపక్కల ఆలయాలకు కూడా వెళ్ళొచ్చేద్దామని మా ఆలోచన’’ చెప్పింది పూజ.‘‘మంచిది పూజా. టిక్కెట్లు బుక్‌చేసుకున్నాక మళ్ళీ ఒకసారి చెప్పు. ఈ మధ్య కొంచెం మతిమరుపు వస్తోంది నాకు. మీ అమ్మనాన్న ఎలా ఉన్నారు? నేను మీ నాన్నతో మాట్లాడి రెండునెలలుపైగా అయింది’’ అన్నది పార్వతమ్మ.

‘‘వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు అత్తా! నిన్నరాత్రే నాన్నగారితో మాట్లాడాను. ఇక ఉంటాను అత్తా. టికెట్లు బుక్‌ చెయ్యగానే మళ్ళీ ఫోన్ చేస్తాను. మామయ్యగారు ఎలా ఉన్నారు? అడిగినట్లు చెప్పు, బై అత్తా’’ అని ఫోన్‌ పెట్టేసింది పూజ.‘‘మనం తిరుపతి వస్తున్నాం అంటే మా పార్వతమ్మ అత్త చాలా సంతోషిస్తుంది. ఎగిరిగంతేసి ఆహ్వానిస్తుందన్నావ్‌? అవతల ఆవిడ మాటలేమో ముక్తసరిగా ఉన్నాయి! ఎగిరి గంతేయడం సంగతి అటుంచితే, కనీసం ఆ గొంతులో ఇసుమంత ఆనందం కూడా లేనట్టుంది, నీకు అలా అనిపించలేదా?’’ పక్కనుంచి వాళ్ళ సంభాషణ విన్న పూజ భర్త జగదీప్‌ అన్నాడు.