సమయం రాత్రి తొమ్మిది గంటలు.సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లో గౌతమి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కడానికి స్టేషన్‌ కొచ్చాను. అప్పటికే ఒకటో నెంబరు ఫ్లాట్‌ఫారం మీద రైలు ఆగి ఉంది. తొమ్మిదింపావుకి బయలుదేరుతుంది. నా కోచ్‌ నెంబర్‌ చూసుకుని ఎక్కాను. నాది మిడిల్‌బెర్త్‌. లోయర్‌ బెర్తుల్లో ఇద్దరు వయసు మళ్ళిన ఆడవాళ్ళు ఎదురెదురుగా విండో ప్రక్కన కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పుడే నా బెర్త్‌ వేసుకోవడానికి వీలుండదు కాబట్టి లోయర్‌ బెర్త్‌ మీదే ఒకావిడకు కొంచెం దూరంలో కూర్చున్నాను. వాళ్ళిద్దరూ దగ్గరదగ్గరగా ఎనభై సంవత్సరాల వయసున్న వాళ్ళలా ఉన్నారు. అయితే కాయకష్టం చేసి బ్రతికినవాళ్ళు కాబట్టి కొంచెం బలంగానే ఉన్నారు. వార్థక్యం ఛాయలేమీ కనిపించడం లేదు. సాదాచీరల్లో దిగువ మధ్య తరగతికి చెందిన వాళ్ళలా ఉన్నారు.

ఇంక రైలు బయలుదేరుతుండగా ఓ వ్యక్తి వచ్చి నా ఎదురుగా సీట్లో కూర్చుని ‘‘సార్‌! మీరెంతవరకు వెళుతున్నారు’’ అనడిగాడు.‘‘రాజమండ్రి’’ అని చెప్పాను.‘‘సార్‌! నాకో సాయం చేయాలి. ఈవిడ మా అత్తగారు. ఎప్పుడూ రైలులో ఒంటరిగా ప్రయాణం చేయలేదు. ఒక్కావిడనే పంపించాల్సి వస్తుంది. ఈవిణ్ణి కొంచెం నిడదవోలులో దించుతారా’’ అని రిక్వెస్ట్‌ చేశాడు పక్కనున్న ఆవిడను చూపించి.‘‘దాందేముందండి అలాగే’’ అన్నాను.

థ్యాంక్స్‌ చెప్పి అతను దిగిపోయాడు. రైలు బయలుదేరింది.‘‘ఆయన మా పెద్దల్లుడుగారండి. ఇక్కడో ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. చిన్నఅల్లుడుగారేమో ఏదో చిన్న ఆఫీసులో చేస్తారండి అదేంటో నాకు తెలీదనుకోండి. అంటూ చెప్పిందావిడ తన ముందు కూర్చున్నావిడతో.‘‘అలాగా అయితే మీది నిడదవోలన్నమాట’’‘‘అవునండి మీరెంతవరకు వెళ్ళాలి’’.‘‘నేనూ రాజమండ్రే ఎల్లాలండి. నా పేరు గంగారత్నమండి మరి మీ పేరు’’ అడిగిందామె.