పెద్దింట్లో పెళ్ళికి మంచి పట్టుచీర నేశాడు నేత కార్మికుడు నరసయ్య. అనారోగ్యంగా ఉన్నాగానీ చాలా శ్రద్ధ చూపించాడు. తనే స్వయంగా మండపం దగ్గరకు వెళ్లి పెద్దాయనకు పట్టుచీర చూపించాడు. నరసయ్యను చూడగానే గతుక్కుమన్నాడు ఆ పెద్దాయన. ఏం చేయాలో పాలుపోలేదు. మొహం చాటేసే అవకాశం లేకపోవడంతో నరసయ్యతో మాటలు కలిపాడు. పట్టుచీర కొనుక్కుంటారని కోటి ఆశలతో వచ్చిన నరసయ్యకు ఆశాభంగం ఎదురైంది. కానీ...

‘‘ఇద్దో నరసయ్యా పొద్దన్నే నీకు మంచి గిరాకీ తీసుకొచ్చినాను’’ గ్రామ పురోహితుడు రామశర్మగారి కొడుకు శ్రీనివాస్‌ పిలుపుతో తలెత్తి గాబరాగా చూశాడు. ’మగ్గం గుంటలో నిలబడి ఒడుపుగా పట్టుచీర నేస్తున్న నేతకార్మికుడు నరసయ్య,

శ్రీనివాస్‌తోబాటు సఫారీ సూట్‌లోని ఓ నలభైఏళ్లవ్యక్తి, తెల్లటి ఖద్దరుచొక్కా, పంచె, నుదుట వీబూదితో అరవైఐదేళ్ల వృద్ధుడు నిలబడి తన వంక తేరిపార చూస్తున్నారు.నరసయ్య మగ్గంగుంట నుండి లేచి వచ్చి పెద్దాయనకు నమస్కరించి, ‘‘ఏంది బాబూ ఈ సాములను తీసుకొచ్చినావు’’ అని శ్రీనివాస్‌ని అడిగాడు.‘‘ఈయనపేరు ఆదికేశవులుగారు. వలసపల్లెలో ఇరవైఎకరాల భూస్వామి. ఈయన రామ్మూర్తి అని కేశవులుగారిపెద్ద కొడుకు’’ వచ్చిన ఇద్దరినీ చూపించి నరసయ్యకు పరిచయం చేశాడు శ్రీనివాస్‌.‘‘రెండు నెలల్లో మా మనవరాలు పెళ్ళి. రామశర్మగారినిమించిన పురోహితుడు ఈ ఇలాకాలోలేరని తెలిసి పెళ్ళిచేయించడానికి ఆయనకోసం వచ్చాం. మంచి నాణ్యమైన చీరలు కూడా ఈ పల్లెలోనే దొరుకుతాయని శీనూచెబితే, పెళ్ళికూతురు కట్టుకోవడానికి మంచిచీరేమైనా దొరుకుతాయేమో అని ఇలా వచ్చాం’’ అన్నారు కేశవులుగారు.

నరసయ్య ఆనందంగా ‘‘సార్‌ మేము నూరు, నూటఇరవై కౌంటులో మంచి పట్టుచీరలు నేస్తాము. మీకు కావాలంటే పెళ్ళికూతురు పట్టుచీరైనా నేసిస్తాము. మాకు రేషం (పట్టు) నూలు, జరీ అదీ కొనుక్కోవడానికి అడ్వాన్సేమైనా ఇచ్చిపోతే, మీకు పెళ్లికి పది రోజుల ముందే చీరలను నేసుకుని మీకు తెచ్చిస్తాం’’ అన్నాడు.‘‘సరే, ముందు మీరు ఇదివరకు నేసిన పట్టుచీరలేవైనా చూపించండి. మాకు ఒక ఐడియా వస్తుంది’’ కేశవులుతోపాటు వచ్చిన ఆయన కొడుకు రామ్మూర్తి అడిగాడు.నరసయ్య వారిని లోపలగదిలోకి తీసుకెళ్లి షోకేసుల్లో కనబడుతున్న పట్టుచీరల్లోంచి నాలుగుచీరలు ఎంచుకుని తీసి, చాపపైన పరిచారు. అప్పటికే చాపపైన కూర్చున్న ఆదికేశవులుగారితోబాటు రామ్మూర్తి, శ్రీనివాస్‌ కూడా అందమైన రంగులు, కళాత్మకమైన అంచులు, చక్కటి బుటాలతో మెరిసిపోతున్న ఆ చీరలు చూశారు.