పాములు... పాములు. పేపరంతా పాకుతూ పాములు.పెద్దవీ, చిన్నవీ, ఆడవీ, మగవీ రకరకాలు. కట్లపాములు, జెర్రిగొడ్లు, పసరిక పాములు.త్రాచుపాములు, వాటితోపాటు అక్కడక్కడా చిన్నపాటి కొండచిలువలు మారణం జరుగుతోంది. కోరలుచాచి కొన్నిటిని మరికొన్ని కొరుకుతున్నై. శరీరాల్ని చుట్టేసి నలుపుతున్నై. బుస్సుమంటూ బాధతో అరుస్తున్నయ్‌ ఆ కొన్ని. పేపరంతా రక్తం. రక్తం బొట్లు, బొట్లుగా చారలై కారుతున్నాయ్‌. భయానకంగా ఉంది. చాచిన కోరలు పెద్దవి అవుతున్నాయి. విషంకక్కుతూ మీదకొస్తున్నాయి. అవి తనమీదకే వస్తున్నాయి!

నారాయణకు గుండె ఆగినంత పనైంది. భయంతో ఒళ్ళంతా తడిసిపోయింది. ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాడు. పాము బుస వినిపిస్తూనే ఉంది. చూస్తే అది పాతబడిన ఏసీ మిషన్‌ శబ్దం. పక్కన భార్య లక్ష్మి ప్రశాంతంగా నిద్రపోతోంది. నెమ్మదిగా ఒంట్లో వణుకు తగ్గింది. లేచి, హాల్లోకి వెళ్ళి ఫ్రిజ్‌లోంచి వాటర్‌ బాటిల్‌ తీసి కాసిని నీళ్ళు తాగాడు. నిద్ర ఎగిరిపోయింది. ఒక్కక్షణం ఆలోచించి పక్క రూములో తన రైటింగ్‌ టేబుల్‌ దగ్గరకెళ్ళాడు. పెన్ను తీసుకుని, కాగితాల ప్యాడ్‌ ముందుకు జరుపుకున్నాడు. కథ రాయడం ప్రారంభించాడు. దాదాపు పదేళ్ళక్రితం నారాయణవాళ్ళుండే అపార్ట్‌మెంట్‌లో అదే ఫ్లోర్‌లో రవి, ప్రశాంతి ఓ ఫ్లాట్‌ కొనుక్కున్నారు.

వాళ్ళకి మూడేళ్ళ కూతురు నిత్య. దంపతులిద్దరూ అందరితో బాగా కలిసిపోయేతత్వం ఉన్నవాళ్ళే. అదే ఫ్లోర్‌లో ఉండే నారాయణ రచయిత కావటం, ప్రశాంతికి సాహిత్యం మీద ఆసక్తి ఉండడంతో వారిద్దరిమధ్యా ఎక్కువగా సాహిత్యచర్చలు నడుస్తూ ఉంటాయి. రవి ఉండగా ఆ సాహిత్యం ప్రస్తావన వస్తే, ‘‘మొదలైందీ మీగోల’’ అని వాళ్ళని వదిలేసి తన పనిలోకి తనెళ్ళిపోయేవాడు రవి. నారాయణ ప్రోత్సాహంతో ప్రశాంతి కూడా అప్పుడప్పుడు కథలు రాస్తోంది. ఇటీవలే ఒక కథ పబ్లిష్‌ అయింది కూడా. రెండుతరాల వయసుల మనుషులైనా కూడా ఆ రెండు కుటుంబాలూ బాగా ఆత్మీయంగా కలిసిపోయాయి.