సంక్రాంతి పండుగ. ఓ రాజుగారి ఇంటివెనుక పెద్ద పెరడులో తిరునాళ్ళ వాతావరణం నెలకొంది. జనం గుంపులు గుంపులుగా ఉన్నారక్కడ. మధ్యలో తాళ్ళతో ఒక రింగ్‌ కట్టారు. దానికి ఇరువైపులా రెండు గ్రూపులు మోహరించాయి. మెడచుట్టూ తెలుపు, పసుపు, గోధుమరంగు ఈకలున్న ‘రాజ’సం ఉట్టిపడే కోడిపుంజులున్నాయి వాళ్ళదగ్గర. వాటి కాళ్ళకు కత్తులుకట్టారు! అక్కడున్నవాళ్ళమధ్య లక్షల రూపాయలు చేతులుమారుతున్నాయి!

వాతావరణం కొంచెం చలిగా ఉంది. ఉదయమైనా మంచుతెరలు పొలాలను, చెట్లను వీడడం లేదు. వరినాట్లు పూర్తిచేసి నెలరోజులైనట్లుంది. పొలాలన్నీ ఆకుపచ్చ తివాచిలా కనుచూపుమేర విస్తరించి ఉన్నాయి. నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ ప్రకృతి అందాలను చీల్చుకుంటూ ఆకివీడుదాటి భీమవరంవైపు ప్రయాణిస్తోంది. ఆ నలుగురు మిత్రులూ కిటికీ వద్దచేరి ప్రకృతి అందాలుచూస్తూ పరవశించిపోతున్నారు. ‘‘అదిగో చూడండి చేపల చెరువులు, గట్లపై కొబ్బరి చెట్లు..ఎంత అందమైన దృశ్యమో. ఆ చేపలచెరువులపైన వలల్లాంటి దారాలు కట్టారు ఎందుకో తెలుసా? పిట్టలు చేపపిల్లలను తినకుండా అలా వలలు కడతారు’’ అంటూ హుషారుగా తన ప్రాంతాన్ని పరిచయం చేస్తున్నాడు ఉదయ్‌.

‘‘కొన్ని చెరువుల్లో ఏవో మిషన్లు తిరుగుతున్నాయి అవేంటి?’’ అడిగాడు అరుణ్‌. ‘‘అవి రొయ్యల చెరువులు. రొయ్యలకు ఆక్సిజన్‌ సరఫరా చేయడంకోసం ఆ మోటార్లు తిరుగుతూ ఉంటాయి’’ అన్నాడు ఉదయ్‌. రైలు మార్గానికిరువైపులా మళ్ళీ ఆకుపచ్చపొలాలు కనువిందు చేస్తున్నాయి. ఎవరో కూలీలు పొలాలకు పురుగులమందులు జల్లుతున్నారు. ‘‘అదిగో దూరంగా కనిపిస్తోందే, అక్కడే ఈముపక్షుల్ని పెంచుతారు. అవిగో ఆ పక్షులు కూడా కనిపిస్తున్నాయి చూడండి’’ అన్నాడు ఉదయ్‌. మరికొద్దిక్షణాల్లో మిత్రులంతా భీమవరంలో దిగబోతున్నారు. గోదావరిజిల్లాలో జరిగే సంక్రాంతి సంబరాలు తన స్నేహితులకు చూపించాలని ఉదయ్‌కి ఎప్పటినుంచో కోరిక. అందుకే మిత్రుల్ని తీసుకుని వచ్చాడు ఉదయ్‌.వీళ్ళంతా భీమవరం టౌన్‌స్టేషన్‌లో దిగి కారులో ఉదయ్‌ చెల్లెలు ఇంటికి బయలుదేరారు.

చెల్లెలు ఇంట్లో ఆతిథ్యంచూసి అతడి మిత్రులందరూ ఉబ్బితబ్బిబ్బైపోయారు. టిఫిన్‌లే ఐదారు రకాలు చేశారు. ఇక తినలేక ‘‘మీరు తిండిపెట్టి దాంతోటే చంపేట్టున్నారే!’’ అన్నారు ఆనందంగా. అక్కడినుంచి బయలుదేరి దగ్గరలోనే ఉన్న యండగండిగ్రామం వెళ్ళారు. ఉదయ్‌ మిత్రుడైన ఓ రాజుగారు వీళ్ళందరికీ ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళ ఇంటివెనుకే కోడిపందాలు జరుగుతున్నాయి. రాజుగారు ఉదయ్‌ మిత్రులందరినీ కోడిపందాలు జరిగేచోటుకు తీసుకెళ్లారు. అక్కడ వాతావరణమంతా ఓ తిరనాళ్ళు జరుగుతున్నట్టుంది. చాలామంది గుంపులు గుంపులుగా ఉన్నారు. ఇంతలో ఒకతను విజిల్‌ ఊదుతూ జనాన్ని వెనక్కు నెడుతున్నాడు. తాడుతో పెద్దరింగులాగాకట్టి, ఆ రింగుదగ్గరకు రానీయకుండా జనాన్ని వెనక్కి తోస్తున్నారు. జనం కొంచెం వెనక్కి తగ్గారు. రింగ్‌మధ్యలో ఓ ఇరవైమంది రెండు గ్రూపులుగా మోహరించారు.

వాళ్ళందరూ ఏవో మంతనాలు చేస్తున్నారు. వెంటనే విజిల్‌ ఊదడంతో పందెం ప్రారంభమైంది. బరిలోకిదించిన రెండు కోడిపుంజుల ముక్కుల్నీ తాటించారు. అవి ఒకదాన్నొకటి పొడుచుకున్నాయి. అప్పుడు రెంటినీ బరిలోకి వదిలారు. వాటి కాళ్ళకు కత్తులు కట్టారు. అవి కాళ్ళతో తన్నుకుంటున్నాయి. వాటి మెడచుట్టూ ఈకలు నిక్క పొడుచుకున్నాయి. పందెం జోరుగా సాగుతోంది. వీరయోధుల్లా ఎగిరెగిరి తన్నుకుంటున్నాయి కోడిపుంజులు. కొద్దిసేపైంది. ఇంకా ఫలితం రాలేదు. పందెం వేసినవాళ్ళు తమ కోడిపుంజుల్ని వెనక్కి తీసుకుని వాటిని తడిగుడ్డతో తుడిచి నీళ్ళు తాగించారు. ఉదయ్‌, అతడి మిత్రులందరూ ఒకచోట నిలబడ్డారు. వాళ్ళు నిలబడినచోట వెనకాల ఎవరో ‘‘డేగ మాది...డేగ మాది...’’ ‘‘పరజ మాది...పరజ మాది...’’ అని గొణుగుతూ తిరుగుతున్నారు.

అక్కడ జరిగేదంతా ఉదయ్‌ తన మిత్రులకు వివరిస్తున్నాడు. ‘‘బరిలోకి దిగిన కోడిపుంజులమీద పైపందేలు కడుతుంటారు. అంటే చిన్నసైజు బెట్టింగులన్నమాట. ఇలాంటి బెట్టింగులన్నీ నిషేధమే అయినా దొంగచాటుగా వేస్తుంటారు. పందెపు కోడిపుంజు మెడచుట్టూ తెలుపు, పసుపు, లేత గోధుమరంగు ఈకలుంటే దాన్ని డేగ అంటారు. ఇలా కోడిపుంజుల్లో సుమారు పదిహేను రకాలున్నాయి’’ అని చెబుతూ, ‘‘ఇంతకీ అసలు పుంజుల యజమానులు వేసే పందెం ఎంతో తెలుసా?’’ అని అడిగాడు. మిత్రులు ప్రశ్నార్థకంగా చూశారు. ‘‘లక్షరూపాయల నుంచి పదిలక్షలు దాకా ఉంటుంది!’’ అని చెప్పాడు. ఉదయ్‌ చెప్పిందివిని మిత్రులందరూ నోరెళ్లబెట్టారు.