‘‘టైం ఒంటిగంట దాటిందమ్మా. నువ్వు సర్దాలనుకున్నవన్నీ తొందరగా సర్దేయి. ఆలస్యం చేస్తే రెండుగంటల బస్‌ అందుకోలేను. అదైతేనే నాకు అనుకూలంగా ఉంటుంది. రాత్రి పదికల్లా హైద్రాబాద్‌ చేరుకుంటాను. బాగా నిద్రపోయి రేపుదయం ఫ్రెష్‌గా ఆఫీస్‌కి వెళ్ళొచ్చు’’ అన్నాడు రవి.ఓ సీసాలో బూందీ లడ్లు, మరో సీసాలో మినపసున్నిఉండలు పెడుతూ, ‘‘తొందరపెట్టకు నానీ. ఉద్యోగంలో చేరినప్పటినుంచి ఆర్నెల్లకోసారిగానీ నువ్వు ఇంటిముఖం చూడటంలేదాయె. ఇప్పుడైనా పండగకాబట్టి వచ్చావు. అక్కడ ఏం తింటున్నావో ఏమో... మరో రెండ్రోజులుండొచ్చు కదా. అంత హడావిడిగా వెళ్ళకపోతేనేం చెప్పు’’ అంది వాళ్ళమ్మ.

‘‘సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల్లో అంత సులభంగా శెలవు దొరకదమ్మా’’‘‘పోనీ ఈ పూటైనా ఉండొచ్చుగా. రాత్రి భోజనాల తర్వాత పదింటి బస్‌ ఎక్కావంటే ఉదయం ఆరింటికల్లా హైద్రాబాద్‌లో దిగుతావు. నేరుగా రూంకెళ్ళి స్నానం అదీచేసి ఆఫీస్‌కెళ్ళేంత సమయం దొరుకుతుందిగా’’.‘‘నిజమే. రాత్రి పదింటికున్న లాస్ట్‌బస్‌ అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. కానీ నా సంగతి నీకు తెల్సుగా అమ్మా. బస్‌లో వెళ్ళినా రైల్లో ప్రయాణం చేసినా రాత్రిళ్ళు నిద్రపట్టదు. చాలామంది గురకలుపెట్టి నిద్రపోతుంటారు. ఆ కుదుపులు ఉయ్యాల ఊపినట్టు ఉంటాయో ఏమో. వాళ్ళనిచూస్తే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. నాకైతే క్షణం నిద్రపట్టదు. మర్నాడు ఆఫీసుకెళ్ళి పనిచేయలేను.

నాలాంటివాళ్ళకి ఈ బస్సే సరైంది’’.వాళ్ళమ్మ ఓ చిన్నసీసాలో ఆవకాయ, మరో సీసాలో టమోటా పచ్చడి పెట్టడం చూసి, ‘‘ఎందు కమ్మా ఇవన్నీ పెడ్తావు? నేనేమీ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న స్టూడెంట్‌ని కాదు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ని. మా క్యాంటీన్లో లంచ్‌ బావుంటుందమ్మా. రాత్రి ఇంటికొచ్చేముందు కూడా డిన్నర్‌ పెడ్తారు’’ అన్నాడు.‘‘వాళ్ళు పంచభక్ష్యపరమాన్నాలు పెట్టినా రుచీపచీ లేకుండా వండుతారటగా. అయినా ఉప్పూకారాలు లేని తిండి అదేం తిండీ? జిహ్వ చచ్చిపోదూ! వేడివేడి అన్నంలో ఆవకాయ కలుపుకుని అందులో గరిటెడునెయ్యి వడ్డించుకుని తింటుంటే ఉండే రుచి మీ క్యాంటీన్లో దొరుకుతుందా చెప్పు’’ మరో చిన్నసీసాలో పేరిననెయ్యి సర్దుతూ అంది.