మాగన్నుగా కన్ను అంటుకుంటోంది సుశీలకు.ఎవరో భుజంమీద తడుతున్నట్టు లీలగా తెలుస్తున్నా, కనురెప్పలు విడివడటం లేదు. కళ్ళు తెరవాలనుకున్నా, అలసటవల్ల భారంగా వాలిపోతున్నాయి. మంచానికి తల ఆనించి పడుకుందేమో, మెడనొప్పి పెడుతోంది.

‘‘సుశీ, సుశీ..’’ ఎక్కడినుంచో, ఎవరో పిలుస్తున్నట్లుగా అనిపించి కళ్ళు తెరిచింది.ఆ పిలుపు బెడ్‌మీదున్న భర్తదేనని అర్థమై, చటుక్కున లేవబోయింది. కానీ ఆమె శరీరం సహకరించలేదు. మంచం రాడ్‌నే ఆసరాగా చేసుకుని లేచి ‘‘ఏంటండీ, ఏం కావాలి’’ అనడిగింది.‘‘ఒకటికి’’ అన్నాడు శ్రీధరం నిస్సహాయంగా చిటికెనవేలు చూపిస్తూ.‘‘సరే, ఉండండి’’ అంటూ దూరాన వేరే మంచం దగ్గరున్న బెడ్‌పాన్‌ తీసుకొచ్చి పెట్టింది.‘‘నర్సుల్ని, ఆయాల్ని పిలిచినా రారు, వచ్చినా విసుక్కుంటారు, అందులోనూ రాత్రిపూట ఎంత పిలిచినా రారు’’ అనుకుంటు యూరెన్‌తో నిండిన బెడ్‌పాన్‌ తీసుకెళ్ళి, ఆ చివరగా ఉన్న బాతరూమ్‌లో పారబోసి, కడిగి తిరిగి వచ్చేసరికి, అలసటతో చెమటలు పట్టేశాయి. హాస్పిటల్లో, నాలుగు రోజులుగా సరైన తిండీ, నిద్రా లేకపోవడంతో, ఒళ్ళు తూలిపోతున్నట్లుగా ఉందామెకి. కిందకు వంగి ఆ నేల మీద పడుకోలేక మంచం అంచున కూర్చుంది.

‘‘ఫ్యాన్‌ స్పీడ్‌ పెంచుదామా?’’ అనుకుంది గానీ భర్తకు వణకు వస్తుందని, ఆ ప్రయత్నం విరమించుకుని కొంగుతో విసురుకోసాగింది. మోనోపాజ్‌వల్ల ఆమెకు ఎంత చలి ఉన్నా ఉక్కబోస్తూ ఉంటుంది. గాలి లేకపోతే, చెమటలతో నిండిపోతుంది.‘‘సుశీ, సుశీ’’ మళ్ళీ పిలిచాడు శ్రీధరం.‘‘ఏంటండీ, ఇప్పుడెలా ఉంది?’’ అతని చేయి నిమురుతూ అడిగింది సుశీల.‘‘నోరంతా ఆర్చుకుపోతోంది’’ ఎండిపోయిన పెదవులు తడుపుకుంటూ అన్నాడతను.‘‘అరె, అలాగా’’ అంటూ, నీళ్ళల్లో గ్లూకోజ్‌ కలిపి చెంచాతో ఆరారగా అతని నోట్లో పోయసాగింది. అతను చాలంటూ, సంజ్ఞ చేయగానే ఆపేసింది. తడిచేసిన కర్చీప్‌తో అతడి నోరు తుడిచింది.