‘‘నాకదంతా ఏం తెలియదు, ఏమైనా సరే నాకు బైక్‌ కొనివ్వాల్సిందే!’’ అన్నాడు శ్రీకాంత్‌ మొండిగా.‘‘అలా అంటే ఎలా నాన్నా! నీకు ఫీజులకీ, పుస్తకాలకే గాక బట్టలకీ, షూస్‌కీ చాలా ఖర్చయింది. ఆపైన ఫ్రెండ్స్‌కి పార్టీ ఇవ్వడానికి వెయ్యిరూపాయలు తీసుకువెళ్లావు. వీటన్నిటికీ డబ్బు సమకూర్చుకునేందుకు నాన్న ఎంతో కష్టపడాల్సివచ్చింది. మన పరిస్థితి ఏమిటో తెలిసి కూడా ఇప్పుడు బైక్‌ అంటున్నావు!’’ అంది శాంత నచ్చజెపుతున్నట్లుగా.

‘‘ఏమిటమ్మా, ఎప్పుడు చూసినా పరిస్థితి, పరిస్థితీ అంటూ బీదరుపులు అరుస్తారు? నేనెంతో కష్టపడి చదివి ఎం.సెట్‌లో మంచి ర్యాంక్‌ తెచ్చుకుని గవర్నమెంట్‌ కాలేజ్‌లో ఫ్రీ సీటు సంపాదించుకున్నాను. ప్రైవేటు కాలేజీలకు వేలకు వేలు గుమ్మరించే బాధ తప్పించాను మీకు. అది చూసి మెచ్చుకోవలసింది పోయి ఏది అడిగినా లేదంటారు. బి.టెక్‌లో చేరాక నా ఫ్రెండ్స్‌ అందరూ బైక్‌ వేసుకుని క్యాంపస్‌కి వస్తూంటే, నాకెలా ఉంటుందో ఆలోచించు! ‘మీ నాన్న అంతమంచి ఉద్యోగంచేస్తూ కూడా నీకు బైకే కొనివ్వలేరా’ అని అంతా నన్ను గేలిచేస్తున్నారు’’ అన్నాడు శ్రీకాంత్‌ కోపంగా.

అప్పుడే ఆఫీసు నుండి వచ్చిన రామారావు కొడుకు మాటలన్నీ విన్నాడు. ‘‘సరే లేరా బాధపడకు. నేను పి.యఫ్‌. లోనుకి అప్లయ్‌ చేశాను. అది వచ్చాక కొంటాలే!’’ అన్నాడు.తండ్రి ఇచ్చిన హామీతో తృప్తిపడిన శ్రీకాంత్‌ ‘‘థాంక్స్‌ నాన్నా!’’ అంటూ తన ఫ్రెండ్స్‌కి ఈ వార్త చెప్పేందుకు హుషారుగా వెళ్లిపోయాడు.కొడుకు వెళ్లాక ‘‘ఏమిటండీ మీరు మరీను, ఇప్పుడు అప్పుచేసి మరీ బైక్‌ కొనాలా? చిన్నపిల్లాడు, తెలియక ఏదో అడుగుతాడు. వాడికి బాధ్యత తెలియజెప్సాల్పిందిపోయి ఇలా ఎంకరేంజ్‌ చేస్తారెందుకు?’’ శాంత విసుక్కుంటున్నట్లుగా అంది.