అర్దరాత్రి చీకటి చిక్కంగా అల్లకపోయుందిఊరిమీద. దానేలు పొగాకుబేర్నీ పొయ్యిలోమొద్దులు వెయ్యడానికి తలుపు తీసేడు.అయిదారు పెద్ద పెద్ద చిల్ల మొద్దుల్ని పొయ్యిలోకి ఇసిరేశాడు. ఒక చిన్న కర్రకు తగులుకున్ననిప్పుతో చుట్ట ముట్టించుకొని రాగాలకర్రతో పొగాకుబేర్నీ పొయ్యి తలుపు మూసేసేడు.నులక మంచం మీద ఎల్లికలగా పడుకొనిచుట్టకు చుక్కలు చూపిస్తూ నిద్ర రాకుండాఉండేందుకు పద్యాలెత్తుకున్నాడు.

‘‘నాయాల కాల్తన్న కొట్టుకాడ నిద్రెట్టబట్టిన్దిరా’’ అన్న రూబేను అరుపుకి ఉలిక్కి పడి లేచాడు దానేలు. గబుక్కున బేర్నీ పొయ్యిసాయ చూసి ‘‘ఒర్నియ్యక్క ఇప్పుడేరా కళ్ళు మూసింద్యా.. అప్పుడేరెండున్నరయ్యిందా’’ అన్నాడు రూబెన్ని చూస్తూ.‘‘ఇంటికి బోయి పొడుకో పో. కొట్టుకాడ జాగర్తగా కనిపెట్టుకొని వుండద్దా ... అటీటయైుతే ఎంత నష్టమనుకున్న’’ అన్నాడు రూబేను.‘‘మాకు తెలుసులేసేయ్‌’’ అంటా డ్యూటీ దిగి ఇంటి బాట పట్టాడు దానేలు. డ్యూటీ ఎక్కేడు రూబేను.దానేలు ఇంటికి చేరుకోనేలికే మూడయ్యింది. లైటేసాడు. ఒక మంచంపై తన పెళ్ళాం పడుకొని వుంది. ఇంకో మంచపై ఉండాల్సిన కొడుకులేడు. ‘రేపొద్దున్నే ఈడి ఫోన్‌ పగలనూకాలి, అప్పుడు గాని దారికిరాడు’’ అనుకుంటా మిద్దె మీదకి వెళ్ళాడు.

కొడుకు దుప్పటి బిర్రుగా కప్పుకొని నిద్రపోతున్నాడు. ఆశ్చర్యపోయినట్టు చూసి కిందకి రమ్మందామని దుప్పటి లాగాడు. దానేలుకి గుండె నీరుకాయపడింది దుప్పటికింద కొడుకుని, వాడిని వాటేసుకొని పొడుకొని వున్న ఒక అమ్మాయిని చూసేసరికి. ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నారిద్దరూ. దానేలుకి ఏమి సెయ్యాలో అర్థంకాల. ఆ పిల్లెవురో అర్థకాల. కిందకి పరిగెత్తేడు.‘‘ఒసేయ్‌ న్నీయమ్మ నిద్రపోయింది సాల్లెయే ... ఆ నా కొడుకు ఎమ్జేసేడో సూడు’’ అంటా పెళ్ళాన్ని రెక్క పొట్టుకొని పైకి లేపాడు.

ఆంతున కూలబడింది గానీ నోట మాటరాల ఆమెకి, కొడుకుని అలా చూసే సరికి.‘‘మేయ్‌ సూసింది సాల్లే గాని వోడ్ని లేపు మే’’ అన్నాడు కోపం కలగలిసిన బాధతో.‘‘ఒరేయ్‌ ఎవుర్రా ఆ పిల్ల’’ అని అర్సింది.ఉలిక్కిపడి లేసేడు. ఆ పిల్ల కూడా లేసి ఎవురన్నట్టు వాడి వైపు చూసింది.‘‘మాయమ్మ.. నాన్న’’ అన్నాడు వాడు.‘‘నమస్కారం అత్తమ్మ.. నమస్కారం మావయ్యా’’ అనేసింది ఇక ఏమి అనాలో తెలియక.